Friday, 09 February 2018 11:05

ట్రంప్‌కు ముచ్చెమటలు పట్టించిన బాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaప్రపంచంలోని 116 మేటి నగరాలను మిక్సీలో వేసి గ్రైండ్‌చేసి తీసిన అమరావతి నగరమది. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. అప్పుడే పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఏపికి మొండి చేయి చూపించారు. ఈ పరిణామంపై సానుభూతి తెలపడం కోసంగా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్‌లు కూడా వచ్చారు. అప్పుడే ఏ టివి, ఏబిసిడి చానెల్‌, టీవీ 9I9=99, టీవీ 2.5 ఛానెల్స్‌ ప్రతినిధులు వచ్చారు. ఇక అప్పుడు చంద్రబాబు తన విశ్వరూపం చూపడం మొదలుపెట్టాడు. అసలు ఏమనుకుంటున్నారు ఈ బీజేపీ వాళ్ళు... బడ్జెట్‌లో మనకు మొండిచేయి చూపిస్తారా? ఇప్పటివరకు నన్ను ఒక వైపే చూసారు. రెండోవైపు చూడాలనుకోవద్దు... తట్టుకో లేరు... మాడి మసైపోతారు. సింహంతో వేట... ఈ చంద్రబాబుతో ఆట వద్దు... నా మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు... నా మౌనం తుఫాన్‌ ముందర ప్రశాంతతలాంటిది. నాదెబ్బకు పి.వి. నరసింహారావు, వాజ్‌పేయిలే పంచెలు తడుపుకున్నారు. ఈ మోడీ, అమిత్‌షాలు ఒక లెక్క... ఇక చెప్పండి ఆ మోడీకి... నిన్నటివరకు ఒక లెక్కా... ఈరోజునుండి ఒక లెక్క... నాతో గేమ్స్‌ ఆడాలను కున్నారో... ఖబడ్దార్‌ అంటూ గట్టిగా తొడ చరిచాడు. ఆ సౌండ్‌కు సోమిరెడ్డి కొంచెం షేకయ్యి అటు ఇటూ వూగాడు. చంద్రబాబు ఆవేశపు డైలాగ్‌లు, హెచ్చరికలను షూట్‌ చేసిన ఏబిసిడి ఛానెల్‌ వాళ్లు అప్పటికప్పుడు బ్రేకింగ్‌ న్యూస్‌ మొదలుపెట్టారు. బడ్జెట్‌పై ఆగ్రహించిన చంద్రబాబు... పతనానికి చేరువలో ఎన్డీఏ ప్రభుత్వం... బాబు వార్నింగ్‌తో జడుసుకుంటున్న మోడీ... చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు దూతలుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి... సహనం, సంయమనం పాటించాలని, దేశంలో శాంతిభద్రతలను కాపాడాలని చంద్రబాబును కోరిన ఎన్డీఏ మిత్రపక్షాలు... ఏబిసిడి ఛానెల్‌లో ఇలా చంద్రబాబు గురించి ప్రత్యేక కథనాలే ప్రసారం కాసాగాయి.

బడ్జెట్‌పై ప్రెస్‌కు స్టేట్‌మెంట్లిచ్చాక చంద్రబాబు తన గదిలో కొచ్చి కూర్చున్నాడు. అప్పుడే ఆయన ఫోన్‌ రింగయ్యింది. ఆయన ఎడమకన్ను అప్పుడే అదిరింది. ఇది ఖచ్చితంగా ఢిల్లీ ఫోనే అను కుంటూ ఫోన్‌ తీసి ఆన్‌ చేశాడు. అవతల నుండి అమిత్‌షా... ఏం చంద్రబాబు గారు బాగున్నారా, ఇప్పుడే ఏబిసిడి ఛానెల్‌లో మీ ఇంటర్వ్యూ చూసాను సూపర్‌... మాకు భలే వార్నింగ్‌ ఇచ్చారు. మీరిచ్చిన వార్నింగ్‌తో మోడీకి జ్వరం వచ్చి ఇంట్లో ముసుగేసుకుని పడుకుని వున్నాడు. నాకైతే దడ తగ్గలేదు. ఏదో మీ ముందు చిన్న పిల్లలం. మమ్మల్ని అలా బెదిరిస్తే ఎలా సార్‌... అని వెటకారంగా అన్నాడు. అందుకు చంద్రబాబు... మీరు మరీ అంత వెటకారంగా మాట్లాడొద్దు సార్‌, మీ నుండి రియాక్షన్‌ ఉంటుందని తెలుసు... కాని ఏం చేయమంటారు, బడ్జెట్‌లో అసలు ఏపి ప్రస్తావనే లేకపోయే... కనీసం ఈ మాత్రం యాక్షన్‌ అన్నా చేయకపోతే... మరీ నన్ను మా వాళ్ళే చేతకానివాడనుకుంటారు సార్‌, నేను ఇలా మాట్లాడానని ఏమీ అనుకోవద్దు. మోడీ గారిని కూడా ఇవేమీ మనసులో పెట్టుకోవద్దని చెప్పండి... ప్లీజ్‌ అని వేడుకున్నాడు. సరేలే అని అమిత్‌షా ఫోన్‌ కట్‌ చేసాడు.

అంతలో మళ్ళీ చంద్రబాబు ఫోన్‌ మోగింది. మళ్ళీ మోడీ ఏమన్నా చేసాడా అనుకుంటూ ఫోన్‌ వైపు చూసాడు. ఐఎస్‌డి కాల్‌... ఒబామానో, బిల్‌గేట్సో, బిల్‌క్లింటనో అయ్యుంటాడను కుంటూ ఫోన్‌ ఆన్‌ చేసాడు. అవతల నుండి... నాన్న నేను లోకేష్‌ని, న్యూజెర్సీ నుండి అని అన్నాడు. ఏరా లోకేష్‌... ఏంటి విశేషాలు అని చంద్రబాబు అడిగాడు. మీరు అర్జంట్‌గా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో తెలుగుదేశం పార్టీని మూసేసి అమెరికాకు వచ్చే యండి అని అన్నాడు. ఆ మాటకు చంద్రబాబు తల పదివేల కిలోమీటర్ల వేగంతో తిరగసాగింది. పది నిముషాలకుగాని చంద్రబాబు తేరుకోలేక పోయాడు. ఏమైందిరా లోకేష్‌ అంత మాటన్నావు అని చంద్రబాబు అడిగాడు. నాన్నారు... అమెరికాలో మన పార్టీ పరిస్థితి బాగుంది. ఇక్కడ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తే మనమే అధికారంలోకి వచ్చేటట్లున్నాం. మీరు అమెరికా అధ్యక్షు డైతే మోడీలాంటి వాళ్ళంతా మీ చుట్టూనే వుంటారు. ప్రపంచమే మీ చుట్టూ తిరుగుతుందని లోకేష్‌ చెప్పాడు. ఆ మాటలతో చంద్రబాబుకు మైకం కమ్మేసింది. డబ్‌ అంటూ అక్కడే సోఫాలో పడిపోయాడు.

-----

లోకేష్‌ కోరిక మేరకు చంద్రబాబు అమెరికాలో కాలుపెట్టాడు. వాషింగ్టన్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ట్రంప్‌ను వ్యతిరేకించే డెమోక్రాట్లు తమ పార్టీని తెలుగు దేశంలో విలీనం చేసారు. బిల్‌క్లింటన్‌, ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు కూడా తెలుగుదేశంలో చేరి పచ్చకండువాలు కప్పుకున్నారు. ఆమెరికా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, యువజన విభాగం అధ్యక్షుడిగా నారా లోకేష్‌, ప్రధాన కార్యదర్శిగా ఒబామా, ఉపాధ్యక్షుడిగా బిల్‌క్లింటన్‌, మహిళా విభాగం అధ్యక్షు రాలిగా హిల్లరీ క్లింటన్‌, మహిళా విభాగం ప్రచార కార్యదర్శిగా కండోలిజారైస్‌లను నియమించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక టైం దగ్గర పడుతుందనగా అమెరికా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వారి కన్నీళ్ళు తుడవడానికి చంద్రబాబు లాస్‌ఏంజల్స్‌ నుండి 10వేల కిలోమీటర్ల 'నవ శంఖారావ పాదయాత్ర'కు శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన... అమెరికన్లు బ్రహ్మరథం పట్టసాగారు. అన్ని సర్వే సంస్థలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు... ట్రంప్‌ కంటే ఆధిక్యంలో వున్న తెలుగువాడు... అని ముందస్తు ఫలితాలనిస్తున్నాయి. ముందస్తు సర్వేలను చూసి ట్రంప్‌కు భయమేసింది. వెంటనే ఆయన మోడీకి ఫోన్‌ చేసి... సార్‌, దయచేసి ఆ చంద్రబాబును మీ ఇండియాకు పిలిపించుకోండి... ఆయన ఇక్కడ వుంటే నా కుర్చీకే ఎసరొస్తుంది. అమెరికన్‌లంతా ఆయనకే జై కొడుతున్నారు. ప్లీజ్‌ నా కోసం ఆ చంద్ర బాబును ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడండి అని ఏడుస్తూ అడిగాడు. నేను ట్రై చేస్తాను అని మోడీ ఫోన్‌ పెట్టేసి, వెంటనే చంద్ర బాబుకు చేసాడు. అవతల ఫోన్‌ ఎత్తగానే చంద్రబాబూజీ... మా మీద మనసులో ఏమీ పెట్టుకోవద్దు... మీపట్ల గతంలో మేం చేసిన తప్పులను మన్నించండి... దయచేసి అమెరికా నుండి వచ్చేయండి... మీరు అక్కడేవుంటే ఆ ట్రంప్‌కు పిచ్చి ఎక్కువై చచ్చేటట్లున్నాడు అని ప్రాథేయపడ్డాడు. అది విన్న బాబు... ఇదే చంద్రబాబు పవర్‌ అంటే... నన్నే తక్కువ అంచనా వేస్తావా... హ... హ... హ... అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. అలా నవ్వుతుండగానే ఎవరో ముఖం మీద నీళ్ళు చల్లినట్లుండడంతో... టక్కున కళ్లు తెరిచాడు. ఎదురుగా తన శ్రీమతి భువనేశ్వరీ దేవి... చేతిలో చెంబు... అమెరికాకు నువ్వెప్పుడొచ్చావని చంద్రబాబు ఆమెను అడిగాడు. అందుకామె... నేను అమెరికా రావడం కాదు... మీరే అమరావతిలో వున్నారు... సోఫాలో పడుకుని కలవ రిస్తున్నారు అని చెప్పింది. అప్పుడర్ధమైంది చంద్రబాబుకు... లోకేష్‌ ఫోన్‌ కాల్‌ ఎఫెక్ట్‌తో అప్పటిదాకా జరిగిందంతా కల అని.

Read 73 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter