Friday, 30 June 2017 08:54

మహావిష్ణువుకే షాకిచ్చిన చంద్రబాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై తలక్రింద డన్‌లప్‌ దిండు వేసుకుని శయనించి ఎదురుగా ఎల్‌సిడి స్క్రీన్‌పై 'బాహుబలి-2' సినిమా చూస్తున్నాడు. మహాలక్ష్మిదేవి 'నవరత్న' ఆయిల్‌తో ఆయన కాళ్లకు మర్ధన చేస్తూ... స్వామి, ఆ చిత్రంలో కనిపిస్తున్న కోటలు, ఏనుగులు, యుద్ధాలు... అన్నీ నిజమైనవేనా? అని అడిగింది. అందుకు విష్ణుమూర్తి... అవన్నీ గ్రాఫిక్స్‌ దేవి అని చెప్పాడు. గ్రాఫిక్స్‌ అనగా ఏమని లక్ష్మీదేవి అడిగింది. ఎలా చెప్పాలో తెలియక విష్ణుమూర్తి కొంచెం సేపు కిరీటం తీసి తలగోక్కున్నాడు. తర్వాత ఆయనకు హైటెక్‌రత్న చంద్రబాబు గుర్తుకువచ్చాడు. వెంటనే ఆయన... గ్రాఫిక్స్‌ అనగా చంద్రబాబు కట్టే అమరావతి రాజధాని లాంటిదన్నమాట! లేనిది

ఉన్నట్లుగా సృష్టించడం... వూహల్లో వున్న చిత్రాన్ని కంప్యూటర్‌లో డిజైన్‌ చేయడం... దానిని పత్రికల్లో అచ్చు వేయించుకోవడం... అని చెప్పాడు. అంతలో 'నారాయణ నారాయణ' అంటూ అక్కడకు నారదమహర్షి వచ్చాడు. ఆయన్ను చూడగానే విష్ణుమూర్తి ఎడమకన్ను అదిరింది. తమ మధ్య ఏం ఫిటింగ్‌ పెడతాడోనని ఆయన లోలోపల టెన్షన్‌ పడసాగాడు. ఏం నారదా, భూలోకంలో విశేషాలేమిటి, ప్రజలు అనుక్షణం నన్ను స్మరించుకుంటున్నారా? వారి జీవాన్ని దైవాన్ని నేనేనని పూజిస్తున్నారా? అని విష్ణుమూర్తి అడిగాడు. దానికి నారదుడు... భూలోకంలో మీకు కాంపిటీటర్లు తయారయ్యారు స్వామి. ప్రజలకు తిండి పెట్టినా మేమేనంటున్నారు, నీళ్ళిచ్చినా మేమేనంటున్నారు. దేవుళ్ళను బదులు తమను తలచుకోవాలని అక్కడి రాజకీయ నాయకులంటున్నారు... అని చెప్పాడు. ఎవరా రాజకీయ నాయకుడు... అని విష్ణుమూర్తి ఆవేశంగా అడిగాడు. ఇంకెవరూ మీరు ఇంతకుముందే అమ్మవారితో అన్నారుగా... ఆయనే, అమరావతి గ్రాఫిక్స్‌ రాజధాని రూపశిల్పి చంద్రబాబు. ఆయనేమంటున్నాడో ఇప్పుడే లైవ్‌లో చూడండి అంటూ నారదుడు తన వేళ్లతో ఎర్త్‌మీదకు జూమ్‌చేసి చూపించాడు.

---------

అది కర్నూలు జిల్లా నంద్యాల.హైటెక్‌రత్న చంద్రబాబు ఎన్నికల ప్రసంగం చేస్తున్నాడు. మీరు నేనిచ్చిన రేషన్‌ బియ్యంతో అన్నం వండుకుంటున్నారు. నేనిచ్చిన గ్యాస్‌స్టౌపై వంట చేస్తున్నారు. నేనిచ్చిన హెరిటేజ్‌ నెయ్యి, కందిపప్పు, టాటా ఉప్పుతో పప్పు చేసుకుంటున్నారు. నేనిచ్చిన ఎన్టీఆర్‌ సుజలస్రవంతి నీళ్ళు తాగుతున్నారు. నేనిచ్చిన

సైకిళ్ళు తొక్కుతున్నారు. నేనిచ్చిన పింఛన్‌లు తీసుకుంటున్నారు. నేను వేయించిన సిమెంట్‌ రోడ్లపై తిరుగుతున్నారు, నేను కట్టించిన ఎన్టీఆర్‌ ఇళ్లలో ఉంటున్నారు, మీరు నాకు కాకపోతే ఇంకెవరికి వేస్తారు ఓట్లు... ఇవన్నీ తీసుకోవాలంటే మీరు చచ్చినట్లు నాకే వెయ్యాలి ఓట్లు అని చెప్పి చంద్రబాబు ముగించాడు. ఆయన మాటలతో అక్కడున్న జనమంతా నోర్లు తెరిచారు.

----------

వైకుంఠంలో లైవ్‌షోలాగా అది చూసిన విష్ణుమూర్తి... ఔరా చంద్రబాబు... అన్నీ నువ్వే ఇస్తే ఇక మేం ఏం చేసినట్లు అని ఆశ్చర్య పోతుండగా... లక్ష్మీదేవి వుండి... అతను అన్నదాంట్లో తప్పేముంది స్వామీ, అతను గొప్ప దానకర్ణుడులాగున్నాడు. కాబట్టే కదా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను తెగనమ్మి ప్రజలకు ఇళ్లు, రోడ్లు, సైకిళ్లు, ఆహారం, పింఛన్‌లు ఇచ్చినట్లున్నాడు. అంతటి ధర్మదాత వారి నుండి ఓట్లను ఆశిస్తే తప్పేంటని అడిగింది. నీ తెలివి తెల్లారినట్లే వుంది దేవి. ఆయన అవన్నీ ఇచ్చింది సొంత ఆస్తులనమ్మికాదు, అదంతా ప్రజల డబ్బే. ఇంకా చెప్పాలంటే ఆయన ఎక్కే విమానం, కూర్చునే కుర్చీ, ఉండే ఏసి గది, తీసుకునే జీతం ప్రజల సొమ్మే... ఇతనికి తగిన పాఠం చెబుతాను అని విష్ణుమూర్తి ''ఓంహ్రీం ధాంధాం'' అని మంత్రం చదివాడు.

------------

చంద్రబాబుకు హైదరాబాద్‌ మీదకు మనసు మళ్లడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాలు పెట్టాడు. ఆయన అడుగుపెట్టాడో లేదో... ఎదురుగా వై.యస్‌.రాజ శేఖరరెడ్డి... చంద్రబాబు నీక్కొంచెమన్నా బుద్దుందంటయ్యా, అస్తమానం నన్ను విమర్శిస్తూ నేను కట్టించిన ఎయిర్‌పోర్టులో అడుగుపెడతావా? సిగ్గుందా నీకు అని నేనడుగుతున్నాను అని నిలదీసాడు. చంద్రబాబుకేమీ అర్ధంకాక బిత్తరచూపులు చూస్తున్నంతలోనే వై.యస్‌. మాయమ

య్యాడు. చంద్రబాబు ఆ షాక్‌ నుండి తేరుకుని బయటకొచ్చి జూబ్లీహిల్స్‌ లోని ఇంటికి పోవడానికి కారెక్కాడు. కారు ఔటర్‌రింగ్‌రోడ్డు మీద దూసుకుపోసాగింది. అంతే కారులో చంద్రబాబు పక్కన పి.వి.నరసింహ రావు ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను చూడగానే బాబుకు నోట మాటరాలేదు. ఎక్కడలేని ధైర్యాన్ని కూడతెచ్చుకుని ఏం సార్‌, స్వర్గం నుండి ఇదేనా రావడం అని అడిగాడు. అందుకు పి.వి... ఈ పాపిష్టి రాజకీయ నాయకులున్న భూమ్మీదకు రాకూడదనుకున్నా, కాని వచ్చేలా చేసావు. ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు నా పేరు మీద వుంది. మా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే దీనిని వేశారు. ఈ రోడ్డు మీద పోవడానికి నీకు మనసెలా వచ్చింది. నీక్కొంచె మన్నా అత్మాభిమానం ఉందా? అని ప్రశ్నించి మాయమయ్యాడు. చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. కారు జూబ్లీహిల్స్‌లోకి వచ్చింది. ఏదో మనసు బాగాలేదు, ఏదేదో అవుతుంది. పెద్దమ్మతల్లికి దండం పెట్టుకుని పోదామని చెప్పి చంద్రబాబు పెద్దమ్మతల్లి గుడి దగ్గర ఆగాడు. అంతే ఆయనకు ఎదురుగా పి.జనార్ధన్‌రెడ్డి.... నేను కట్టించిన గుడిలోకి రావడానికి నీకు ఏం అర్హత వుంది. ఈ గుడికి ఏమన్నా దానం చేసావా? గోపురం కట్టించావా? గ్రానైట్‌ వేయించావా? అని ప్రశ్నించాడు. చంద్రబాబు బిత్తరపోయాడు. వరుస షాక్‌లతో జడుపు జ్వరం వచ్చింది. కారెక్కి డ్రైవర్‌తో 'నిమ్స్‌' ఆసుపత్రికి పోనీయమన్నాడు. 20నిముషాల ప్రయాణం తర్వాత నిమ్స్‌కు చేరుకున్నాడు. అక్కడ డాక్టర్‌, చంద్రబాబును పరీక్షించి జ్వరం తగ్గడానికి ఇంజక్షన్‌ చేసే సమయంలో ఆయన ముందు నిజాం నవాబు ప్రత్యక్షమయ్యాడు. నేను కట్టించిన ఆసుపత్రిలో వైద్యం ఎలా చేయించుకుంటావ్‌... వెళ్లు ఇక్కడ నుండి అని కసిరాడు. అంతే చంద్రబాబుకు ఇంకా షాక్‌ తగిలి అక్కడనుండి పరుగెత్తాడు. అలా పరుగెత్తి అలసిపోయి దాహంగా ఉండడంతో ఓ మున్సిపల్‌ కొళాయి వద్ద ఆగాడు. ట్యాప్‌ తప్పి నీళ్లు తాగబోతుండగా... పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రత్యక్షమై... నువ్వు తాగేనీళ్ళు ఎలా వచ్చాయో తెలుసా అని అడిగాడు. నెహ్రూను చూడగానే చంద్రబాబు ఎలాంటి షాక్‌కు గురి కాలేదు. ఈరోజు స్వర్గానికి, నరకానికి కంబైన్డ్‌గా సెలవిచ్చినట్లున్నారు. అందుకే అందరూ కట్టగట్టుకుని తనను ఏడిపించడానికి వస్తున్నారనుకుని... ఈ నీళ్ళు ట్యాప్‌లోనుండి వస్తాయన్నాడు. అందుకు నెహ్రూ నీ మాత్రం తెలివి నాకూ వుంది. నీళ్ళు ట్యాప్‌లో నుండే వస్తాయి. ఆ ట్యాప్‌లోకి నీళ్లు శ్రీశైలం డ్యాం నుండి వస్తాయి. ఆ డ్యాం కట్టించింది నేనే... కాబట్టి ఆ నీళ్ళు నువ్వు తాగవచ్చా? అని క్వశ్చన్‌ వేసాడు. చంద్రబాబు ఇంకేం మాట్లాడలేక అక్కడనుండి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని బుద్ధుని విగ్రహం చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆయన భుజంపై ఓ చేయి పడింది. పక్కకు చూసాడు. ఆయనకు మామ, జనానికి అన్నగారైన నందమూరి తారక రామారావు. చంద్రబాబు ఆయనతో... ఈ ట్యాంక్‌బండ్‌ను నువ్వే కట్టించా నంటావ్‌, నాకు ఇక్కడ కూర్చునే అర్హత లేదంటావ్‌... అంతేగా నువ్వడిగేది అని అన్నాడు. దానికి ఎన్టీఆర్‌... నేను కష్టపడి సంపాదించుకున్న ముఖ్యమంత్రి కుర్చీయే నాది కాకుండా పోయింది. ఈ ట్యాంక్‌బండ్‌ ప్రజల సొమ్ముతో కట్టించింది. ఇది నాది కాదు, నీది కాదు అందరిదీ. భేషుగ్గా కూర్చో అని చెప్పాడు. అప్పుడు చంద్రబాబుకు జ్ఞానోదయమైంది... ఎన్టీఆర్‌ రెండుచేతులు పట్టుకుని నన్ను క్షమించండి మామా... ఇంకెప్పుడూ అది నేను చేసాను, ఇది నేను చేసాను అని స్వార్ధంతో మాట్లాడను... అని చెప్పాడు. వైకుంఠం నుండి ఈ సీన్‌ చూస్తున్న విష్ణుమూర్తి చూసావా దేవి... నిముషాలలో వై.యస్‌., పి.వి., నిజాం, పి.జనార్ధన్‌రెడ్డి, నెహ్రూ, ఎన్టీఆర్‌లను ఆయన ముందుకు పంపించి అతనిలో ఎలాంటి మార్పును తెచ్చానో అని గర్వంగా అన్నాడు. అంతలో ఏబిసిడి ఛానెల్‌ వాళ్ళు చంద్రబాబు వద్దకు వచ్చారు. నోరు ముందు మైకుపెట్టి... ఏపిని వదిలి ఈరోజు ఇలా వచ్చారేమని అడిగారు. అందుకు చంద్రబాబు... ఈ హైదరాబాద్‌ను నేనే నిర్మించాను, హైటెక్‌ సిటీని నేనే

కట్టించా, ఔటర్‌రింగ్‌రోడ్‌ నేనే వేయించా, ట్యాంక్‌బండ్‌ నేనే తవ్వించా... హైదరాబాద్‌ అభివృద్ధి నా పుణ్యమేనని చెప్పసాగాడు. వైకుంఠం నుండి అది చూస్తున్న విష్ణుమూర్తి... అంతలోకే మారిపోయావా చంద్రబాబు అని నోరెళ్లబెట్టాడు.

Read 156 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter