Home జిల్లా వార్తలు 2018 కరువునే కానుకగా ఇచ్చి వెళ్తోంది!

2018 కరువునే కానుకగా ఇచ్చి వెళ్తోంది!

ప్రతి సంవత్సరంలో శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం వుంటుంటాయి. 2018లో మాత్రం ఎండాకాలం, కొంత శీతాకాలం మాత్రమే చూసాం. వర్షాకాలం అన్నదే లేకుండా ఈ ఏడాది ముగియబోతోంది. నెల్లూరుజిల్లా చరిత్రలో 2018 ఒక దారుణమైన సంవత్సరంగా నమోదు కాబోతోంది. ఈ జిల్లాకు కరువును వదిలి వెళ్లిపోతున్న సంవత్సరం ఇది!

ఇక ఆశలు లేవు… డిసెంబర్‌ చివరికొచ్చేసాం. రెండే రెండు రోజుల్లో 2019లోకి అడుగుపెట్టబోతున్నాం… చలి కూడా బాగానే వుంది. కాబట్టి ఇక వర్షాలపై ఆశలు పూర్తిగా అడుగంటాయి. ఈ ఏడాది జిల్లాలో వర్షపాతం దారుణాతి దారుణంగా వుంది. జిల్లాలో అసలు వర్షాలే లేవు. జనవరిలో మొదలైన ఎండలు నవంబర్‌ దాకా కాసాయి. నైరుతి ఋతుపవనాల వల్ల జిల్లాలో ఎప్పుడూ వర్షాలు పడవు, కనీసం ఈశాన్యంలో అయినా పడతాయా అని చూస్తే అప్పుడు కూడా పడలేదు. జోరుగా వర్షాలు కురిసే చిత్త, స్వాతి కార్తెల్లో కూడా మిడిమేళంగా ఎండలు కాశాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలకల్లా భారీగా వర్షాలు పడి చెరువులు, బావులు, కుంటలు నిండిపోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. డిసెంబర్‌లో జిల్లాలో దాదాపు 15లక్షల ఎకరాలలో నాట్లు పడాలి. కాని ఈ సంవత్సరం అంత సీన్‌ లేకుండా పోయింది. సోమశిలలో 30టిఎంసీల నీళ్లున్నాయి. మొదటి కారుకు 5లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లివ్వగలమని అంటున్నారు. సాగునీళ్ళకే కాదు, తాగునీళ్ళకు కూడా రేపు వచ్చే సంవత్సరమంతా సోమశిల జలాలే దిక్కు. కనీసం డెల్టాలో కొంతవరకు విస్తీర్ణం సాగుకు సోమశిల నీళ్లన్నా వున్నాయి. మెట్ట ప్రాంత మండలాల పరిస్థితైతే ఇంకా ఘోరం. వర్షాలన్నా పడితే మినుము, పొగాకు, పెసర, వేరుశెనగ వంటి పంటలన్నా వేస్తారు. ఇప్పుడు ఆ పంటలు కూడా లేవు. పొలాలు బీళ్ళుగా వున్నాయి. ఉదయగిరి ప్రాంతంలో మొన్న నవంబర్‌లోనే ట్యాంకర్లను పెట్టి మంచినీళ్ళు సరఫరా చేశారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఆ తాగునీటి సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చబోతున్నాయి. మొత్తంగా చూస్తే వర్షాలు లేని దెబ్బకు కరువుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here