Friday, 07 July 2017 08:00

నెల్లూరు కార్పొరేషన్‌ దెబ్బకు తోకముడిచిన చైనా

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్రమోడీతో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, సురేష్‌ ప్రభు, నితిన్‌ గడ్కరీ, వెంకయ్య నాయుడు, రక్షణశాఖ కార్యదర్శి అజిత్‌ ధోవల్‌, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌ సమా వేశమైవున్నారు. అక్కడ మోడీ, వెంకయ్య నాయుడులు తప్ప మిగతా అందరి ముఖా ల్లోనూ టెన్షన్‌ సునామీలా పోటెత్తుతోంది. అరుణ్‌జైట్లీ వుండి ప్రధానితో... సార్‌, నేనేమో చైనాతో నోటికొచ్చినట్లు సవాళ్ళు చేసాను, 1962 నాటి భారత్‌ వేరు... ఇప్పటి భారత్‌ వేరు అని చెప్పాను. అవ తల చూస్తే డోక్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. భూటాన్‌ భూభాగంలో తాము కడుతున్న రోడ్డును అడ్డుకున్నందుకు చైనా దళాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. చైనాతో పోలిస్తే మన మిలిటరీ, ఆయుధ సంపత్తి తక్కువ. యుద్ధం వస్తే గెలుస్తామా లేదా అని టెన్షన్‌గా వుంది అని చెప్పాడు. అది విన్న మోడీ... డోంట్‌వర్రీ జైట్లీ అని అన్నాడు. అది కాదు సార్‌, ఈరోజు చైనా అమెరికానే ఢీకొట్టే స్థాయిలో వుంది. దాని ముందు మనం నిలబడగలమా, సమస్యను శాంతియుతంగా పరిష్కరించే మార్గం ఆలోచించకూడదా? అని సుష్మాస్వరాజ్‌ కోరింది. సురేష్‌ప్రభు అందుకుని... యుద్ధంతో ఇరుదేశాలకూ నష్టమే. కాబట్టి ఇరు దేశాలు సంయమనం పాటిస్తే బాగుం టుందని సలహా ఇచ్చాడు. మీరేం దాని గురించి భయపడకంటి అని మోడీ ధైర్యం చెప్పాడు. నితన్‌ గడ్కరీ వుండి... మీరేం సార్‌, మీరు ధైర్యంగానే వుంటారు, ఆ చైనావాళ్ళు ఎక్కడ పైన పడతారోనని మేం భయపడి ఛస్తున్నాం అని అంటుండ గానే... మమ్మల్ని మన్నించండి మహా ప్రభో... అంటూ ఇద్దరు వ్యక్తులు పరుగు పరుగున వచ్చి మోడీ కాళ్ల మీద పడ్డారు. అలాగే మన్నించాలే ఇక లేవండి అంటూ మోడీ వాళ్లిద్దర్నీ లేవదీసాడు. ఆ ఇద్దరి ముఖాలను చూసి అక్కడున్న వాళ్ళు నివ్వెరపోయారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు... చైనా అధ్యక్షుడు, ప్రధాని జింగ్‌ పింగ్‌, జీహూంటావోలు. వాళ్లిద్దరు మోడీ చేతులు పట్టుకుని... మేం అనవసరంగా కయ్యానికి కాలు దువ్వాం. మీ శక్తిసామ ర్ధ్యాలను అంచనా వేయలేకపోయాం. ఇరుదేశాల వారిమి కలిసి మాట్లాడుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించు కుందాం. వెంటనే మా దేశ సరిహద్దుల్లో మోహరించిన మీ శక్తులను వెనక్కి పిలిపించండి అని వేడుకున్నారు. సరే, అలాగే అని మోడీ అభయమిచ్చాడు. అది విన్న ఆర్మీచీఫ్‌ బిపిన్‌రావత్‌... సరి హద్దుల్లో వున్న సైన్యాన్ని వెనక్కి పిలి పించేనా అని మోడీని అడిగాడు. దానికి మోడీ... వాళ్ళు భయపడుతున్నది సైన్యానికి కాదు అని అన్నాడు. మరి ఎవరికి...? అసలు ఏం జరిగింది, వాళ్ళను ఎలా వంచగలిగారని వెంకయ్య తప్ప మిగతావాళ్లంతా ఆతృతగా అడి గారు. అందుకు మోడీ... చెబితే ఫీలింగ్‌ వుండదు. చూడండి అంటూ... వేళ్లతో ఎయిర్‌ స్క్రీన్‌ గీసి సీన్స్‌ ప్లే చేసాడు.

---------

తన ఛాంబర్‌లో ప్రధాని మోడీ దిగులుగా కూర్చుని వున్నాడు. అప్పుడే కేంద్రమంత్రులు వెంకయ్య, అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలు లోపలకు వచ్చారు. విచారంగా వున్న మోడీతో... ఏం అలా వున్నారని వెంకయ్య అడిగాడు. సిక్కిం సరిహద్దుల్లో చైనా యుద్దానికి కాలు దువ్వుతోంది. మనం వెనక్కి తగ్గకూడదు. కాకపోతే చైనా బలం ముందు మన బలం సరిపోతుందా? లేదా అనే నా సందేహం అన్నాడు. సుజనాచౌదరి వుండి... సార్‌, మా టాలీవుడ్‌ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌లు వున్నారు. మా బాలయ్య పారాచూట్‌ తగిలించుకుని ఒక్కడే పాకిస్థాన్‌ వెళ్లి అక్కడి శత్రువులను తుదముట్టించగలడు. బాలయ్య ఒకసారి తొడ కొడితే ఆ సౌండ్‌కు ఒకేసారి వంద మంది చస్తుంటారు. అదీగాక చైనా సైని కులు కాల్చిన బుల్లెట్లను నోటితో పట్టు కుని వాటితోనే తిరిగి వారిని కాల్చి చంప గల దిట్ట. కాబట్టి బాలయ్యను సరిహ ద్దుల్లో పెట్టి తొడ గొట్టించి చైనానే పడ గొట్టించే పని చేద్దాం. ఇక రామ్‌చరణ్‌ వందమంది వీరులు ఒకేసారి వచ్చినా మట్టి కరిపించగలడు. లక్షమంది సైన్య మున్న కాలకేయుడినే మట్టికరిపించిన ధీశాలి బాహుబలి ప్రభాస్‌. ఇక పవన్‌ కళ్యాణ్‌... ఒక్కడు వుంటే సరిహద్దుల్లో వెయ్యి సింహాలున్నట్లే లెక్క. సింహానికి ఆయనకు ఒకటే తేడా... అది పెళ్లి చేసు కోదు, ఈయన చేసుకుంటాడంతే... మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అని చెప్పాడు. అది విన్న వెంకయ్య... నీ సినిమా తెలివి తెల్లారినట్లే వుంది. సినిమా హీరోలు నిజజీవితంలో హీరోలు కాలేరు అంటూ... సార్‌, ఒక్కో సారి యుద్ధంలో శక్తితో పాటు యుక్తి కూడా అవసరం అంటూ.. సెల్‌ఫోన్‌ తీసి 98494 59590 నెంబర్‌కు డయిల్‌ చేసాడు. అవతల స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకానందరెడ్డి(66) లైన్‌లోకి వచ్చాడు. వెంకయ్య ఆయనకు ఫోన్‌లోనే సమస్యను చెప్పాడు. వివేకా కూడా ఫోన్‌లోనే పరి ష్కారం చెప్పాడు.

---------

నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ తన గదిలో నిద్రపోతున్నాడు. అప్పుడే ఆయన సెల్‌ మోగింది. ఫోన్‌ ఎత్తాడు. అవతల వెంకయ్యనాయుడు... వెంకయ్య ఫోన్‌లో సబ్జెక్ట్‌ చెప్పాడు. అజీజ్‌ అలాగే, సాయంత్రం కల్లా చేరుస్తాను సార్‌ అంటూ ఫోన్‌ పెట్టేసాడు. ఆ తర్వాత వెంకయ్య నెల్లూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లతోనూ మాట్లా డాడు. దేశ రక్షణ కోసం మావంతు సహ కారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

---------

అది చైనాలోని ప్రముఖ వార్తాపత్రిక 'గ్లోబల్‌ టైమ్స్‌'. ఆరోజు పతాక శీర్షిక ''సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు - చైనాపై దాడికి జీవాయుధాలు'' అని హెడ్డింగ్‌తో వుంది. వార్తా, సారాంశం... డోక్లా ప్రాం తంలో రోడ్డు వివాదమై చైనా, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్‌ నుండి చైనాకు ఊహించని ముప్పు ఎదు రైంది. భారత్‌ చైనాపై దాడికి తన సరి హద్దుల్లో 'ఐఆర్‌ 20-420 నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల'ను భారీ ఎత్తున మోహరించింది. బుల్లెట్‌ తగిలితే, బాంబు పడితే మనిషి ఒక్కసారే ఛస్తాడు. కాని ఈ దోమ దాడికి గురైన వ్యక్తి ఒక్కసారి కాకుండా ప్రతిరోజూ ఛస్తుంటాడు... ఈ దోమల దాడితో చైనా సాయుధ దళాలే కాకుండా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా పూర్తిగా నాశనమవుతుంది. ఈ దోమల బారిన పడిన ప్రజలెవరూ సుఖంగా వుండరని, రకరకాల వింత వ్యాధులు వచ్చి చనిపోతుంటారని శాస్త్ర వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ రోగాల బారి నుండి చైనాను కాపాడుకోవాలంటే భారత ప్రధాని మోడీని శరణుకోరడం తప్ప మరో మార్గం లేదు. అని కథనాన్ని ప్రచురించింది. మీడియాలో వచ్చిన ఈ కథనంతో చైనా ప్రజల్లోనూ ఆందోళనలు రేకెత్తాయి. కమ్యూనిష్టు నిరంకుశ ప్రభు త్వాన్ని కూడా లెక్క చేయకుండా కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నెల్లూరు దోమల నుండి చైనాను కాపాడాలంటూ ర్యాలీలు చేయసాగారు. ప్రజల ఆందోళ నలకు తలొగ్గి జింగ్‌పింగ్‌, జీహుం టావోలు భారత ప్రధాని మోడీని కలిసి సంధి కోరుతామని ప్రకటించారు.

---------

ఎయిర్‌ స్క్రీన్‌పై ఇక్కడితో సీన్‌లు ముగిసాయి. వారితో మోడీ... చూసారా నెల్లూరు మస్కిటోస్‌ పవర్‌... అందుకే చెప్పేది... సృష్టిలో ప్రతి జీవి కూడా ఏదో ఒకరోజు ఏదో ఒక విధంగా ఉపయోగ పడుతుందని. ఈరోజు నెల్లూరు నేతలు, నెల్లూరు దోమల వల్ల చైనా బారి నుండి దేశాన్ని రక్షించుకోగలిగామన్నాడు. మోడీ నెల్లూరు గురించి అంతగా చెప్పేసరికి వెంకయ్య ఛాతి గర్వంతో 24సెంటీ మీటర్లు పెరిగి వేసుకున్న చొక్కా చినిగి పోయింది.

Read 329 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter