Friday, 26 January 2018 10:18

నెతన్యాహు కోరికతో నోరు తెరచిన మోడీ!

Written by 
Rate this item
(0 votes)

galpikaన్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అనంత కుమార్‌ తదితరులు వున్నారు. అప్పుడే ఒక స్పెషల్‌ ఫ్లైట్‌ ల్యాండయ్యింది. అందులో నుండి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు దిగాడు. మోడీ ఆయనకు ఎదురెళ్లి ఆత్మీయంగా కౌగిలించుకుని స్వాగతం పలికాడు. నెతన్యాహు తనతో పాటు తెచ్చిన బ్యాగులను తెరిచాడు. అందులో నుండి మోడీకి ఇష్టమైన సూటూ, కోటు, వాచీలు తీసి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. అలాగే సుష్మాస్వరాజ్‌, నిర్మలా సీతారామన్‌లకు పట్టుచీరలు, పసుపు కుంకమలు అందజేసి మొన్న రక్షాబంధన్‌కు ఇండియా వచ్చి మీ చేత రాఖీ కట్టించు కోవాలను కున్నాను! కాని, బిజీ వల్ల రాలేకపోయాను, ఈ అన్నయ్యను క్షమిం చండమ్మా! మీరే నా చెల్లెళ్ళు, ఈ రాఖీలు కట్టండి అంటూ వారి చేతులకు రాఖీలిచ్చి తన చేతికి కట్టించుకున్నాడు. నెతన్యాహు చూపించిన అభిమానానికి వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు. అక్కడ స్వాగత సత్కార్యాలయ్యాక అందరూ కార్లెక్కారు. కాన్వాయ్‌ బయలు దేరింది. మొదట తాజ్‌మహల్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడకు పెద్దఎత్తున భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు చేరి వున్నారు. బెంజిమన్‌ నెతన్యాహు వారిని చూసి... వీళ్ళంతా ఎవరు? ఎందుకొచ్చారని అడిగాడు. వాళ్ళంతా భజరంగ్‌దళ్‌ సభ్యులు, తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయం అని వారి నమ్మకం. అందుకే ప్రతిరోజూ వచ్చి పూజలు చేస్తుంటారని మోడీ వివరించాడు. ప్రపంచంలో ఇదో వింత కదా అని నెతన్యాహూ అడిగాడు. దానికి రాజ్‌నాథ్‌సింగ్‌... మాకు ఈ సమాధి వింతేం కాదు, కాని బయట దేశాలవాళ్ళు వచ్చి దీనిని చూడడమే మాకు పెద్ద వింత అని చెప్పాడు. తాజ్‌మహల్‌ కట్టిం చిందెవరు? అని నెతన్యాహు అడిగాడు. వెంటనే అనంతకుమార్‌... దీనిని కట్టించిన తాపీమేస్త్రి బ్రతికిలేడు, అప్పుడే చచ్చిపోయాడు అని చెప్పాడు. తాజ్‌మహల్‌ అంటే వీళ్ళందరికీ ఒళ్ళు మంట లాగుందని గ్రహించిన నెతన్యాహు అది చూడ్డం ఆపి మళ్ళి కారెక్కాడు. కాన్వాయ్‌ నేరుగా ప్రధాని కార్యాలయానికి చేరుకుంది. భారత్‌-ఇజ్రాయిల్‌ దేశాల అధికారులు, రాయబారులు, విదేశాంగ మంత్రులు అక్కడకు వచ్చేసారు. బెంజిమన్‌ నెతన్యాహుకు దోశెలు, చికెన్‌, అరిసెలు, వడలతో అల్పాహారం పెట్టారు. ఇవి ఎక్కడివి, ఈ వంటకాలను ఎప్పుడూ చూడలేదే అని నెతన్యాహు సందేహం వెలిబుచ్చాడు. అందుకు మోడీ... ఇవి సంక్రాంతి వంటకాలు... మా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు నుండి పంపించాడు. బాగా వుంటాయి తినండి అని చెప్పి వడ్డించాడు. నెతన్యాహు వాటిని లొట్టలేసు కుంటూ తిన్నాడు.

తర్వాత ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ... మా దేశ రక్షణ విషయంలో మీ సహకారం కావాలి. వంద యుద్ధ విమానాలు, 150 హెలికాఫ్టర్‌లు, అత్యాధునిక గన్‌లు లక్ష, 500 శతృఘ్నులు, 250 బాంబర్లు కావాలి... ఎంత డబ్బు చెల్లిం చాలో చెప్పండి అని మోడీ అడిగాడు. మీరు అడిగిన వాటికి రెండింతల ఆయుధాలు, యుద్ధ విమానాలు అందజేస్తాం. ఇక డబ్బు అంటారా? మీతో మాది స్నేహబంధమేకాని వ్యాపార బంధం కాదు అని నెతన్యాహు చెప్పాడు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వుండి... మా సరిహద్దుల్లో చైనా, పాక్‌లతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. మా సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వారితో మాకు ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. వాళ్ళతో యుద్ధమే వస్తే మాకు మీ సాయం కావాల్సి వుంటుందని అడిగింది. నెతన్యాహు దానికి బదులిస్తూ... ఇక్కడ మీరు వేరు కాదు, మేము వేరు కాదు... మన దేశాలు వేరు కావొచ్చేమో, రెండింటి ప్రాణం మాత్రం ఒక్కటే! మీ దేశం మీదకు ఎవరైనా యుద్ధానికి వచ్చారంటే వాళ్ళు మా దేశం మీదకు కూడా వచ్చినట్లే! మీ గుండెకు గాయమైతే మా గుండెకు గాయమైనట్లే! మీరు ఓడిపోతే మేము ఓడిపోయినట్లే! మీరు గెలిస్తే మేం గెలిచినట్లే... అని ఎంతో అభిమానం చూపిస్తూ చెప్పాడు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ వుండి... వ్యవసాయ రంగంలో మేమింకా చాలా వెనుకబడి వున్నాం. మీరు మాకంటే ఎంతో ముందున్నారు. ఏడారిలో కూడా పంటలు పండిస్తున్నారు. మీ వ్యవసాయ టెక్నా లజీని మా రైతులకు కూడా నేర్పించాలి. అందుకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం అని చెప్పాడు. ఆ మాట వినగానే నెతన్యాహు కాలికున్న చెప్పును చేతిలోకి తీసుకున్నాడు. ఆ సంఘటనతో అందరూ షాకయ్యారు. నెతన్యాహు తన చేతిలోని చెప్పును మోడీ చేతిలో పెట్టి... ఇంకోసారి మన మధ్య 'డబ్బు' అనే మాట వినిపిస్తే ఈ చెప్పుతో నన్ను కొట్టండి, మీరు కొట్టకుంటే నేనే కొట్టుకుంటాను. మన మధ్య డబ్బు అనే మాటే వుండకూడదు. మన బంధానికి డబ్బు అడ్డురాకూడదు అని చెప్పాడు. నెతన్యాహు చూపిస్తున్న ప్రేమకు మోడీతో పాటు అక్కడున్న అందరి కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి. మోడీ మనసులో నేను పీఎం అయ్యాక ఒబామాను చూసాను, ట్రంప్‌ను చూసాను, థెరిసామే, మోర్కెలా ఏంజిల్‌, షిజోఅంబే, నవాజ్‌ షరీఫ్‌, జిన్‌పింగ్‌లు... ఇలా ఎంతోమందిని కలిసాను. అందరూ తమ దేశ ప్రయోజనాలు చూసుకొన్నవాళ్ళే గాని, అవతల దేశం గురించి ఆలోచించినవాళ్ళు లేరు. కాని నెతన్యాహు నిజమైన మిత్రుడు, తన దేశం కంటే కూడా అతను భారతదేశం గురించి ఎక్కువుగా ఆలోచి స్తున్నాడు. థాంక్‌యు నెతన్యాహు అని అనుకున్నాడు. సుష్మాస్వరాజ్‌ వుండి... భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం మీరు మద్దతు ఇవ్వగలరా? అని అడిగింది. అది విని నెతన్యాహు... ఇవ్వగలరా? సహకరించగలరా? అనే ప్రశ్నలే వద్దక్కా, మీరు ఆదేశించాలి, నేను పాటించాలి. మీ కోసం నేను బావిలో దూకమన్నా దూకుతాను, మీరు ఇక్కడ సంతకం పెట్టండి అని చెబితే చాలు కళ్ళు మూసుకుని ఎక్కడైనా పెట్టేస్తాను. నేను మీ మనిషిని. పరాయివాడిగా చూడొద్దు అని నిష్టూర పోయాడు.

అప్పుడు మోడీ అతనితో... నువ్వు మాలో మనిషివే, మా మనిషివే... నువ్వు మా పట్ల ఇంత ప్రేమాభిమానం చూపిస్తున్నావ్‌, ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం అని అన్నాడు. అందుకు నెతన్యాహు... మీరు నాకు ఏమీ ఇవ్వబల్లేదు. నాలుగు టన్నులు నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలన్విండి... అవి నా దగ్గరుంటే చుట్టుపక్కల అరబ్బు దేశాలకు వణుకు పుట్టిస్తాను అని తన మనసులోని మాటను చెప్పాడు. అది విని మోడీతో సహా అందరూ నెల్లూరు దోమలు ఇంత పవర్‌ఫుల్లా అని నోర్లు తెరిచారు.

Read 36 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter