Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 06

1Ariesమేషం

అనుకున్న పనులు సవ్యంగానే జరుగుతుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు బాగుం టాయి. గృహ, వస్తు, వాహన రిపేర్లుంటాయి. స్థాన మార్పుంటుంది. ఉన్నత విద్యలో కృషి బాగా చేస్తారు. ముఖ్యమైన పత్రాలు వస్తువులు జాగ్రత్త. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆదాయము సామాన్యము. వృత్తి వ్యాపా రాలు ఒక మోస్తరుగా ఉంటాయి.

 

2Taurusవృషభం

విద్యార్థులకు చదువుపై కంటే ఇతర విషయాలలో వ్యాపకం పెరుగుతుంది. సొంత పనులు జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. మిత్రులు, కుటుంబసభ్యుల కొరకు ఎక్కువ ఖర్చుపెడతారు. ఉద్యోగార్ధులకు ఇంటర్వ్యూ అవకాశాలు దొరుకుతాయి. సహచరులతో చిన్న మన స్పర్ధలుండగలవు. ఉద్యోగ, వృత్తులందు పనిభారం ఎక్కువ. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కలదు.

 

3Geminiమిధునం

శుభకార్యాలు నిర్ణయం కావడం, దూర ప్రయా ణాలు ఖరారు కాగలవు. షేర్లు పెట్టుబడులందు లాభా లుంటాయి. ప్రభుత్వ పరంగా అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. ఉద్యోగార్ధులకు ఇంటర్వ్యూ అవకాశాలు బాగుంటాయి. మిమ్మల్ని కాదనుకున్న వారు మరల చేరువ కాగలరు. ఆర్ధికంగా బాగుండి, ఆదాయం పెరుగుతుంది. ఆస్థి సమస్యలు పరిష్కారానికి రాగలవు.

 

4Cancerకర్కాటకం

షేర్లు, స్థిరాస్తుల మీద లాభాలుంటాయి. కొన్ని సొంత పనులకు ఆటంకాలు కలిగి తొలుగుతాయి. విద్యార్థు లకు చదువులో ప్రగతి ఉంటుంది. స్థిమితంగా ఉండ లేరు. టెన్షన్‌ ఎక్కువుగా ఉంటుంది. వృత్తిపరంగా గుర్తింపు, వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్ధిక ఒప్పందాలు, లావా దేవీలందు వ్యవహారం జాగ్రత్తగా నిర్వహించండి.

 

5Leoసింహం

మీ అభిప్రాయాలకు, ఆలోచనలకు మంచి విలువ ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. కుటుంబ వ్యక్తులకు భిన్న ఆలోచనలున్న కారణంగా సర్దుకొని పోవలసి ఉంటుంది. ఆరోగ్యం, ఆహార విషయాలలో జాగ్రత్తగా మెలగండి. అనుకున్న పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఆస్థి వ్యవహారాలు, ఋణాల విషయా లలో జాగ్రత్తగా వ్యవహరించండి.

 

6Virgoకన్య

తొందరపాటు నిర్ణయాలు తీసికొనవద్దు. ఆత్మీయు లతో చర్చించండి. వ్యాపారులకు ఆర్ధికావకాశాలు చేజారిపోవచ్చును. ఆశించినంత ప్రయోజనాలుండవు. తలపెట్టిన పని సరిగా జరగక నిరుత్సాహంగా ఉండడం, కోపం పెరగడం ఉంటుంది. బిల్లులు, చెల్లింపుల వత్తిడి ఎక్కువగా ఉంటుంది. క్రొత్త వస్తువులు కొంటారు. స్థాన మార్పులనే ఆలోచన కలుగుతుంది.

 

7Libraతుల

మంచి ఉన్నత విద్యావకాశాలు దొరుకుతాయి. ముఖ్యమైన పత్రాలు వస్తువులు జాగ్రత్త. గృహ మార్పులు గాని రిపేర్లు గాని ఉంటాయి. ఉద్యోగార్ధులకు సంకేతాలు సుముఖంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, బంధువు లతో గల విభేదాలు సర్ధుబాటు కాగలవు. వృత్తి వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి.

 

8Scorpioవృశ్చికం

క్రొత్తగా ఆహ్వానాలు అందుకొంటారు. విద్యావృద్ధికై గట్టి కృషి చేయవలసి వస్తుంది. క్రీడా శాస్త్ర సాంకేతిక కళా రంగాల వారికి మంచి అవకాశాలు దొరకగలవు. ఉద్యోగార్ధులకు అవకాశాలు బాగుంటాయి. అనుకోని అదనపు ఖర్చులుంటాయి. ఆరోగ్యం, ఆహార విషయా లలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా పెరుగుదల ఉం టుంది. ఆదాయం పెరుగుతుంది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులు అధికారులు, సహచరులతో జాగ్రత్తగా మెలగండి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉం టుంది. వివాదాస్పద విషయాలలో తల దూర్చకండి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. విద్యావృద్ధి కృషి బాగుం టుంది. స్టాక్‌ మార్కెట్‌ లాభాలనిస్తుంది. ఆస్థి వ్యవహా రాలను కొంత వాయిదా వేసికొంటే మంచిది. ఆర్ధిక ఇబ్బందులు క్రమంగా సర్దుబాటవుతాయి.

 

10Capricornమకరం

చెల్లింపులు సకాలంలో జరుపుతారు. ఏ రకమైన ప్రలోభాలకు మెత్తబడవద్దు. బంధువుల రాకపోకలుం టాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలపై దృష్టిపెడతారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు అవ కాశాలు దొరుకుతాయి. మీ పనులు జరగడానికి బంధు మిత్రులు సహాయపడతారు. అనవసర వ్యవహారాలలో కలుగచేసికొనవద్దు. బాకీలు కొంత లభించగలవు.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపారాలలో ఆదాయం బాగుంటుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. స్త్రీలు కొత్త వస్తువులు అందుకొనడం, కుటుంబ సమస్యలు సర్దుబాటు కావడం జరుగుతుంది. చదువులో పట్టుదల, కృషి చూపెడతారు. ఉద్యోగులు ఇతరుల నుండి వత్తిడులు, ధన ప్రలోభాలు ఎదుర్కొనవలసి వస్తుంది. చేపట్టిన ముఖ్య పనులకు ఆటంకాలు కలుగుతాయి.

 

12Piscesమీనం

ఋణాలు కొంత చెల్లించడం, అనవసర విషయా లలోనికి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు దొరక వచ్చును. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం సామాన్యము. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు చేజారిపోవచ్చును. గతించిన విషయాలపై చర్చలుం టాయి. ఆర్ధికంగా నిలద్రొక్కుకొనేందుకు కృషి చేస్తారు.

galpikaఅది వైయస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ కళ్యాణోత్సవం కావడంతో ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న, పాతిక ప్రపంచ మేటి నగరాలను ప్రపంచానికి ఒకే నగరంలో చూపించడానికి కృషి చేస్తున్న అమరావతి రాజధాని రూపశిల్పి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి దేవాలయంలోకి అడుగుపెట్టాడు. అంతే... ఆ క్షణంలోనే ఆకాశంలో పెద్ద ఉరుములు, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు... క్షణాల్లో ఈదురుగాలులు, పెద్ద పెద్ద వడగండ్లు... పది నిముషాలలో పెనువిధ్వంసం... పందిళ్ళు కూలిపోయాయి. స్థంభాలు పడిపోయాయి. అక్కడ వాతావరణం చెల్లాచెదురైంది. అప్పుడే సిబిఎన్‌ ఛానెల్‌ వాళ్లొచ్చారు. అక్కడ జరిగిన సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ... రిపోర్టర్‌ గ్యాస్‌ గన్నారావు స్టూడియోలో వున్న పుకార్ల పాపారావుతో... సార్‌ ఈరోజు రాష్ట్రానికెంతో శుభదినం... ఇదో అద్భుత మహిమాన్వితం... చరిత్రలో ఓ అపురూప ఘట్టం... మన ప్రియతమ ముఖ్యమంత్రి దేవాలయంలోకి అలా అడుగుపెట్టాడో లేదో ప్రకృతి పరవశించిపోయింది. వరుణుడు పులకించి వర్షపు ధారలను కాకుండా ఏకంగా వడగండ్లనే కురిపించాడు. అగ్ని దేవుడు ఉరుములు, మెరుపుల రూపంలో తన ఆశీస్సులందజేశాడు. వాయు దేవుడు ఈదురుగాలుల రూపంలో తన హర్షం ప్రకటించాడు. ఇలా రాములోరి కళ్యాణానికి చంద్రబాబు అడుగుపెట్టగానే సకల దేవతలు ప్రత్యక్షమై ఆనందాన్ని ప్రకటించారు పాపారావు... అని చెప్పాడు. ఈ అద్భుత సంఘటనపై శ్రీరాముడు, సీతాదేవిల స్పందన ఏంటో కనుక్కోలేకపోయారా గున్నారావుగారు అని స్టూడియో నుండి పాపారావు అడిగాడు. దానికి గున్నారావు... సీతారాములు షాక్‌లో వున్నారు. చంద్రబాబు పాదానికి ఇంత మహత్యం వుందా అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు... 'ఈ పాదం దివ్యపాదం ఈ పాదం మహిమపాదం' అని పాట పాడి.. ఇట్లు కెమెరాఉమెన్‌ మంగతో గ్యాస్‌ గన్నారావ్‌ అని చెప్పి ముగించాడు. కళ్యాణోత్సవం ముగిసాక చంద్రబాబు అమరావతికి వెళ్ళిపోయాడు. ఉండవల్లిలోని తన నివాసంలో కూర్చుని టీవీ ఆన్‌చేసి తనకిష్టమైన 'ఆత్మసాక్షి' ఛానెల్‌ పెట్టాడు. స్క్రీన్‌పై రోజా కనిపించింది. చంద్ర బాబు గుండె కలుక్కుమంది. రోజా మాట్లాడుతూ... మీరే చెప్పండి ఐరన్‌లెగ్‌ ఎవరిదో... చంద్రబాబు ఒంటిమిట్టలో అడుగుపెట్టగానే పెనువిధ్వంసం జరిగింది. ఐదుమంది చనిపోయారు. 