Home జిల్లా వార్తలు ఇది వందేళ్ళ ప్రాభవం… ఇక రానున్నది వైభవం!

ఇది వందేళ్ళ ప్రాభవం… ఇక రానున్నది వైభవం!

దేశభక్తితో, సమాజసేవానురక్తితో సుమారు నూరేళ్ళ క్రితం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు పొణకా కనకమ్మగారు నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. బాలికలకు విద్య నేర్పడం ద్వారా వారి కుటుంబాలు, తద్వారా సమాజం చైతన్యవంతమవుతుందనే సదాశయంతో అందుకు పలువురు సమాజసేవాభిలాషులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ దాతలు ఆ విద్యాలయానికి అండగా నిలిస్తే, జిల్లా ప్రజల చల్లని దీవెనలతో అప్పట్లో ఈ విద్యాలయం ప్రారంభమైంది. బాలికలకు చదువు అవసరం లేదనే భావన ఉన్న ఆ రోజుల్లో, ప్రజలను చైతన్యవంతం చేసి జిల్లాలో బాలికలకు విద్యాలయం స్థాపించి నిర్వహించిన ఆ మహనీయుల సేవలు ఏనాటికీ మరువలేనివి.

అయితే, కాలక్రమంలో ఈ విద్యాలయం అనేక కష్టనష్టాలకు లోనైంది. ఒక విద్యాలయంతో పాటు బాలికల హాస్టల్‌ను నిర్వహించాలంటే ఎన్ని కష్టాలుంటాయో అన్నిటినీ చవిచూసింది. ఎంతో పటిష్టమైన విధానాలతో విద్యాలయం కమిటీ ఈ విద్యాలయాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు తన శాయశక్తులా కృషిచేసింది. తదనంతర కాలంలో, కాలం మారుతున్న కొద్దీ విద్యాలయం నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు రావడం, కమిటీలోని పలువురు ముఖ్యులు కూడా లేనిపోని విమర్శలకు గురికావడం జరిగింది. ఎన్నో అపోహలు, అభిప్రాయభేదాలు రావడం, కమిటీలోనివారే అనేక అంశాలను వివాదగ్రస్తం చేయడం..దీంతో పలువురు ముఖ్యులు తీరని ఆవేదనకు గురికావడం కూడా జరిగాయి. ఇటీవలి కాలంలో కస్తూరిదేవి విద్యాలయంపై విమర్శలు, అపవాదులు పెరుగుతుండడం మరింత విచారకరం. విద్యాలయం ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయంటూ లేనిపోని విమర్శలతో కొందరు నిందాపూరిత వ్యాఖ్యలతో వివాదాలకు దిగుతుండడం ఎంతైనా బాధాకరం. విద్యాలయం అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వకుండా…విద్యాలయం బాగును ఏనాడూ పట్టించుకోకుండా ఉన్న కొందరు..ఎవరి చిత్తానుసారం వారు నోటికొచ్చినట్లు విద్యాలయం ప్రతిష్టను దిగజారుస్తూ విమర్శలు చేయడం, కమిటీ తమ మాట వినడం లేదనే అక్కసుతో ప్రముఖులపై నిందలు వేయడం సర్వసాధా రణమైపోయింది.

అయితే, సమాజానికి మంచి చేయాలనుకునేవారు తమ కర్తవ్య నిర్వహణలో ఏనాడూ ఎలాంటి విమర్శలకు వెనుకంజ వేయరు కనుక, తమపై కొందరు అదేపనిగా నిందారోపణలు చేస్తున్నా లెక్కచేయకుండా..విద్యాలయం ప్రగతికి బాటలు వేస్తూ, విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వస్తున్న జివికెరెడ్డి గారి వంటి ప్రముఖ వదాన్యుల దాతృత్వంతో ఈ విద్యాలయం నేటికీ కళకళలాడుతూనే ఉంది. పూజ్యబాపూజీ ఆశీస్సులతో స్థాపించిన ఈ విద్యాలయం నాటికీ..నేటికీ..ఏనాటికైనా ప్రగతిపథంలో రాణిస్తూనే ఉండాలనే సదాశయంతో నేటికీ ఎందరో ప్రముఖులు, సమాజసేవాభిలాషులు ఈ విద్యాలయం అభివృద్ధిని కాంక్షిస్తూనే ఉన్నారు. వారందరి అభిమానంతో..వారి సహాయ సహకారాలతో, సింహపురిసీమలోని ప్రజలందరి చల్లని దీవెనలతో..సమాజశ్రేయస్సు కోసం ఈ విద్యాలయాన్ని స్థాపించి.. జిల్లాలో తొలి బాలికా విద్యాలయాన్ని సగర్వంగా ముందుకు నడిపించి..నిర్వహించిన నాటి మహనీయుల స్ఫూర్తిదీప్తులతో… ఈ విద్యాలయం అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందడుగు వేస్తూనే ఉంది. కస్తూరిదేవి విద్యాలయం పరిపూర్ణమైన అభివృద్ధితో ఎల్లవేళలా కళకళలాడుతూ ఉండాలని, సరస్వతీనిలయంగా.. బాలికలకు విద్యా కల్పతరువుగా కలకాలం వర్థిల్లుతూ ఉండాలన్నదే మా ఆకాంక్ష!….

కొత్త కమిటీ రాకతో పనులు వేగవంతం…

కస్తూరిదేవి విద్యాలయానికి ఆగస్టు 4, 1994న కొత్త కమిటీ ఏర్పాటుతో మునుపటిలా మళ్ళీ విద్యాలయం అభివృద్ధికి పనులు వేగవంతమయ్యాయి. మరమ్మతులకు గురై ఉన్న స్కూల్‌ భవనానికి, విద్యుత్‌ వైరింగ్‌ బాగుచేసేందుకు నిధులను కేటాయిస్తూ విద్యాలయం నూతన కమిటీ నిర్ణయాలు తీసుకుంది. విద్యాలయాన్ని జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు, శ్రీ కస్తూరిదేవి అప్పర్‌ప్రైమరీ (ఇంగ్లీష్‌ మీడియం) పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ తీర్మానించింది. ఈ కమిటీ సమావేశంలో శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డిగారితో పాటు, విద్యాలయం సెక్రటరీ-కరెస్పాండెంట్‌ మరియు కోశాధికారి శ్రీ జెవి రెడ్డిగారు, ఎం. ఆదిశేషారెడ్డి, ఏ. ఉషారెడ్డి, సి. విజయలక్ష్మిగార్లతో పాటు, ప్రత్యేక ఆహ్వానితునిగా శ్రీ టి.కోదండరామిరెడ్డిగారు పాల్గొన్నారు. శ్రీ కస్తూరిదేవి పాఠశాల గోల్డన్‌జుబ్లీ వేడుకలు డిశెంబర్‌ 10న నిర్వహించాలని 1995 అక్టోబర్‌ 25న జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అదేవిధంగా, ఈ విద్యాలయం ప్రాంగణంలో విద్యార్థినులు ఉన్నత చదువులకు అనుకూలంగా మహిళా డిగ్రీ కళాశాలను కూడా ప్రారంభించాలని కమిటీ తీర్మానించింది. ఈ సమావేశంలో శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డిగారితో పాటు, శ్రీ జెవి రెడ్డి, శ్రీ ఎం. ఆదిశేషారెడ్డి, శ్రీ గోపాలకృష్ణారెడ్డి, శ్రీమతి మాగుంట పార్వతమ్మ, ఏ.ఉషారెడ్డి, టి.శాలిని, వై.అమృత వల్లి, సి.విజయలక్ష్మిగార్లు పాల్గొన్నారు. ఆ తర్వాత, 16-5- 1996లో జరిగిన సమావేశంలో ఎం.ఆదిశేషారెడ్డిగారు కమిటీ సభ్యత్వం నుంచి విరమణ పొందారు. శ్రీ తిక్కవరపు కోదండరామి రెడ్డిగారు, శ్రీ కొండా బలరామరెడ్డిగార్లను సభ్యులుగా కోఆప్ట్‌ చేసుకుంటూ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 18-5-1996 నుంచి 31-12-2000 వ సంవత్సరం దాకా వీరి సభ్యత్వకాలం ఉంటుందని కమిటీ పేర్కొంది.

కాగా, ఈ విద్యాలయ నిర్మాణం తొలినాళ్ళ నుంచి విద్యా లయానికి అన్నివిధాలా తగు సలహాలు, సూచనలు అందజేస్తూ విద్యాలయం పురోభివృద్ధికి ఏళ్ళ తరబడి కృషిచేసిన మహోన్నత వ్యక్తి..ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కస్తూరిదేవి విద్యాలయ కమిటీ అధ్యక్షులు డా. బెజవాడ గోపాలరెడ్డిగారు కమిటీ అధ్యక్షునిగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రతిపాదన మేరకు ఆయన స్థానంలో శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగారు కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆ మేరకు 18-5-1996న జరిగిన కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కస్తూరిదేవి విద్యాలయం కమిటీ సభ్యురాలిగా ఉన్న శ్రీమతి మాగుంట పార్వతమ్మగారు పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైనం దుకు అభినందిస్తూ పార్వతమ్మగారిని సన్మానించాలని కూడా ఈ సందర్భంగా కమిటీ నిర్ణయించుకుంది.

మహోన్నత మానవతామూర్తి డా. బెజవాడ గోపాలరెడ్డి గారి కన్నుమూతతో కమిటీ దిగాలు

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, అకళంక దేశభక్తుడు, భరతమాత ముద్దుబిడ్డ.. మహోన్నత సేవామూర్తి.. మానవతామూర్తి…డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారు 9-3-1997న పరమపదించారు. వారి కన్నుమూతతో కస్తూరిదేవి విద్యాలయం నిర్వాహకులతో పాటు జిల్లా ప్రజలంతా శోకతప్తులయ్యారు. శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి అస్తమయంతో జిల్లా శోకసంద్రమైంది. నెల్లూరు కీర్తిమూర్తిగా ప్రసిద్ధి చెందిన మచ్చలేని రాజకీయ నాయకుడు, సమాజసేవాభిలాషి, త్యాగధనుడైన శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి మృతితో నెల్లూరుసీమ ఒక మహానేతను కోల్పోయినట్లయింది.

ప్రత్యేకించి డా. బెజవాడ గోపాలరెడ్డిగారు కస్తూరిదేవి విద్యాలయానికి చేసిన సేవలు అనన్యసామాన్యం.. అపూర్వం కూడా. విద్యాలయం కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దదిక్కుగా ఉంటూ విద్యాలయం కమిటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆ బాధలనుంచి కమిటీని గట్టెక్కించేందుకు డా. బెజవాడ గోపాలరెడ్డిగారి సహకారం ఏనాటికీ మరువలేనిది. ఆయన మరణంతో కమిటీ దిగాలు పడిపోయింది. ఎట్టకేలకు కోలుకుని వారి స్ఫూర్తితో విద్యాలయాన్ని ముందుకు నడిపించేందుకు కమిటీ సంకల్పించింది. డా. బెజవాడ గోపాలరెడ్డిగారు ఈ విద్యాలయానికి చేసిన అపూర్వమైన సేవలకు గుర్తుగా 1997 ఆగస్టు 5న డా.బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీ ప్రారంభమైంది.

సింహపురిసీమ కీర్తికేతనంగా నిలచిన సేవాపతాక డా.బెజవాడ గోపాలరెడ్డిగారి స్వీయచరిత్రను ఈ సందర్భంగా ‘లాయర్‌’ వారపత్రిక ఒక గ్రంథంగా ముద్రించడం, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీమతి వి.ఎస్‌.రమాదేవిగారి చేతుల మీదుగా డా|| బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీతో పాటు ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం అందరికీ తెలిసిందే.

శ్రీ జివికెరెడ్డిగారి సారధ్యంలో ముందుకు సాగిన కమిటీ…

24-11-2000వ సంవత్సరంలో జరిగిన సమావేశంలో అప్పటిదాకా ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగారి రాజీనామాను కమిటీ ఆమోదించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన కస్తూరిదేవి విద్యాలయానికి చేసిన సేవలను కమిటీ ప్రస్తుతించింది. కమిటీ సభ్యునిగా, ప్రెసిడెంట్‌గా ఆయన ఇంతకాలంగా చేసిన సేవలను కమిటీ కొనియాడింది. ఆయన స్థానంలో శ్రీ కస్తూరిదేవి విద్యాలయం ప్రెసిడెంట్‌గా జివికె గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీ జివి కృష్ణారెడ్డి(జివికె రెడ్డి)గారి పేరును శ్రీ గోపాలకృష్ణారెడ్డిగారు ప్రతిపాదించగా, అందుకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. శ్రీ జివికె రెడ్డిగారు సభ్యునిగా, ప్రెసిడెంట్‌గా నియమితులైనట్లు కమిటీ ప్రకటించింది.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీ జివికె రెడ్డిగారిని ఘనంగా సన్మానించాలని, 2-2-2001న సన్మానం నిర్వహించాలని తేదీని నిర్ణయిస్తూ 12-1-2001లో జరిగిన కమిటీ సమావేశం తీర్మానించింది. అదే సభలో శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగారికి ఘనంగా వీడ్కోలు కూడా నిర్వహించాలని నిర్ణయించింది. శ్రీ జివికెరెడ్డిగారి సారధ్యంలో కమిటీ నూతనోత్సాహంతో ముందుకు సాగింది. విద్యాలయం పురోభివృద్ధికి చేపట్టాల్సిన అనేక అంశాలను కమిటీ చర్చించింది.

ఆ తర్వాత, 10-5-2001లో జరిగిన సమావేశంలో శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు, శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగార్ల ప్రతిపాదన మేరకు శ్రీ పివి ప్రసన్నరెడ్డిగారిని కమిటీ సభ్యునిగా నియమిస్తూ కమిటీ తీర్మానించింది. 15-6-2001లో జరిగిన సమావేశంలో ఎన్‌. అనిల్‌కుమార్‌రెడ్డిని సభ్యునిగా కో-ఆప్ట్‌ చేసుకుంటూ కమిటీ తీర్మా నించింది. విద్యాలయానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తగు పర్యవేక్షణ జరుపుతుండాలని భావించి, ఆ బాధ్యతను శ్రీయుతులు మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగారికి, శ్రీ జెవిరెడ్డి, శ్రీ ప్రసన్నకుమార్‌రెడ్డి, శ్రీ అనిల్‌కుమార్‌రెడ్డిగార్లకు అప్పగిస్తూ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత కొద్దికాలానికి శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డిగారు మృతి చెందడంతో, 29-6-2002లో జరిగిన సమావేశంలో ఆయనకు కమిటీ నివాళులర్పించింది. విద్యాలయానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. ఆనాడు కూడా నిరాధార నిందలతో జి.వి.కె.రెడ్డిపై కొంతమంది స్వార్ధపరులు రేపిన అలజడి కారణంగా మనస్తాపం చెంది ఆయన కొంతకాలం సంస్థకు దూరంగా వున్నారు. అప్పటికే పరుల ఆధీనంలో వుండిన కొన్ని యకరాల స్థలాన్ని తన స్వంత నిధులిచ్చి మరీ ఖాళీ చేయించింది కూడా ఆయనే.

డా.బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీలో కంప్యూటర్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి…

2-5-2003లో జరిగిన సమావేశంలో కస్తూరిదేవి విద్యాలయంతో పాటు డా.బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీ మరియు ఇంగ్లీష్‌మీడియం హైస్కూల్‌ పురోభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో కమిటీ చర్చించింది. బిజిఆర్‌ ఉమెన్స్‌ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థినులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఒక అధునాతనమైన కంప్యూటర్‌ కేంద్రాన్ని సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసేందుకు శ్రీ వినయ్‌ కె. నాగారెడ్డి అనే (అమెరికా) ఎన్‌ఆర్‌ఐ ముందుకు రాగా, 28-4-2004లో జరిగిన కమిటీ సమావేశంలో ఆ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. విద్యాలయం ప్రాంగణంలోని ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు జివికె ఫౌండేషన్‌ అందిస్తున్న వితరణకు ధన్యవాదాలు చెప్తూ 30-7-2005లో జరిగిన సమావేశంలో కమిటీ తీర్మానించింది. శ్రీ కస్తూరిదేవి విద్యాలయం అభివృద్ధికి చేస్తున్న వివిధ పనుల పురోగతిని కూడా ఈ కమిటీ సమావేశంలో చర్చించారు. డా.బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీలో పిజి సెంటర్‌ను కూడా ప్రారంభిస్తే విద్యార్థినులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని వచ్చిన ప్రతిపాదనకు కమిటీ సభ్యురాలు శ్రీమతి మాగుంట పార్వతమ్మగారు సమ్మతించగా, అందుకు తగ్గ ఏర్పాట్లపై కమిటీ ఈ సమా వేశంలో చర్చించింది. కస్తూరిదేవి విద్యాలయానికి ఎంతో సేవలందించిన శ్రీ పట్టాభిరామరెడ్డిగారు మృతిచెందగా, ఆయనకు కమిటీ ఘన నివాళులర్పిస్తూ 17-10-2006లో జరిగిన సమా వేశంలో వారి సేవలను కొనియాడింది. ఆ తర్వాత, శ్రీమతి నందనారెడ్డిని కమిటీ సభ్యురాలిగా నియమిస్తూ కమిటీ ఈ సమావేశంలో తీర్మానించింది. అదే విధంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వితరణను చాటుకోగా ఆ దాతలకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. శ్రీ గాదంశెట్టి, ఇమ్మిడిశెట్టి కుటుంబసభ్యులు లక్షా 50 వేల రూపాయలు, శ్రీ అచ్యుత సుబ్రహ్మణ్యం గారు లక్ష రూపాయలు, ఎం. రవిచంద్రారెడ్డిగారు 40వేల రూపాయ లను, సావిత్రమ్మగారి కుటుంబసభ్యులు పాతిక వేల రూపాయలు, శ్రీ తుంగా శివ ప్రభాత్‌ రెడ్డిగారు 20వేల రూపాయలను స్కాలర్‌షిప్‌ల కోసం ఆ మొత్తాలను అంద జేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరి ఔదార్యానికి కమిటీ తన కృతజ్ఞతలు తెలిపింది. కాగా, కమిటీ సభ్యులుగా ఉన్న ఎన్‌.అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీమతి వై.అమృత వల్లి, శ్రీమతి ఏ.ఉషాగార్లు తమ సభ్వత్వా లకు రాజీనామాలు చేయగా, వారి స్థానంలో శ్రీ వివి కృష్ణారెడ్డి, శివప్రసాద్‌, టి.ఎన్‌ విజయనారాయణరెడ్డిగార్లను నియ మిస్తూ 26-3-2011లో జరిగిన సమా వేశంలో కమిటీ తీర్మానించింది. శ్రీయు తులు జివికెరెడ్డిగారిని, శ్రీ జెవి రెడ్డి, శ్రీ పివి ప్రసన్నరెడ్డి, శ్రీమతి డి. అనూరాధరెడ్డి, శ్రీమతి మాగుంట పార్వతమ్మల సభ్యత్వ కాలం మరో అయిదేళ్ళపాటు పొడిగిస్తూ, వారిని కమిటీలో తిరిగి నియమిస్తూ 26-3-2011లో జరిగిన కమిటీ సమా వేశంలో తీర్మానించింది. శ్రీ జివికెరెడ్డి గారిని కమిటీ ఛైర్మెన్‌గా, శ్రీ జెవిరెడ్డి గారిని సెక్రటరీ మరియు కోశాధికారిగా నియ మిస్తూ కమిటీ తీర్మానించింది. ఈ సమా వేశంలో శ్రీ జెవిరెడ్డి గారు, శ్రీమతి మాగుంట పార్వతమ్మ, శ్రీమతి నందనా రెడ్డి, శ్రీమతి డేగా అనూరాధారెడ్డి పాల్గొన్నారు.

అసలేం జరిగింది! ఏం జరగబోతోంది…

నెల్లూరుజిల్లా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి నేడు భారత ఉపరాష్ట్రపతిగా ప్రపంచ ప్రజల ప్రశంసలందుకుంటున్న వెంకయ్యనాయుడి గారి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ పక్షాన కస్తూరిదేవి విద్యాలయ సంస్థలను అభివృద్ధి చేయడానికి ఆయన కుమార్తె స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీమతి దీపావెంకట్‌ ఒక ప్రణాళికతో ముందుకొచ్చి కమిటీ అధ్యక్షుడు జి.వి.కె.రెడ్డికి ప్రతిపాదన పంపారు. ఒక మంచి సేవాదృక్పథంతో పనిచేస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ లాంటి వారి సహకారంతో కస్తూరి దేవిని మంచి విద్యాప్రాంగణంగా తీర్చిదిద్దొచ్చనే సంకల్పంతో వారి ప్రతిపాదనని జి.వి.కె. రెడ్డి గారు ఇతర కమిటీ సభ్యులు ఆమోదించిన వెంటనే ఆమెను కమిటి సభ్యురాలుగా తీసు కుంటూ ఆమెతో పాటు మరికొంతమంది సభ్యు లను నియమించుకోవడం, కొంతమంది పాతవారిని తొలగించడం వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే అసలు కథంతా మొదలయ్యింది. కమిటీలో వుంటూనే కమిటీ సభ్యులకు వత్తాసు పలుకుతున్నట్లు నటిస్తూనే ఓ కమిటీ సభ్యుడు ఈ అంతర్గతంగా జరిగే కమిటీ నిర్ణయాలన్నీ ఓ అభివృద్ధి నిరోధకుడికి చేరవేశారు. అంతే ఇంకేముంది నేనుండగా కస్తూరిదేవి అభివృద్ధా అంటూ శపథం పట్టిన ఆ వీరుడు వెంకయ్యగారి కుటుంబం కస్తూరిదేవిలోకి వస్తే వెంకయ్యను సైతం నెల్లూరులో కాలు పెట్టనీయం అంటూ బెదిరింపులకు దిగాడు. సహజంగా వివాదాలకు దూరంగా వుండే నాయుడుగారు సైతం ఈ రొచ్చు మనకెందుకులే అని కమిటీ నుండి దీపమ్మని తప్పుకోమన్నారు. ఏ తప్పు చేయని తన మీద నిందలు వేయడంతో, ఎవ్వరికీ జంకకుండా తాను చేయదలుచుకున్న అభివృద్ధిని కోట్ల రూపాయల ఖర్చుతో చేసి చూపించడానికి ఇప్పుడు జి.వి.కె.రెడ్డి సన్నద్ధ మయ్యారు. తనను గురించి వాగినోళ్ళ నోళ్ళు మూయించడమే లక్ష్యంగా, వాళ్ళందరూ ఆశ్చర్యపడే స్థాయిలో అభివృద్ధి చేసి చూపించడమే ధ్యేయంగా ఆయన ముందుకుపోతున్నారు.

తొలగిన అడ్డంకులు..

గతంలో కొన్ని సందర్భాలలో సంస్థ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయాలలో భాగమే ”శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్‌” కల్యాణ మండపం ఆవిర్భావం. ఇప్పుడు అభివృద్ధికి పునాది వేయడా నికి ప్రధాన అడ్డంకి ఆ కల్యాణ మండపమే. అయితే మండపం లీజు దారుడు సైతం ఇప్పుడు పెద్ద మనసుతో ముందుకు వచ్చాడు. తన మండపా నికి ముందువైపునున్న స్థలాన్ని సంస్థ అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన అధునాతన భవన సము దాయానికి ఇవ్వడానికి సమ్మతించాడు. తనకు అవసరమైన పార్కింగ్‌ కొరకు కొంత స్థలాన్ని వెనుకవైపు తీసుకోవడా నికి ఒప్పుకున్నాడు.

ఇదేమన్నా అమరావతా…?

రాత్రికి రాత్రి అద్భుతాలు చేసి భారీ సౌధాలు నిర్మించడానికి ఇది అమరావతి కాదు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మరో వందేళ్ళు గుర్తుండిపోయేలా సంస్థలో జరగబోయే చారిత్రా త్మక అభివృద్ధిని చూడాలంటే ఓర్పు కావాలి. రాత్రికి రాత్రే భవనాలు వెలవాలంటే జివికె రెడ్డి గారు అల్లావుద్దీన్‌ కాదు. ఆయన దగ్గర అద్భుత దీపం లేదు. అనవసర నిందలు ఇప్పటికైనా మాని అభివృద్ధికి అండదండలందిస్తే అందరూ సంతోషిస్తారు.

చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇప్పుడు వారసులం అని చెప్పుకుంటున్న వారు చేసిన ప్రయత్నాలు, నగర నడిబొడ్డులో వున్న ఆస్తులను రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌ మెంట్‌ కోసం ఇచ్చి, ఊరి బయట వందెకరాలు కొందాం అని చేసిన ప్రతిపాదనలతో పాటు ఇంకా అనేక వాస్తవాలను ప్రజల ముందుంచాల్సి వస్తుంది. ఇప్పుడా వివరాలన్నీ తెలిపి వ్యవస్థాపకులు, దాతల మనోభావా లను దెబ్బతీయడం మా అభిమతం కాదు.

కస్తూరిదేవి పురోగతే ‘లాయర్‌’ ధ్యేయం. కస్తూరిదేవి సంస్థలు కళకళలాడాలన్నదే ‘లాయర్‌’ లక్ష్యం. అందుకోసం ఎవరు ముందుకొచ్చినా తన భుజాన్ని అందించడానికి ‘లాయర్‌’ అన్నివేళలా సిద్ధం.

14 వారాల పాటు ‘లాయర్‌’ ప్రచురించిన ”ఇదీ కస్తూరిదేవి కథ”ను అభిమానంతో ఆదరించినందుకు మా పాఠకదేవుళ్ళందరికీ నమస్సుమాంజలులు. – సం/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here