జగన్ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు వై.యస్.ఆర్. కాంగ్రెస్‌పార్టీకి సిద్ధంగా వున్నారు. కదన రంగంలో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల్లా కార్యకర్తలుంటే వాళ్ళకి దశాదిశా నిర్ధేశించి ముందుకు నడిపించే మేజర్లలా నాయకులున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. అందరి ధ్యేయం ఒక్కటే. అందరి ఆశ, ఆశయం, ఆకాంక్ష ఒక్కటే! 2019లో వై.యస్. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి. ''రాజన్న'' ఆత్మకు నిజమైన శాంతిని చేకూర్చాలి. మరి ఇలాంటి తరుణంలో ఎవరో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి ఆయన మార్గదర్శకంలో పార్టీని గెలి పించుకుందాం అని పిలుపునివ్వడం సబబు కాదు.
1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుకు ఎవరు వ్యూహకర్తలుగా పని చేశారు? ఎవరి సలహాలు లేకుండానే ఆయన ప్రజా ప్రభంజనం సృష్టించలేదా? 1989లో ఎటువంటి రాజకీయ వ్యూహకర్తలు లేకుండానే, కనీసం సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించకుండానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? 2004లో ఎవరి వ్యూహాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది? వ్యూహకర్తలతో విజయం లభించిందా? లేక వై.యస్. ఇమేజ్‌తో పార్టీ గెలిచిందా? అంతెం దుకు 2014 ఎన్నికల్లో తన సొంత వ్యూహాలతోనే చంద్రబాబు అధికారంలోకి రాలేదా?
గెలుపు అన్నది ఆ బ్రహ్మ వ్రాసి వుండాలి, లేదా ప్రజలు వ్రాయాలి. లేదంటే మన సొంత కృషితో మనమే తిరగరాయాలి. అంతేగాని, మన పార్టీ గెలుపు కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దేశమంతటా ఎన్నికలొస్తే ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్(పీకే). 2014 ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి మోడీ ప్రధాని అయ్యారు. అలాగే ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌కు ఆయన వ్యూహకర్తగా పనిచేశాడు. ఆ ఎన్నికలలోనూ దళ్(యూ) ఆర్జేడీ కూటమి ఘనవిజయం సాధించాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. అయితే ఇక్కడ ఆలోచించా ల్సింది... ప్రశాంత్ కిషోర్ సహకారం లేకపోయి వుంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవదా? బీహార్‌లో దళ్(యూ) గెల వదా? ఎవరున్నా లేకున్నా లోక్‌సభలో బీజేపీ గెలుపును, బీహార్‌లో నితీష్ గెలుపును ఎవరూ ఆపగలిగేవారు కారు. ఎందుకంటే యూపిఏ ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు డిసైడైపోయారు. ప్రశాంత్‌కిషోర్ లేకున్నా, ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించక పోయి వున్నా ఆ ఎన్నికల్లో అధికారం ఎన్డీఏదే! కాకపోతే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంవల్ల అధికారం బీజేపీది అయ్యింది. బీహార్‌లోనూ అంతే! నితీష్‌కుమార్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన సమర్ధుడైన ముఖ్యమంత్రి. బీహార్‌ను అభివృద్ధి బాట పట్టించాడు. దానికితోడు బలమైన ఓటు బ్యాంకున్న ఆర్జేడీతో పొత్తు వుంది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థిగా వున్న బీజేపీ సమర్ధుడైన సీఎం అభ్యర్థిని చూపలేకపోయింది. మరి బీహార్ ప్రజలు నితీష్‌ను కాక ఇంకెవరిని గెలిపిస్తారు? మరి ప్రశాంత్‌కిషోర్ రాజకీయ వ్యూహాలు అంత బాగా పనిచేస్తే మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలో వున్న సమాజ్ వాది పార్టీ ఎందుకు చతికిలపడింది. ఏ పార్టీ వాళ్లయినా రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే అది పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కావాలి. ఒక పార్టీ విజయంలో పార్టీ అధినేత నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు మొదలుకొని బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరికృషి ఉంటుంది. ఏ పార్టీ గెలుపులో అయినా మొదటి భాగస్వాములు కార్యకర్తలే! అంతేగాని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కాదు. వ్యూహకర్తలే పార్టీలను అధికారంలోకి తెచ్చే టట్లుంటే భారత రాజకీయ వ్యవస్థను ఇక వాళ్లే శాసించగలరు.
వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకుని వుండొచ్చు. కాని అది పార్టీ అంతర్గత సమా వేశాలకే పరిమితమై వుండాలి. అంతేగాని ప్లీనరీ వంటి బహిరంగ వేదికలనెక్కించి, ఆయన పుణ్యాన ఇక మనం అధికారంలోకి రానున్నాం అన్నట్లు మాట్లాడకూడదు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు ప్రశాంత్‌కిషోర్ కంటే జగన్‌కే ఎక్కువ తెలిసుండాలి. ప్రజాసమస్యలపై జగన్ స్పందించాలి. వైకాపాకు వేలసంఖ్యలో నాయకులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, కోట్ల సంఖ్యలో ప్రజలు మద్దతుగా వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వుంది. ఈ అవకాశాలను అనుకూలంగా మలచుకోవాలి. 2004లో ఎలాంటి ప్రశాంత్ కిషోర్‌లు లేకుండానే చంద్రబాబు ప్రభుత్వాన్ని మట్టికరిపించాడు వై.యస్.రాజశేఖరరెడ్డి. ఇప్పుడు కావలసింది వ్యూహకర్తలు కాదు, సమన్వయకర్తలు. రాజకీయాలతో సంబంధం లేని వై.యస్. కుటుంబ ఆప్తులను జగన్ 13జిల్లాల్లో సమన్వయకర్తలుగా పెట్టుకోవాలి. ఇతరులతో సంబంధం లేకుండా ఆ సమన్వయకర్తలతో నేరుగా జగన్ సంబంధాలు పెట్టుకోవాలి. గ్రామస్థాయి నుండి ఎక్కడ ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి జిల్లాలోనూ మారుతున్న సమీకరణలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయగలిగే నిస్వార్ధ వ్యక్తిగత వ్యక్తులని ఆయన 13జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వై.యస్. చేసింది కూడా ఇదే. ఎక్కడ సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినా వెంటనే స్పందించేవాడు. ఇందుకు ఎన్నో ఉదా హరణలు ''లాయర్'' వద్దనే ఉన్నాయి.
''ప్రజలే దేవుళ్ళు... సమాజమే దేవాలయం'' అన్న రామా రావు సిద్ధాంతాన్నే వై.యస్. కూడా నమ్మాడు. అందుకే నేరుగా ప్రజల్లోనే మమేకమయ్యాడు. ఎక్కడేం జరుగుతుందో తన ఆంతరంగిక వ్యక్తుల ద్వారా తెలుసుకునేవాడు. ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించి పరిస్థితిని తనకు అనుకూలంగా మలచు కునేవాడు. మన రాష్ట్రం గురించి, మన ప్రజల సమస్యల గురించి మనకు అవగాహన వుంటే చాలు, వాటిని పరిష్కరిస్తామని మనం ప్రజలకు నమ్మకం ఇవ్వగలిగితే చాలు... ఎలాంటి ప్రశాంత్ కిషోర్ల అవసరం లేకుండానే విజయం సొంతమవుతుంది.