Home రాష్ట్రీయ వార్తలు హతవిధీ!..

హతవిధీ!..

ఒకప్పటి కాంగ్రెస్‌ వైభవమే వేరు. కాంగ్రెస్‌ అంటేనే జయ జయధ్వానాలు వినపడేవి. ప్రజల్లో ఆ పార్టీకి ఎంతో ఆదరణ ఉండేది. పెద్దపెద్ద ఉద్దండనాయకులు, మహానేతలు ఎంతోమంది కాకలుతీరిన యోధులు కాంగ్రెస్‌లో ఉండేవారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అప్పట్లో తిరుగులేని శక్తి ఉండేది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు రాష్ట్రంలో పూర్తిగా చతికిలబడిపోయింది. ఎవరైనా చేయిచ్చి లేపుదామన్నా లేచే పరిస్థితి కరువైంది.

కాంగ్రెస్‌ అంటేనే రాష్ట్రప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకు తోంది. ఏళ్ళతరబడి కాంగ్రెస్‌ను అభిమానించి ఆ పార్టీ ఘనవిజ యాలకు రాష్ట్రప్రజలు బాటలు వేసినా, ఆ పార్టీమాత్రం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయమే చేసింది. అప్పట్లో అడ్డగోలుగా చేసిన విభజన పాపం.. ఆంధ్రా కాంగ్రెస్‌కు తీరని శాపమైంది. విభజన నాటినుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగైపోయింది. ఇంతటి దుస్థితి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, అనేకరకాల కుంభకోణాలతో, అస్తవ్యస్త విధానాలతో దేశం భ్రష్టు పట్టిపోవడం, దీనికితోడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ అత్యంత కఠినవైఖరి అవలంభించి, తనను అభిమానించే ఆంధ్రకు తీరని అన్యాయం చేయడం, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని తనకు తానే బద్దలు కొట్టి..కాంగ్రెస్‌ అంటేనే రాష్ట్రప్రజలకు విముఖత కలిగేలా చేయడం వంటివన్నీ.. కాంగ్రెస్‌ స్వయంగా… తనకు తాను చేసుకున్న పాపాలే.

గతంలో… అంటే 1999లో కానీ, ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో కానీ కాంగ్రెస్‌ అంటే రాష్ట్రప్రజలకు ఎంతో అభిమానం ఉండేది. 1999లో మినహాయించి మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. ప్రజలంతగా కాంగ్రెస్‌ను అభిమానించి గెలిపించారు. దక్షిణభారత దేశంలో ఆంధ్రాయే కాంగ్రెస్‌ విజయాలకు ముఖద్వారంగా ఉండేది. కాంగ్రెస్‌ జయపతాక ఎగుర వేసేది ఆంధ్రా నుంచే అనేంతగా ఈ రాష్ట్రం కాంగ్రెస్‌ను ఆదరించింది. అయితే, 2014 ఎన్నికల్లో చిత్తం వచ్చినరీతిగా చేసిన విభజన పాపం కాంగ్రెస్‌ను వెంటా డింది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోయింది. ఇక రాష్ట్రంలోనైతే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇంతటి దయ నీయస్థితి కాంగ్రెస్‌ పుట్టాక ఎప్పుడూ జరగలేదు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న ప్పుడు కాంగ్రెస్‌ ప్రతిష్ట మరింతగా ఇనుమడించింది. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్న ప్పుడు డాక్టర్‌ వైఎస్‌ సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి పుంజుకుంది. ప్రజల్లో కాంగ్రెస్‌పట్ల అభిమానం కలిగేలా అవి శ్రాంత కృషిచేసి, అటు పిసిసి అధ్యక్షునిగా, ఇటు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌పార్టీలో సగర్వంగా పనిచేసి.. కాంగ్రెస్‌ జయపతా కను రాష్ట్రంలోనే కాక.. దేశ వ్యాప్తంగా రెపరెపలాడించారాయన. అందుకే అప్పట్లో ఎన్నికల్లో ఎవరికైనా కాంగ్రెస్‌ టిక్కెట్‌ వచ్చిం దంటే చాలు.. భాగ్యలక్ష్మి బంపర్‌డ్రాలో విజయం సాధించినంత సంతోషపడే వారు. సీటొస్తే చాలు గెలిచేసినట్లే.. అనేంత భరోసా అప్పటి కాంగ్రెస్‌లో ఉండేది. కాంగ్రెస్‌లో చేరడమన్నా, ఆ పార్టీలో సీటు దొరకడమన్నా, చిన్న నాయకునిగా చోటు దొరకడమన్నా అదో పెద్ద అదృష్టంగా భావించేవారు. అందులోనూ ఎంతో ప్రయత్నిస్తే తప్ప ఎన్నికల్లో పోటీకి టిక్కెట్‌ దొరికేది కాదు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ దొరకడ మంటే పెద్దపెద్ద నాయకులకు కూడా గగనంగా ఉండేది. అయితే, ఇదంతా గతం. ఇప్పుడా రోజులు పోయాయి. కాం గ్రెస్‌ అంటేనే.. నాయకులు భయపడి వెనక్కుపోయే పరిస్థితి వచ్చింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్రాలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారంటే అతిశయోక్తి కాదు. నాటి యోధులు అనేక మంది ఇప్పటికే కాంగ్రెెస్‌ను వీడిపోయి… ముందుజాగ్రత్తగా ఇతర పార్టీలతో సర్దు కున్నారు. అందువల్ల అభ్యర్థులు కావలెను.. అంటూ కాంగ్రెస్‌ వెతుకుతోంది.. ఎవరు దొరుకుతారా అని!.. నేరుగా ఇంటికి వచ్చి టిక్కెట్‌ ఇస్తామన్నా తీసుకునే నాధులు కని పించడం లేదు. దీంతో ‘ధరఖాస్తు పెట్టు కోండి బాబూ.. టిక్కెట్లిస్తాం’.. అనే దీన హీన దయనీయ దౌర్భాగ్య స్థితికి ఆంధ్రా కాంగ్రెస్‌ దిగజారిపోయింది. హతవిధీ!… ఇదీ ఆంధ్రా కాంగ్రెస్‌ దుస్థితి!….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here