anam ramదాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి ముందే టీడీపీపై ఆనం సోదరులు అసంతృప్తితో వున్నారన్న వార్త గుప్పుమంది. ఇది తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో వున్న సమయంలో వివేకాను పరామర్శించడానికి వెళ్ళారు. వివేకా అంత్యక్రియలు రోజున నెల్లూరొచ్చారు. ఆనం కుటుంబసభ్యులతో దాదాపు ముప్పావుగంట చర్చించి రాజకీయంగా మీకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆనం సోదరులు పార్టీని వీడిపోయే పరిస్థితి దాకా ఎందుకు తీసుకొచ్చారంటూ జిల్లా మంత్రులిద్దరినీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని చంద్రబాబు తిట్టారు. నచ్చజెప్పి ఆనంను పార్టీలో నిలబెట్టుకున్నా మనుకునేంతలోనే కథ అడ్డం తిరిగింది. గత నెలలో నిర్వహించిన ఆత్మకూరు, నెల్లూరురూరల్‌ నియోజకవర్గాల మహానాడుల్లో పాల్గొన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీద విమర్శలు ఎక్కుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన పాల్గొన్న చివరి కార్యక్రమా లవే! ఆ తర్వాత నెల్లూరులో జరిగిన జిల్లా మహానాడుకు గాని, విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మహానాడుకు గాని ఆయన హాజరు కాలేదు. దాంతోనే ఆయన ఇక తెలుగుదేశంలో వుండడనే విషయం అర్ధమైంది.

బొత్సనే వారధి...

వాస్తవానికి ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవడానికి వైసిపి అగ్ర నాయకత్వంలో అంతగా ఆసక్తి లేదు, ఎందుకంటే గతంలో వై.యస్‌ కుటుంబంపై వారు చేసిన వ్యక్తిగత విమర్శలే కారణం. అయితే 2014లో ఇలా పట్టించుకుని కొందరిని పార్టీలోకి తీసుకోక పోబట్టే నష్టపోయామని, రాజకీయాలలో ఇవన్నీ కామన్‌ అని బొత్స వంటి నాయకులు జగన్‌కు నచ్చజెప్పి ఆనంకు వైసిపిలో లైన్‌క్లియర్‌ చేసారు. టీడీపీలో వున్నా ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరులో వైసిపికి బలమైన ప్రత్యర్థి అవుతాడు. అతనిని వైసిపిలోకి లాక్కుంటే టీడీపీకి బలమైన అభ్యర్థే వుండడు. ఈ లాజిక్‌తోనే ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రాజీనామానే తరువాయి...

తాను పార్టీ మారడంపై రెండు నెలలుగా వూహాగానాలు జరుగుతున్నా ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడా దీనిపై బహిరంగంగా మాట్లాడలేదు. కాని 13వ తేదీ తొలిసారిగా మీడియా ముందు నోరు విప్పాడు. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక పోతున్నామని చెప్పకనే తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. ఈ విషయమై ఆత్మకూరు నియోజక వర్గంలోని తన అనుచరులతో పాటు జిల్లా వ్యాప్తంగా వున్న తన అనుచరులు, మిత్రు లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసే అవకాశా లున్నాయి. మరి వైకాపాలో ఎప్పుడు చేరుతాడన్నది నిర్ణయం జరగాల్సివుంది. జూలై 8వ తేదీ వై.యస్‌. జయంతి రోజు ఒకవేళ జగన్‌ సమక్షంలో ఆయన పాదయాత్రలో ఎక్కడుంటే అక్కడకు వెళ్ళి చేరే అవకాశాలున్నాయి.

ఏ సీటు నుండి పోటీ...

ఆనం రామనారాయణరెడ్డిని వైసిపిలోకి తీసుకోవాలన్న ఆలోచనకు బీజం వేసింది ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి. వైసిపి అధికారంలోకి రావాలని, జగన్‌ సీఎం కావాలనే లక్ష్యంతో వున్నాడు. అందుకే ఆనం పార్టీలోకి వస్తే ఆత్మకూరు సీటును వదులుకోవడానికి సిద్ధమన్న సంకేతాలు ఇచ్చాడు. అయితే... పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశాలున్న సమయంలో సిటింగ్‌ సీటు వదులుకోవడం ఎందుకని కుటుంబసభ్యులు చేసిన సూచనతో తాను ఆత్మకూరు నుండే పోటీ చేస్తానని మళ్ళీ స్టేట్‌మెంటిచ్చాడు. ఇప్పుడు రామనారాయణరెడ్డికి సీటు ఎక్కడా అన్నది మేకపాటి గౌతం నిర్ణయంపై కూడా ఆధారపడి వుంటుంది. మేకపాటి కుటుంబసభ్యులకు 2014ఎన్నికల్లో లోక్‌సభ, రెండు అసెంబ్లీ సీట్లిచ్చారు. ఈసారి కూడా వారికి మూడుసీట్లే ఇస్తే రామనారాయణరెడ్డికి వెంకటగిరి నుండి పోటీ చేసే ఛాన్స్‌ వుంటుంది. గౌతం ఆత్మకూరును వదులుకుంటే ఆనం ఆత్మకూరు నుండే పోటీ చేయాల్సి రావచ్చు. ఇది కాకుండా మేకపాటి కుటుంబసభ్యులు అసెంబ్లీల వరకే పోటీచేసినా లేదా ఒకరు నరసారావు పేట లోక్‌సభకు వెళ్ళినా ఆనంకు నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కలగొచ్చు.

టీడీపీలో ఎవరి వైఫల్యం...

2015లో ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారు. ఆరోజు అవసరం లేక పోయినా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడేళ్ళు కూడా కాంగ్రెస్‌పార్టీలోనే ఉం డుంటే వారి మీద గౌరవంగా వుండేది. చంద్రబాబుతో పాటు జిల్లా మంత్రి నారాయణ కూడా వారిని టీడీపీలోకి తీసుకెళ్ళడంలో ప్రధానపాత్ర పోషించారు. ఆరోజు మంత్రిగా కాదు, ఎమ్మెల్సీగా కూడా లేనటువంటి సోమిరెడ్డికి ఈ విషయంలో ఎటువంటి పాత్ర లేదు. ఆనంకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు, నారాయణలు విఫల మయ్యారు. కాని, ఆనం మాత్రం పార్టీని వదిలే ముందు సోమిరెడ్డిని తిట్టిపోతున్నాడు. ఇదే పెద్ద కామెడీ!

మొత్తానికి ఆనం పార్టీ మార్పుపై సందేహాలు తొలగిపోయాయి. క్లారిటీ వచ్చింది. వైసిపిలో చేరే తేదీనే ఖరారు కావాల్సివుంది.

polavaramపోలవరం... ఆంధ్రప్రదేశ్‌కు వరం. తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులుండవు.

ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా ప్రధాన అంకం కాలువల నిర్మాణం. డ్యాం అన్నది ఒక చోట కట్టడానికి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాని ఏళ్ళ తరబడి కట్టాల్సింది, కొన్నేసిసార్లు కోర్టుల్లో కేసుల వల్ల ఆగేది కాలువల నిర్మాణమే! అదీగాక కాలువల నిర్మాణానికి భూసేకరణ కూడా పెద్ద సమస్య. దీన్ని పసిగట్టాడు కాబట్టే వై.యస్‌. ముందుగా పోలవరం కాలువలను మొదలుపెట్టించాడు. కాలువలు పూర్తయ్యాక డ్యాం నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ప్రణాళిక. దురదృష్టవశాత్తు 90శాతం కాలువలు నిర్మాణం జరగ్గానే ఆయన హఠాన్మరణం చెందారు. పోలవరం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. గత యూపిఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్‌ను చేర్చడం తెలిసిందే! 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆచరణలోకి తెచ్చింది. అయితే ప్రత్యేకహోదా డిమాండ్‌ను వదిలేసి ప్రత్యేకప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా తమకు అప్పగిస్తే తామే కట్టుకుంటామని చెప్పాడు. ఇది కేంద్రం మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో ఆ ప్రాజెక్ట్‌ మేం చేస్తామన్నాడో ఆ తర్వాత బీజేపీ నాయకులకు తెలిసింది. 16వేల కోట్ల అంచనాలను చంద్రబాబు 56వేల కోట్లకు తీసుకుపోయాడు. ఈ అంచనాలను చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేసారు. ప్రాజెక్ట్‌పై పెట్టిన ఖర్చుకు కేంద్రం యుసిఆర్‌లు అడగడం, పక్కాగా లెక్కలు చెప్పలేక చేతులెత్తేసిన చంద్రబాబు అసెంబ్లీలోనే పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యతను కేంద్రమే చూసుకోవాలని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న 'ట్రాక్స్‌ట్రాయ్‌' కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ పనులను నత్తనడకన సాగిస్తుంటే అప్పుడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీ జోక్యం చేసుకున్నారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేసిన నవయుగ ఇంజనీరింగ్‌ యాజమాన్యాన్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఒక్క ఏడాదిలో పోలవరం కాంక్రీట్‌ పనులను పూర్తి చేయగలరా అని వారిని అడిగాడు. అందుకు వాళ్ళు పాతరేట్లతోనే డ్యాం కాంక్రీట్‌ పని పూర్తి చేయడానికి అంగీకారం తెలిపారు. దీంతో ఎంఓయూ కుదిరింది. ఈ పనితో లాభం వస్తుందా లేదా అని ఆలోచించకుండా నవయుగ సంస్థ రంగంలోకి దిగింది. వేలమంది సిబ్బందిని, ఇంజనీర్లను, వేల సంఖ్యలో వాహనాలను, మిషినరీని సిద్ధం చేసింది. తక్షణమే కాంక్రీట్‌ పనులను మొదలుపెట్టింది. రేయింబవళ్ళు పనిచేస్తూ నితిన్‌గడ్కరీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ఇప్పుడు ఏ పని వేగవంతంగా జరుగుతున్నా అది నితిన్‌గడ్కరీ పుణ్యమే. పని ఆయనదైతే ఫోజులు మాత్రం చంద్రబాబువయ్యాయి. డయాఫ్రంవాల్‌ అంటూ శంకుస్థాపన... ప్రపంచ రికార్డు నిర్మాణం అంటూ పచ్చ మీడియాలో వార్తలు... సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో!

babu2014 ఎన్నికల్లో వైసిపి పరాజయానికి టీడీపీ విజయానికి అనేక కారణా లున్నాయి. మోడీ ఇమేజ్‌, పవన్‌కళ్యాణ్‌ మద్దతు, ఋణమాఫీ, చంద్రబాబు అను భవం, జగన్‌పై అవినీతి కేసులు, అతనిపై మతపరమైన ముద్ర... ఇతరత్రా కారణాలు. ఇవే కాదు, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కోర్టులు కూడా పరోక్షంగా దోహదం చేసాయి.

అదెలాగంటే... 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వ హించాలనే ఆలోచన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు, అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేసారు. అయితే కొందరు వేసిన పిటిషన్‌లను విచారించిన హైకోర్టు, అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, ఫలితాలను మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రకటించాలని తీర్పునిచ్చింది. దీంతో ముందుగా స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దీని మూలంగా గ్రామాలలో గ్రూపులు ఏర్పడ్డాయి. వై.యస్‌. అభిమానులు కొన్నిచోట్ల స్థానికంగా వున్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంలోకి వెళ్ళాల్సిన పరిస్థితులొచ్చాయి. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశంకు పనిచేసిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే వుండిపోయారు. దానివల్ల వై.యస్‌. సానుభూతి ప్రభావం పనిచేయకుండాపోయింది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించడం తెలుగుదేశంకు బాగా కలిసొచ్చింది!

మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న? పంచాయితీ ఎన్నికల గడువు అయిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. కాని, ముందుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ప్రభు త్వానికి వ్యతిరేకంగా వస్తాయనే అంచనా వుంది. పంచాయితీ ఎన్నికలు పూర్తిగా గ్రామాలు, పల్లెటూర్లకు సంబంధించినవి. ఎక్కువుగా రైతులతో సంబంధం వున్న ఎన్నికలు. ఈ నాలుగేళ్ళలో రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. ఋణమాఫీ పెద్ద ఫ్లాప్‌. ఇక పంటలకు గిట్టుబాటుధరలు లేకపోవడర వంటి సమస్యలు వుండనే వున్నాయి. పంచాయితీల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు వెళ్ళాలి. ఇవి కూడా గ్రామాలకు సంబంధించిన ఎన్నికలే! ఈ ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఈ రెండు ఎన్నికల ప్రభావం తర్వాత నిర్వహించాల్సిన కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలపై పడుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ సరళి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఇది ఊహించబట్టే చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి అయిష్టంగా వున్నట్లు తెలుస్తోంది.

Page 1 of 78

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter