Home గ్రామ సమాచారం హద్దులు దాటిన… అధికార అహంకారం!

హద్దులు దాటిన… అధికార అహంకారం!

కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అధికార గర్వం ఏ స్థాయిలో తలకెక్కిందో అక్కడక్కడా చూస్తూనే వున్నాం. అధికారులను ఇసుకలో జుట్టుపట్టి ఈడ్చి కొట్టడం, సభలు సమావేశాలలో పబ్లిక్‌గా బూతులు తిట్టడం, ఎయిర్‌పోర్టులలో సిబ్బందిపై వీరంగం చేయడం… ఇలా ఎన్నో సంఘటనలున్నాయి. ఎమ్మెల్యేలంటే ప్రజలకు తాము సర్వెంట్లం అనుకోవడం లేదు. తాము దేవలోకం నుండి డైరెక్ట్‌గా ఊడిపడ్డామన్నట్లుగా కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఫీలవుతున్నారు. ఇలాంటి బాపతే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.

అధికార గర్వంతో పాటు నోటి దురుసు బాగా వున్న నాయకుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. 2014లో జడ్పీ ఛైర్మెన్‌ ఎన్నిక సందర్భంగా జడ్పీ హాల్‌లో అప్పటి కలెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌పై ఆయన చేసిన వీరంగాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ చూసారు. ఇటీవలే తెలుగుదేశం కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలంటూ అధికారులను ఆయన బూతులు తిడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం కూడా చూసాం. అయితే ఆయన అధికారులను, ప్రతిపక్ష పార్టీ వాళ్ళనే కాదు, సొంత పార్టీ వాళ్ళను కూడా వదలడం లేదు. తాజాగా వెంకటగిరిలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ.

గ్రామానికి సర్పంచ్‌, పట్టణానికి ఛైర్మెన్‌, నగరానికి మేయర్‌, రాష్ట్రానికి గవర్నర్‌, దేశానికి రాష్ట్రపతి ప్రథమపౌరులు. ఈ పదవులకు రాజ్యాంగ పరిధిలో ప్రత్యేక గౌరవం వుంది. కేంద్ర మంత్రి అయినా సరే ఒక పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ పట్టణ ఛైర్మెన్‌కే మొదటి ప్రాధాన్యత వుంటుంది. రాజ్యాంగబద్ధంగా ఏ హోదాలో వున్నవారైనా గౌరవించాల్సిన పదవులివి. అలాంటి గౌరవం ఇవ్వాల్సిన పదవినే అవమానించేలా ప్రవర్తించాడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.

ఈ నెల 7వ తేదీన వెంకటగిరి మున్సిపల్‌ సమావేశం జరిగింది. మున్సిపల్‌, కార్పొరేషన్‌ సమావేశాలలో ఛైర్‌పర్సన్‌లు, మేయర్‌లు మాత్రమే అధ్యక్షస్థానంలో వుంటారు. వాటి పరిధిలో సభ్యులు కింద తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల సమావేశాలకు హాజరైనా సాధారణ సభ్యుల పక్కనే కూర్చోవాలి. అధ్యక్ష స్థానంలో వున్న మేయర్‌ లేదా ఛైర్‌పర్సన్‌లను వాళ్ళు తప్పక గౌరవించాలి.

కాని, 7వ తేదీ వెంకటగిరి మున్సిపల్‌ సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణ ఈ కట్టుబాటు తప్పాడు. ఛైర్‌పర్సన్‌కు ప్రత్యేకంగా వేసివున్న కుర్చీని కమిషనర్‌తో చెప్పి పక్కన పెట్టించాడు. అంతేకాదు, ఛైర్‌పర్సన్‌కు ఒక ప్లాస్టిక్‌ కుర్చీ వేయించాడు. ఛైర్‌పర్సన్‌ పక్కనే తనకూ ఒక కుర్చీ వేయించుకున్నాడు. సమావేశాన్ని అలాగే జరిపించాడు. ఎమ్మెల్యే దెబ్బకు జడిసి ఛైర్‌పర్సన్‌ కుర్చీకున్న గౌరవాన్ని కాపాడాల్సిన కమిషనర్‌, ఈ విషయంలో కుక్కినపేను అయ్యాడు. జరిగిన సంఘటనతో అవమానంగా ఫీలై ఛైర్‌పర్సన్‌ దొంతు శారద కంటతడి పెట్టుకుంది.

తొలి నుండి విభేదాలు…

వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణకు ఛైర్‌పర్సన్‌ దొంతు శారదకు మధ్య విభేదాలున్నాయి. మున్సిపల్‌ వ్యవహారాలలో ఎమ్మెల్యే జోక్యాన్ని, అధికారాన్ని ఆమె అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్యే ఆమె పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరించి నట్లుగా తెలుస్తోంది. కాని వ్యక్తి మీద కోపంతో చేసిన పని వల్ల రాజ్యాంగబద్ధమైన పదవినే అవమానించినట్లయ్యింది.

పార్టీకే డామేజ్‌…

ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహారశైలి వల్ల ఇక్కడ తెలుగుదేశంకే నష్టం. బీసీ వర్గాలకు చెందిన ఛైర్‌పర్సన్‌ను అవమానించారు. వెంకటగిరి పట్టణంలో శారద వర్గీయులెక్కువ. జరిగిన సంఘటనపై వాళ్లు ఆగ్రహంతో ఉడికిపోతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here