జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది.
కాగా, జిల్లాలో మరో 9 మేజర్ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు అర్బనైజేషన్ క్రింద 9 పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడానికి తగిన నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడం జరిగింది. మున్సిపాల్టీలుగా ప్రతిపాదించిన పంచాయితీలలో బుచ్చిరెడ్డిపాలెం, వింజమూరు, అల్లూరు, కోట, పొదలకూరు, రాపూరు, తడ, ముత్తుకూరు, ఉదయగిరి పంచాయితీలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బుచ్చిరెడ్డిపాలెంను మున్సిపాల్టీ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ ఊరు బాగా విస్తరించింది. వ్యాపార పరంగా కూడా మంచి సెంటర్ అయ్యింది. ఇక వింజమూరు, పొదలకూరు, కోట, తడ గ్రామాలు ఇటీవలకాలంలో బాగా అభివృద్ధి చెందడమేకాక పట్టణాలుగా విస్తరించాయి కూడా! కృష్ణపట్నం పోర్టు మూలంగా ముత్తుకూరు ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది. ఇక దీనిని కూడా మున్సిపాల్టీని చేయడం తప్పనిసరి. అల్లూరునకు కూడా మున్సిపాల్టీని చేయాలనే ప్రతిపాదన వుంది. ఇక ఉదయగిరి, పొదలకూరు, రాపూరు మెట్ట ప్రాంతాలు. పట్టణీకరణలో భాగంగా వాటిని మున్సిపాల్టీలుగా మారిస్తే మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది. ఏది ఏమైనా ఈసారి స్థానిక ఎన్నికల నాటికి ఈ తొమ్మిది పంచాయితీలు కూడా మున్సిపాల్టీలుగా మారే అవకాశముంది. ఆ గ్రామాల్లో ఇంతకాలం వున్న సర్పంచ్‌లు పోయి మున్సిపల్ ఛైర్మెన్లు, వార్డు మెంబర్లు పోయి కౌన్సిలర్లు రావచ్చు.