60మంది గాయపడ్డారు. ఈయన గోదావరి పుష్కరాలలో అడుగుపెట్టినప్పుడు పాతిక మంది చనిపోయారు. ఆయన చేత కళ్యాణం చేయించు కోవడం ఆ రాముడికీ ఇష్టం లేదు. ఒరిజినల్‌ ఐరన్‌లెగ్‌ ఆయనదే అంటూ దుమ్మెత్తి పోయసాగింది. అది చూసి చంద్రబాబుకు బాధేసింది. వెంటనే పూజామందిరం వద్దకు వెళ్ళి... ''రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, దేవుడంటే నువ్వేలే రామయ్య తండ్రి'' అంటూ పాటందుకున్నాడు. పాట ప్రారంభలో ఉండగానే రాముడు, సీతా లక్ష్మణ హనుమత్సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. వారిని చూసి చంద్రబాబు... నా పాట పూర్తికాకుండానే భలే ప్రత్యక్షమయ్యారే స్వామి అని అడిగాడు. పాట పూర్తిగా వినే శక్తి మాకు లేదు నాయనా... పాట పూర్తిగా వింటే మా హనుమంతుడు కుప్పిగంతు లేస్తాడని చెప్పి ముందుగానే ప్రత్యక్షమయ్యాను. ఇంతకూ అంత మధురంగా పాటెందుకు పాడావు నాయనా అని రాముడు అడిగాడు. ఈరోజు ఒంటిమిట్టలో అలా ఎందుకు జరిగింది స్వామీ... నేనేం తప్పు చేసాను అని చంద్రబాబు ప్రశ్నించాడు. అందుకు రాముడు... ఈ ప్రశ్నకు నేను తర్వాత సమాధానం చెబుతాను. ముందు నాకు అమరావతి రాజధాని చూపించు... చాలా అద్భుతంగా కట్టారట కదా... ఈ విశ్వంలోనే అటువంటి నగరం లేదని మా దేవలోకంలో టాక్‌... ఇంద్రుడు కూడా తన అమరావతి నగరం మొత్తాన్ని పగలగొట్టి మీ అమరావతిలాగానే కట్టుకోవాలనుకుంటున్నాడట... అని అడిగాడు. దానికి చంద్రబాబు అలాగే అని చెప్పి వారిని తన కారెక్కించుకుని బయలుదేరాడు. ఒక చోట ఆపాడు. అందరూ క్రిందకు దిగారు. అక్కడ దాదాపు వందమంది దాకా వున్నారు. వారందరి కళ్ళకు నల్ల కళ్లద్దాలున్నాయి. మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావులు అక్కడ నిలబడి వారందరికీ... ఇదే అద్భుత అమరావతి రాజధాని... అదిగో సైబర్‌ టవర్స్‌... ఆకాశాన్ని తాకుతున్నాయి చూడండి... అది ఫైబర్‌ టవర్స్‌... ఆ రెండు వందల అంతస్తుల భవనం చూసారా? అదే ట్రేడింగ్‌ సెంటర్‌. ప్రపంచంలోనే ఇంత ఎత్తైన భవనం లేదు. మనం ఎదురుగా చూస్తున్నది ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే... అది 16లైన్ల రోడ్డు. అదిగో ఆ పట్టిసీమ నదిలో స్టీమర్లు చూసారా... అవి వివిధ దేశాల నుండి నేరుగా ఇక్కడికే వస్తాయి. అమరావతిని చూడడానికి విదేశీ పర్యాటకులు రావడానికి అనువుగా నేరుగా అమరావతికే జల మార్గాన్ని నిర్మించాము. ఆ దూరాన కనిపించేది ఫిలిం సిటీ. దీనిముందు హాలీవుడ్‌ స్టూడియో కూడా పనికి రాదు. అక్కడ విమానాలు వరుసపెట్టి దిగుతున్నాయి చూసారా అదే ఎయిర్‌పోర్టు. అదిగో బుల్లెట్‌లా దూసుకుపోతుంది చూసారా అదే బుల్లెట్‌ ట్రైన్‌... అని పర్యాటకులకు మంత్రులు దగ్గరుండి చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్నవేవీ అక్కడ శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హను మంతుడులకు కనిపించలేదు. శ్రీరాముడు అదే డౌట్‌ను చంద్రబాబు ముందు వ్యక్తం చేశాడు. అద్భుత రాజధాని అంటున్నారు... అది ఇది అంటున్నారు. మాకు ఇక్కడ బీడు పడ్డ నేల తప్పితే ఇంకేమీ కనిపించడం లేదని అన్నాడు. అందుకు చంద్రబాబు... అమరావతి రాజధానిని కళ్ళతో చూడకూడదు. కలల్లో చూడాలి, మనసుతో చూడాలి. కళ్ళు మూసుకుని మనసులో 'ఓం అమరావతాయనమః' అనుకోండి... ఈ రాజధాని మీకు అద్భుతంగా కనిపిస్తుందని చెప్పాడు. శ్రీరాముడు, మిగతా ముగ్గురు అలాగే కళ్ళు మూసుకుని మంత్రం చదివారు. ఈలోపు మంత్రి పి.నారాయణ తెచ్చిన స్పెషల్‌ నల్లకళ్ళజోళ్ళను ఆ నలుగురి కళ్ళకు పెట్టారు. వాళ్ళు కళ్ళు తెరిచారు. అంతే వారి కళ్ళకు అద్భుత భవనాలు, విశాలమైన రహదారులు, అందమైన బృందావనాలు, ఎయిర్‌ పోర్టులు, ఐటి పార్కులు... వాటిని చూస్తూ శ్రీరాముడు అద్భుతం, అపూర్వం... ఇది ఎలా సాధ్యమైంది అని అన్నాడు. చంద్రబాబు వెంటనే శ్రీరాముడి కళ్ళకున్న అద్దాలను తీసి ఇలా... అని అన్నాడు. అంతే రాముడి కళ్ళకు మళ్ళీ బీడుబారిన నేలే కనిపించసాగింది. ఏంటి చంద్రబాబు ఇదంతా అని రాముడు అడిగాడు. నేను ఊహించిన రాజధాని కట్టాలంటే ఎన్ని యుగాలు పడుతుందో తెలియదు. అందుకే ఈ త్రీడీ ఎఫెక్ట్‌ గ్లాస్‌ను ప్రత్యేకంగా చేయించాను. నా ఊహల అమరావతి అంతా కూడా ఈ గ్లాస్‌లలో పెట్టించాను. ఇది పెట్టుకుని చూస్తే అమరావతి చాలా అందంగా కనిపిస్తుంది. మా మీడియా వాళ్ళకు కూడా ఇవే గ్లాసులు పెట్టి అమరావతిని చూపించాను. వాళ్ళు అదే లోకంలో వున్నారు. ఇప్పుడు చెప్పండి... నా అమరావతి ఎలా ఉంది? అని చంద్రబాబు అడిగాడు. అప్పుడు రాముడు... ఇంతకుముందు నువ్వు అడిగావు కదా ఒంటిమిట్టలో అంత భీభత్సం ఎందుకు జరిగిందని... ఇలాంటి పనులు చేస్తుంటే అలాంటి ఉపద్రవాలే వస్తాయి నాయనా అని చెప్పి నా టైం వేస్ట్‌ చేసావంటూ తన టీమ్‌తో సహా మాయమయ్యాడు.

nippoనెల్లూరుజిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ నిప్పో ఫ్యాక్టరీ స్థలం. ఈ జిల్లాలో ఎటువంటి పారిశ్రామిక ప్రగతి లేని 1970 దశకంలోనే జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ భాగస్వామ్యంతో నెల్లూరు మరియు తడలలో ఇండోనేషనల్‌ లిమిటెడ్‌ పేరుతో నిప్పో బ్యాటరీ తయారీ పరిశ్రమలను స్థాపించి వేలాదిమంది కార్మికులకు ఆ పరిశ్రమలలో

ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్టేపాటి ఓబులరెడ్డి. ఆ కాలంలోనే ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. 'నిప్పో' ఫ్యాక్టరీని నెల్లూరు నగరానికి ఒక ల్యాండ్‌మార్క్‌గా మార్చారు.

నెల్లూరులో పరిశ్రమలను స్థాపించడానికి ఆయన భూమి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా 1972నవంబర్‌ 27వ తేదీన జిఓఎంఎస్‌ నెంబర్‌ 1230 ద్వారా 11.74 ఎకరాలు, 1973 మే 25వ తేదీన 2.16 ఎకరాల భూమిని కేటాయించారు. అప్పట్లో అక్కడున్న మార్కెట్‌ రేటు ప్రకారమే ఎకరా 4,200రూపాయల లెక్కన కొన్నారు. 1970 ప్రాంతంలో ఇప్పుడు నిప్పో స్థలం వున్న ప్రాంతం నెల్లూరుకు చాలా దూరంలో ఉండేది. ఆ రోజు చుట్టుపక్కల పట్టా భూములు కూడా అంతకంటే ఎక్కువ ధర వుండేది కావు. ఆరోజు నిప్పో ఓబుళరెడ్డి పరిశ్రమను పెడతానని చెప్పి ప్రభుత్వం నుండి ఉచితంగా భూమిని తీసుకోలేదు. కనీసం రిజిష్టర్‌ రేటుకు కూడా తీసుకోలేదు. మార్కెట్‌ రేటుకే కొన్నాడు. ఆరోజు చుట్టుపక్కల వున్న భూముల ధరలు కూడా అంతే! కాలక్రమేణా నగరం విస్తరించింది. ప్రస్తుతం నగరం నిప్పో ఫ్యాక్టరీని కూడా దాటిపోయింది. నగరం విస్తరించడం, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ వంటి పరిణామాల వల్ల 'నిప్పో' ప్రాంతంలో స్థలాలకు విపరీత మైన రేట్లొచ్చాయి. నిప్పో స్థలం అప్పటి నుండి ఒకే యాజమాన్యం క్రింద వుంది. ఆ చుట్టుపక్కల అంటే వేదాయపాలెం, చంద్రమౌళినగర్‌, ఏ.కె.నగర్‌, కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌ ప్రాంతాలలో ప్రైవేట్‌ వ్యక్తులు తమ భూములను 1970 నుండి అమ్ముకుంటూ వచ్చారు. ఇలా ఎకరాలు పోయి అంకణాలలోకి వచ్చేసరికి ఈ కాలానికి అంకణం 2లక్షల నుండి 7లక్షల దాకా అయ్యింది. ఎకరా లెక్క అయితే 8కోట్ల పైమాటే! 'నిప్పో' యాజమాన్యానికి చెందిన 13.90 ఎకరాలకు ఖరీదు కడితే దాని విలువ వంద కోట్లకుపైనే వుంటుంది.

ఇప్పుడు నిప్పో స్థలంపై వివాదం జరగడం చూస్తూనే వున్నాం. చుట్టుపక్కల నగరం విస్తరించిన నేపథ్యంలోనైతేనేమీ, బ్యాటరీల మార్కెట్‌లో వచ్చిన ఒడిదుడుకుల వల్లనైతేనేమీ, పెరిగిన కాలుష్యం వల్లనైతేనేమీ ఫ్యాక్టరీని తీసేయాలనుకుంటున్నారు. ఈ స్థలాన్ని పారి శ్రామిక జోన్‌ నుండి గృహ, వాణిజ్య వినియోగజోన్‌గా మార్చమని నిప్పో యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఒకటికి రెండుసార్లు కౌన్సిల్‌ చర్చ జరిగింది. అయితే కొందరు నాయకులు దీనిపై వివాదం చేస్తున్నారు. 'నిప్పో' ఫ్యాక్టరీ భూములు ప్రభుత్వానివని, అక్కడ ఫ్యాక్టరీని తీసేస్తే స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ళు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటి హాళ్ళు కట్టించాలని కొందరు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిప్పో స్థలం ఏ నిబంధనల క్రింద ప్రభుత్వం ఇచ్చిందన్నది ఇక్కడ ప్రధాన అంశం! ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు భూములను అమ్మినప్పుడు కొనుగోలుదారులకు పూర్తి హక్కు వస్తుంది. ఆరోజు ప్రభుత్వం నుండి కాకుండా ఓబుళరెడ్డి ప్రైవేట్‌ వ్యక్తుల నుండి పట్టాభూములు కొనివున్నా అదే రేటు... ఈరోజు అసలు గొడవే వుండేది కాదు. పరిశ్రమ పెడుతున్నాడు కాబట్టి ప్రభుత్వం తక్కువ ధరకు ఆ భూమిని ఇచ్చివున్నా లేదా ఇన్ని సంవత్సరాలు అని లీజును నిర్ణయించివున్నా దానిపై నిప్పో యాజమాన్యానికంటే ప్రభుత్వానికే ఎక్కువ హక్కుంటుంది.

రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్‌ కంపెనీలకు, విద్యాసంస్థలకు, అంతెందుకు పత్రికా కార్యాలయాలకు కూడా మార్కెట్‌ రేటు ప్రకారమే ప్రభుత్వం భూములు కేటాయించి వుంది. ఎన్ని వార్తా సంస్థలు, ఎన్ని విద్యా, వ్యాపార సంస్థలు తమ సంస్థలను మూసేయలేదు. అవన్నీ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాయా? అందరూ శుభ్రంగా అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో వాళ్ళకొక న్యాయం, నిప్పో యాజమాన్యానికి ఒక న్యాయమా? నిప్పో స్థలం ఇండస్ట్రియల్‌ జోన్‌లో వుంది. దానిని కన్వర్షన్‌ చేయడం, చేయకపోవడం అనేది ప్రభుత్వ ఇష్టం. కాని, మార్కెట్‌ రేటుపై కొన్న ఆ భూమిపై నిప్పో యాజమాన్యానికి హక్కు వుంటుంది. ఆరోజు ఎకరాకు 4,200 రూపాయలు మంచి రేటు. ఈరోజు కోట్లు పలుకుతుండబట్టే ఇన్ని వివాదాలొస్తున్నాయి. ఏ పదివేలో పాతికవేలో అయ్యుంటే దాని గురించి ఇంత రాద్ధాంతం వుండేది కాదు. రాష్ట్రంలో ఇలా కేటాయించిన భూములను ఎందరో అమ్ముకున్నారు. నెల్లూరులో ఒకప్పుడు స్పిన్నింగ్‌ మిల్లు వున్నటువంటి ప్రస్తుత రిత్విక్‌ లేఅవుట్‌ను ప్రభుత్వమే వేలం వేసి అమ్మగా ప్రస్తుతం టీడీపీ ఎంపీగా వున్న సీఎం రమేష్‌ కొని లేఅవుట్‌ చేయడం తెలిసిందే! ఆ లేఅవుట్‌లోనే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి గారి నివాసం కూడా వుంది. ఇలా ఎన్నో ప్రభుత్వ భూములను ప్రభుత్వమే అమ్మేసుకుంది.

ప్రభుత్వం ఎవరికి భూములు కేటాయించినా నిబంధనలలో ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఆ భూమిని తిరిగి తీసుకునే విధంగా వ్రాసి వుంటారు. ప్రభుత్వానికి అవసరమంటే కొత్తరోడ్డు వేస్తుంటేనో, రైలు మార్గం వేస్తుంటేనో ప్రభుత్వ అవసరాలకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం కూడా ఇవ్వాల్సి వుంటుంది. ఎందు కంటే ఉచితంగా ఇచ్చిన అసైన్డ్‌, సిజెఎఫ్‌ఎస్‌ భూములను ప్రభుత్వం అవసరంకొద్ది తీసుకుంటున్నప్పుడు ఆ భూములు సాగుచేస్తున్న రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. అలాంటిది మార్కెట్‌ రేటు ప్రకారం కొన్న భూములకు నష్టపరిహారం వుండదా?

ప్రభుత్వ అవసరాల కోసం ఇప్పుడు నిప్పో భూములు తీసుకోవా లనుకోవడం లేదు. వాటి విలువ పెరిగింది కాబట్టే వివాదం చేస్తున్నారు. మరి ఈ భూమిపై నిప్పో యాజమానికి హక్కు లేనప్పుడు, వాళ్ళు ఫ్యాక్టరీ ప్రాంగణంలో సాయిబాబా గుడికి స్థలం ఇస్తే ఇప్పుడు వివాదం చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు మౌనంగా వున్నారు.

నిప్పో ఫ్యాక్టరీ స్థలం ఎవరికి చెందుతుందన్నది నాయకులు నిర్ణయించేది కాదు, దీనిపై లోతుగా పరిశీలన జరిపితేనే పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రంలో భూములను తీసుకుని ఎత్తేసిన పరిశ్రమలు చాలావున్నాయి. వాళ్ళందరి నుండి ప్రభుత్వం భూములను తిరిగి తీసుకుందో, లేక వాళ్ళు అమ్ముకుని వెళ్ళారో... వివరాలు పూర్తిగా రాబడితే నిప్పో సమస్యకు కూడా అదే మార్గం వర్తిస్తుంది.

Page 9 of 1029

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter