16 March 2018 Written by 

అన్నదాత ఆగ్రహిస్తే...

farmersఅదేమి వింతపోకడో తెలియదు గానీ, ఏలినవారికి జనం సమస్యలు తెలిసినా పట్టనట్లుంటుంటారు. ఎన్నిసార్లు తమ కష్టాలను కుయ్యోమొర్రోమంటూ విన్నవించుకున్నా 'సరే చూద్దాం..చేద్దాం' అంటూ నాన్చేస్తుంటారు. ఇక ఆ కష్టాలు భరించలేకనో, లేదా నేతల నిర్లక్ష్యాన్ని సహించలేకనో ఆగ్రహం ప్రదర్శించి ఏ నిరసనలో, అందోళనలో చేస్తే.. నాయకులు ఇక తప్పదన్నట్లుగా అప్పుడు 'అన్నీ చక్కదిద్దుతామని' చెప్పి చేతులు దులుపుకుంటుంటారు. ఇవన్నీ మనం చూస్తున్నవే. రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమై పోతున్నాయి. అయితే, అన్నిటికీ ఒకే మంత్రం పనికిరాదు. అందులోనూ, అందరికీ అన్నం పెట్టే అన్నదాతల విషయంలో నాయకులు నిర్లక్ష్యం ప్రదర్శించడం మంచిదికాదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే, జై కిసాన్‌ అంటూ జైజైలు కొడుతూనే.. రైతన్నే లేకపోతే దేశానికి అన్నం పెట్టేదెవరు?.. అంటూనే, మరోవైపు ఆ కర్షకుల కన్నీటిని మాత్రం పట్టించుకోకపోవడం ఎంత బాధాకరమో!..అందులోనూ వ్యవసాయమే ప్రధానంగా ఉన్న మన దేశంలో ఏళ్ళ తరబడిగా రైతుల పరిస్థితిని కానీ, రైతు కుటుంబాల దయనీయ స్థితిని గానీ పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం. పచ్చని పంటపొలాలతో దేశాన్ని పత్రహరితం చేసి, సస్యశ్యామలం చేసే రైతుల బాధలను నిర్లక్ష్యం చేయడం కంటే ఘోరమైన విషయం ఇంకోటుం టుందా?.. ఇవన్నీ నేతలకు తెలియని విషయాలేమీ కావు. కానీ, వారి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కాలాలు మారినా, తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా... నేతలే మారినా చివరికి అన్న దాతల తలరాతలు మాత్రం మారనే మారడం లేదు. వారి కష్టాలు మాత్రం తీరనే తీరడం లేదు. సేద్యానికి పొలం వద్దకు వెళ్ళినకాడి నుంచీ ఎన్నో రకాల సమ స్యలు. పంట పండేదాకా ఎన్నో బాధలు, వ్యయప్రయాసలు. దీంతో ఇంటినిండా అప్పుల కుప్పలు. ఎలాగో ఆరుగాలం కష్టించి, చెమటోడ్చి పంటలు పండించినా చివరికి తిండిగింజలు ఇంటిదాకా వస్తాయన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఏ అకాల వర్షానికో పంట నీట మునిగిపోవచ్చు. లేదా సరైన గిట్టుబాటు ధరలు లేక చేసిన కష్టమంతా నష్టాల పాలుకావచ్చు. రైతన్నలు ఇలా ఏళ్ళ తరబడి బాధల సుడిగుండాల్లో మునిగిపోతూ..వారి కుటుంబాలు అప్పుల నిప్పుల్లో కాగిపోతుంటే.. రైతు తనకు తనే కరిగిపోయిన కన్నీటిముద్ద అవుతాడే తప్ప, ఎవరికీ ఆ బాధను తెలియనివ్వడు. చిరునవ్వుతోనే మళ్ళీ సేద్యం చేసి పంటలు పండించాలనే తపనతో.. పొలాలవైపు అడుగులువేసే అత్యంత సహనశీలి..అన్నదాత. అందుకే, సహనంలో భూమాత తర్వాత అంతటి స్థానం అన్నదాతదే నంటుంటారు పెద్దలు. అలాంటి అన్నదాతలో సహనం నశిస్తే..అన్నదాతకే అగ్రహం వస్తే... ఏమవుతుంది?.. సాగరములన్నీ ఏకము గాకపోవచ్చుగాక... ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. సరిగ్గా ఇప్పుడు ముంబైలో జరిగింది కూడా ఇదే. ఏళ్ళ తరబడిగా తమ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వతీరుపై రైతులు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాలను సంపూర్ణంగా అందజేయాలని, విద్యుత్‌ బిల్లులను మాఫీ చేసి ఆదుకోవాలని, విపత్తుల్లో దెబ్బతిన్న బాధిత రైతాంగానికి బాసటగా ఉంటూ తగు పరిహారం అందించాలని, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న అటవీభూములను వారికే కేటాయించాలని, స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని తదితర డిమాండ్ల సాధనకు రోడ్డెక్కారు. వేలాదిమంది నినాదాలు చేస్తూ రోడ్డెక్కడంతో ముంబైవాసులు సైతం ఆశ్చర్యపోయారు. ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసుకున్నా తమను పట్టించుకోని మొండిసర్కారు అవాక్కయ్యేలా చేసేందుకు.. ఎవరూ ఊహించనివిధంగా సుమారు 60వేల మంది కర్షకులు 'మహాపాదయాత్ర' చేసి రైతన్న ధీశక్తి ఏమిటో ప్రభుత్వానికి కళ్ళారా చూపించారు.. కాళ్ళారా నడిచి మరీ చూపించారు. దాదాపు 180 కిలోమీటర్ల దూరం..ఎండను సైతం లెక్కచేయక.. కాళ్ళు కాలుతున్నా కఠోరదీక్షతో పాదయాత్ర చేశారు. ఎండదెబ్బకు కాళ్ళు మాడిపోయి పుండ్లు పడినా మహిళా రైతులు సైతం రోడ్డుమీంచి పక్కకు వెళ్ళలేదు. యాత్ర వారం రోజులపాటు ఎంతో క్రమశిక్షణగా ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సాగడం మరో విశేషం. ఇది రైతుల లాంగ్‌మార్చ్‌గా అందరి కితాబును అందుకో వడం వేరే విషయం. తమ కష్టాలు తీర్చాలంటూ, రాజ్యాంగబద్ధమైన తమ హక్కుల సాధన కోసం వేలాదిమంది రైతులు నాసిక్‌ నుంచి ముంబైకి పాద యాత్రగా బయలుదేరారు. కర్షకులంతా వేలాదిగా కదలివస్తున్న దృశ్యం చూసి ముంబై అవాక్కయింది. ఆ మహాకర్షక జనసముద్రాన్ని చూసి ముంబైవాసు లంతా నివ్వెరపోయారు. ఆయాప్రాంతాల్లో జనం వారిని ఆదరించి స్వాగతించారు. నీళ్ళు, బిస్కెట్లు అందించారు. ఆ కష్టజీవులకు రెండుచేతులా తమ సౌహార్ద్రాన్ని అందించారు. సిపిఎం అనుబంధసంస్థ అయిన అఖిలభారత కిసాన్‌సభ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది. ఈ మహాపాద యాత్రతో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం దిగివచ్చింది. ప్రతిపక్షాలతో పాటు, శివసేన నాయకుల వత్తిడితో అన్నదాతలు కోరిన కోరికలన్నిటినీ తీర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు కర్షకులు శాంతించారు. తమ అందోళన విరమించారు. ఇది రైతుల ఘనవిజయంగా అందరూ కొనియాడారు.

అయినా, ఆ శ్రమజీవుల కష్టాలను ప్రభుత్వాలు ఇన్నేళ్ళుగా పట్టించుకోకపోవడం.. వారు ఎండల్లో రోడ్లెక్కి పాదయాత్రలు చేసే దుస్థితిని తీసుకురావడం ఎంత బాధాకరం?.. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను నిర్లక్ష్యం చేయడం, వారి బాధలు తీర్చకపోవడం ఎంత విచారకరం. ఇకనైనా ప్రభుత్వాలు.. పాలకుల తీరు మారాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వదిలి అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకోవాలి. మాటలతో రైతులను మభ్యపెట్టక..చిత్తశుద్ధితో వారిని ఆదుకోవాలి. సమాజానికి..దేశానికి.. అందరికీ అన్నం పెట్టే రైతన్న కంటనీరు పెట్టుకునే దుస్థితి ఇకనైనా పోవాలి. కర్షకులు, వారి కుటుంబాలు చల్లగా పదికాలాలపాటు జీవించినప్పుడే అందరికీ ఆనందం. అదే..దేశానికీ సౌభాగ్యం!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter