11 March 2017 Written by 

నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?

vaka jayaబేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా సమావేశాలు... నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం, పార్టీ కండువాలు మార్చినవారికి లక్షల్లో డబ్బు...

ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి ఎన్నిక వేడెక్కుతోంది. గెలుపు కోసం ఇరు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గెలుపే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

రాష్ట్రంలో ఆరు స్థానికసంస్థల ఎన్నికలు ఏకగ్రీవం కాగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక ఎమ్మెల్సీలకు మాత్రం పోటీ నెలకొంది. మూడుజిల్లాలో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో ఈ మూడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రగులుకుంది. ఈ మూడింటిలో కూడా ఇప్పుడు నెల్లూరుజిల్లా స్థానిక ఎమ్మెల్సీ అటు అధికార తెలుగుదేశంకు, ఇటు ప్రతిపక్ష వైకాపాకు ప్రతిష్టాత్మకంగా మారింది. నెల్లూరుజిల్లాలో వచ్చే ఫలితాలు భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంకేతంగా నిలుస్తుంటాయి. కాబట్టే అటు చంద్రబాబు, ఇటు జగన్‌ నెల్లూరు స్థానిక ఎమ్మెల్సీపై ప్రత్యేకదృష్టి పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లైతే ప్రతిరోజూ తమ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీగా వాకాటిని గెలిపించి తీరాలని, గెలవకపోతే పరువుపోతుందని, గెలిపించలేకుంటే తాట తీస్తామంటూ జిల్లా నాయకులను హెచ్చరిస్తున్నారు. దీంతో మంత్రి నారాయణతో సహా జిల్లా తెలుగుదేశం నాయకులందరు కూడా ప్రలోభాలకు తెరలేపి తమ ఓటర్లను కాపాడుకోవడంతో పాటు వైసిపి ఓటర్లను డబ్బులిచ్చి ఎత్తుకొచ్చే పనిలో పడ్డారు.

ఇక వైకాపా వైపు చూస్తే స్థానిక ఎమ్మెల్సీలో ఓట్లు తక్కువుగా వున్నప్పటికీ జగన్‌ ప్రోద్భలంతోనే అభ్యర్థిని పెట్టారు. నెల్లూరు ఎమ్మెల్సీని జగన్‌ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. జిల్లాలోని వైకాపా నాయకులందరితోనూ ఆయన మాట్లాడుతున్నాడు. అవతల అధికారపార్టీ... పోలీసులను సైతం కార్యకర్తల మాదిరిగా వాడుకుంటోంది... స్థానిక ఓటర్ల మీద కేసులు పెట్టించి బలవంతంగా లొంగదీసుకుంటోంది. అయినప్పటికీ జిల్లా వైకాపా నాయకులు మాత్రం ఒక్క తాటిపై నిలబడ్డారు. తమ అభ్యర్థి కోసం శాయశక్తులా కష్టపడుతున్నారు.

కాకపోతే ఇది ప్రజలు ఓట్లు వేసే ఎన్నికలు కావు. చాలాతక్కువ మంది ఓటర్లుండే ఎన్నికలు... ఒకప్పుడు ప్రజలచేత ఓట్లేయించుకున్న వాళ్లే ఇక్కడ ఓటర్లు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఓటు ఐదొందల నుండి రెండువేల దాకా పోతుంది. ఇక్కడ వేలల్లో కాదు... సొంత పార్టీ వాడికైతే రెండు లక్షలు, అవతల పార్టీ నుండి వస్తే ఐదులక్షలు. కాబట్టి పార్టీ లేదు, నీతి లేదు, సిద్ధాంతం లేదు. ఒకటి డబ్బు... రెండోది అధికారం. కాబట్టి ఈ విషయంలో అధికారపార్టీ వైపే కొంచెం మొగ్గు వుంటుంది.

ముఖ్యంగా దీనిని నెంబర్‌ గేమ్‌ అనవచ్చు. స్థానిక శాసనమండలి నియోజకవర్గంలో వైసిపి కంటే కూడా టీడీపీకే 152మంది సభ్యుల బలం అధికంగా వుంది. ఇప్పుడు కొంతమంది సభ్యులు అటు ఇటు మారి వున్నారు. మారిన సమీకరణాలను బట్టి తెలుగుదేశం శిబిరంలో ఈ స్కోర్‌ ఇంకా పెరిగి ఉండొచ్చు. వాస్తవంగా 2014లో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఈ జిల్లాలో అత్యధిక స్థానాలను వైకాపానే గెలుచుకుంది. వైసిపికి 438 మంది ఉండగా, టీడీపీకి 352మందే ఉండినారు. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం, తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈ సంఖ్యలు మారిపోయాయి. జడ్పీ ఛైర్మెన్‌ ఎన్నిక సమయంలో కొందరు జడ్పీటీసీలు తెలుగుదేశంలో చేరారు. వీరితో పాటు కొందరు ఎంపీటీసీలూ చేరడం జరిగింది. అలాగే నెల్లూరు మేయర్‌ అజీజ్‌ వైసిపి నుండి టీడీపీలోకి దూకిన సమయంలోనూ కొందరు కార్పొరేటర్లు పార్టీ మారారు. ఆ తర్వాత అక్కడక్కడా ఎంపీటీసీలు వైసిపి నుండి టీడీపీలోకి జంప్‌ చేయడంతో స్థానిక శాసనమండలి ఓట్లలో అధికార పార్టీదే పైచేయి అయ్యింది.

పార్టీల పరంగా బలాబలాలు చూసినా, క్యాంపులలో వున్న సభ్యుల సంఖ్యను చూసినా నెల్లూరు స్థానిక ఎమ్మెల్సీపై వైకాపా ఏ మాత్రం ఆశలు పెట్టుకోనవసరం లేదు. కాకపోతే వారి ఆశల్లా కూడా స్థానిక ఓటర్లుగా వున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు... తమ ఆత్మసాక్షిగా ఓటేస్తే గెలుస్తామనే నమ్మకం. తెలుగుదేశం గుర్తు మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశంకు, వై.యస్‌. బొమ్మతో గెలిచిన వాళ్ళు వైకాపాకు ఓటేస్తే ఇక్కడ వైకాపా అభ్యర్ధిదే విజయం. తెలుగుదేశం అధికారపార్టీ కాబట్టి అక్కడ ఏదో జరుగుతుందని చాలామంది స్థానిక నాయకులు ఆ పార్టీలో చేరారు. అక్కడ చేరాక తెలిసింది వారికి... ఇక్కడకు రావడం దండగని. వై.యస్‌. బొమ్మ మీద గెలిచి, పార్టీ మారినవాళ్ళు, కనీసం తమ పొరపాటును సరిదిద్దుకోవడానికైనా ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి మద్దతునిస్తారని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అలాగే అభ్యర్థుల పరంగా చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి కంటే కూడా వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ఎన్నో విధాలా బెటర్‌! వాకాటి లాగా ఆయన బ్యాంకులకు వందలకోట్లు అప్పులేడు. తన గురించి గొప్పలు చెప్పుకోడు. వాకాటిలాగా ఎంపీటీసీలను జడ్పీటీసీలను చీప్‌గా చూడడు. సర్పంచ్‌, ఎంపీటీసీగా చేసిన నాయకుడు. కాబట్టి స్థానిక నేతల విలువ తెలిసిన మనిషి. అదీగాక ఆనం సోదరుల నలుగురిలోకల్లా మంచి పేరున్నది విజయకుమార్‌రెడ్డికే! కుట్ర రాజకీయాలు తెలియవు. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం. నమ్మితే అవతల మనిషికి చాకిరిచేసే వ్యక్తిత్వం. పార్టీలను పక్కనపెట్టినా అభ్యర్థుల గుణగణాలను బట్టి ఓట్లేసినా విజయకుమార్‌రెడ్డిని విజయం వరించవచ్చు.

ఇక నెల్లూరు స్థానిక శాసనమండలిలో ఓటర్లను చూస్తే... పార్లమెంటు సభ్యులు ఇద్దరు, శాసనసభ్యులు 10 మంది, ఎమ్మెల్సీలు 3, జడ్పీటీసీలు 46 మంది, ఎంపీటీసీలు 585, కార్పొరేటర్లు 54, కౌన్సిలర్లు 144 మంది కలిపి మొత్తం 844మంది ఓటర్లు

ఉన్నారు. తెలుగుదేశం క్యాంపులో 450మంది ఇప్పటికే ఉన్నట్లు సమాచారం. కాగా, వైసిపి క్యాంపులో 330మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు క్యాంపులకు పోకుండా బయటే తిరుగుతున్నారు.

మొత్తానికి జిల్లా రాజకీయాలలో టెన్షన్‌ వాతావరణమే వుంది. నెల్లూరుజిల్లా స్థానిక ఓటర్లయిన కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు భవిష్యత్‌ రాజకీయాన్ని నిర్ధేశించే నిర్మాతలుగా మారారు. మరి వారి తీర్పు ఎలా వుండబోతుందో చూద్దాం!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • బాలయ్య మాటిచ్చాడు... చంద్రబాబు పదవిచ్చాడు
    నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఇఫ్కో అక్రమ భూములను స్వాధీనం చేసుకోవాలి
    ఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter