Home గల్పిక స్పృహ తప్పిన పనబాక లక్ష్మి

స్పృహ తప్పిన పనబాక లక్ష్మి

హాల్‌లో సోనియాగాంధీ, ఏపి కాంగ్రెస్‌ నాయకులు రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి, పల్లంరాజు, శైలజానాథ్‌ తదితరులు కూర్చునివున్నారు. అందరూ దీర్ఘాలోచనలో వున్నారు. చెప్పండి పనబాకజీ… ఏపిలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలంటే ఏం చేయాలని సోనియాగాంధీ అడిగింది. అప్పుడే అక్కడకు ట్రేలో కాఫీలు తెచ్చిన సోనియా భజన సంఘం అధ్యక్షుడు వి.హెచ్‌.హనుమంతురావు ఆమె అడిగింది విని… ఏముందమ్మా ఏపిలోని అన్ని కాంగ్రెస్‌ కార్యాలయాలకు మళ్ళీ పెయింట్లు వేయిద్దాం… మళ్ళీ గతంలోలాగా కళకళ లాడుతుంటాయి. దీనికి ఏషియన్‌ పెయింట్స్‌ అయితే కరెక్ట్‌. మా ఇంటికి నేను అవే పెయింట్స్‌ వాడాను అని అన్నాడు. ఆయన మాటలకు సోనియాకు చిర్రెత్తుకొచ్చి… నువ్వు కాఫీ అక్కడ పెట్టేసి వాష్‌రూమ్‌లో చాలాగిన్నెలున్నాయి, ముందు అవి కడుగుపో అని చెప్పింది. పనబాక లక్ష్మి ఉండి… ఏపిలో కాంగ్రెస్‌ను తిరిగి బ్రతికించాలంటే పోయిన నాయకులందరూ తిరిగి రావాలి మేడమ్‌ అని చెప్పింది. అంతలో సైక్లింగ్‌ పూర్తి చేసుకుని రాహుల్‌గాంధీ వచ్చాడు. రాహుల్‌ రాగానే రఘువీరారెడ్డి వుండి… మేడమ్‌ రాజకీయాలలో పరిస్థితులనే కాదు అప్పుడప్పుడూ అదృష్టాన్ని కూడా నమ్ముకోవాలి. పదేళ్ళుగా దేశంలో మన పార్టీకి బ్యాడ్‌ టైం నడుస్తోంది. అధికారంలో వున్నప్పుడు స్కాంలు… అధికారం కోల్పోయాక వరుస ఓటములు… రాహుల్‌కు పెళ్ళి చేసేద్దాం మేడమ్‌… అది కూడా మా జేసీ దివాకర్‌రెడ్డి చెప్పినట్లు బ్రాహ్మణ అమ్మాయిని చూసి చేద్దాం. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ… అంటారు. వచ్చే అమ్మాయి జాతకంతోనైనా మన పార్టీ జాతకం మారుతుందేమో అని అడిగాడు. అందుకు సోనియా… చంద్రబాబు కట్టే అమరావతి రాజధాని కన్నా క్లారిటీ వుంటుందేమో గాని, వాడి పెళ్లిపై మాత్రం క్లారిటీ లేదు రఘురామ్‌జీ.. వాడి పెళ్లి చూసే అదృష్టం నాకు లేదు అని పమిటచెంగుతో కన్నీళ్ళు తుడుచుకోసాగింది. అది చూసి రాహుల్‌… డోంట్‌ వర్రీ మమ్మీ… పెళ్లి చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్సో నీకు తెలియదు. పెళ్లి చేసుకుంటే నేను ఇలా దేశదేశాలు తిరగగలనా… పార్టీ ఎన్నికల ప్రచారాలలో పాల్గొనగలనా? నిద్రలేచింది మొదలు అన్నీ పెళ్ళాం చెప్పినట్లు చెయ్యాలి. పాలప్యాకెట్‌ తేవాలి, కిరాణా కొట్టుకెళ్లి సామాన్లు తేవాలి, ఇంట్లో బూజు దులపాలి, గిన్నెలు కడగాలి, బట్టలుతకాలి… పెళ్లాం అలసిపోతే కాళ్ళు పట్టాలి… పెళ్ళి చేసుకుంటే క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోతా… ఆ నరేంద్ర మోడీని చూడండి, పెళ్లాం లేకపోబట్టే కదా ఇండియాలో కంటే విదేశాలలో ఎక్కువ ఉండగలుగుతున్నాడు అని చెప్పాడు. అదంతా విని రఘువీరారెడ్డి కూడా… అబ్బాయి చెప్పిన దాంట్లో కూడా లాజిక్‌ వుంది మేడమ్‌ అని అన్నాడు. ఏంటి పొద్దున్నే మీటింగ్‌ అని రాహుల్‌ అడిగాడు. అదే బాబూ… ఏపిలో పార్టీని మళ్ళీ బ్రతికించడం కోసం ఏం చేయాలనేదానిపై మాట్లాడుతున్నాం. పోయిన వాళ్ళందరినీ తిరిగి రప్పించాలనుకుంటున్నాం అని పనబాక లక్ష్మి చెప్పింది. ఈ పని కోసం ఏపి ఇన్‌ఛార్జ్‌గా ఊమెన్‌ చాందిని పంపిస్తున్నాను అని రాహుల్‌ చెప్పాడు. అది విని శైలజానాథ్‌… ఊమెన్‌ చాందిని అంటే మహిళా నాయకురాలన్నమాట అని తన సందేహం వెలిబుచ్చాడు. సోనియాకు మండి… ఊమెన్‌ చాందిని అంటే లేడీ కాదు… జెంట్‌. కేరళ మాజీసీఎం అని చెప్పింది. రాహుల్‌ వుండి… ఏపిలో కాంగ్రెస్‌ పునరుత్తేజానికి ఏం చేయాలో నేను చూసుకుంటాను, రేప్పొద్దున పేపర్‌ చూడండని చెప్పాడు. రాహుల్‌ ఆ ధీమా ఇస్తే మాకు చాలంటూ అందరూ అక్కడనుండి లేచారు.

————

తెల్లారింది. అనంతపురం జిల్లా మడకసిరలోని తన ఇంట్లో వున్న రఘువీరారెడ్డి అప్పుడే నిద్రలేచాడు. వెంటనే ఆయనకు ‘రేప్పొద్దున పేపర్‌ చూడండి’ అన్న రాహుల్‌ మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే అప్పుడే వచ్చిన ‘ఆనాడు’ పేపర్‌ మడత విప్పాడు. మొదటిపేజీలో ఏమీ లేదు. పేజీ తిప్పాడు. రైట్‌సైడ్‌ మూడోపేజీలో ఫుల్‌ పేజీ ప్రకటన…

”మీ ఇంటికి తిరిగి రాగలరు” అనే పెద్ద హెడ్డింగ్‌ వుంది. దానిక్రింద కొన్ని ఫోటోలున్నాయి. రఘువీరారెడ్డి ఆ ఫోటోలు చూడకుండా ఆతృతగా క్రింద మేటర్‌లోకి వచ్చాడు.

ప్రియమైన కాంగ్రెస్‌ నాయకులారా, ఇందిరమ్మ ముద్దుబిడ్డలారా,

మీరు ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలియక సోనియాగాంధీ గారు వెక్కివెక్కి ఏడుస్తున్నారు, ఆమె గత నెలరోజులుగా నిద్రాహారాలు మాని సీఎం రమేష్‌ తరహా డైట్‌ ఫాలో అవుతూ మీ కోసం ఎదురుచూస్తున్నారు. మీ కోసం ఎదురుచూస్తూ ఆమె కళ్ళు కాయలు కాస్తున్నాయి. కాంగ్రెస్‌ మీ తల్లి… టెన్‌జనపథ్‌ మీ ఇల్లు. గతంలో ఏవన్నా పొరపాట్లు జరిగివుంటే అవేమీ మనసులో పెట్టుకోవద్దు. మీరు రాకుంటే మీరెంతో ఆరాధించి అభిమానించే సోనియాగాంధీ గారు మంచం పట్టే అవకాశాలున్నాయి. ఏపిలో కాంగ్రెస్‌ను బ్రతికించుకోవాలని ఆ మహాతల్లి కలలు కంటున్నది. ఆ కలలను సాకారం చేసే శక్తిసామర్ధ్యాలు మీకే వున్నాయి. కాంగ్రెస్‌ను బ్రతికించే సంజీవని మొక్కలు మీరే… కాంగ్రెస్‌కు అమృతం పోసి ఆయుష్షు నింపే ప్రాణదాతలు కూడా మీరే… మీ రాకతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుంది. ఈ ప్రకటన చూడగానే మీరెక్కడున్నా తిరిగి రాగలరని, మీ కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించుకోగలరని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ…

ఇట్లు…

మీ… రాహుల్‌గాంధీ

ప్రకటన అసాంతం చదివాక రఘువీరారెడ్డి మనసులో… ప్రకటన అదిరిపోయింది.. ఇంత హృదయవిదారకంగా చదివాక కరుడుగట్టిన కసాయి అయినా తిరిగొచ్చి కాంగ్రెస్‌లే చేరాల్సిందే. ఇంతకీ ఎవరెవరి ఫోటోలు వేసారో చూద్దామంటూ ఫోటోల వైపు చూసాడు. అంతే ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ ఫోటోలు వరుసగా నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, అంజయ్య, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి… మరి కొందరు దివంగతుల ఫోటోలున్నాయి. పది నిముషాల తర్వాతగాని రఘువీరారెడ్డి కోలుకోలేకపోయాడు. ఈలోకంలోకి వచ్చాక ఆయన… వెంటనే పనబాక లక్ష్మికి ఫోన్‌ చేసాడు. ఫోన్‌ను ఆమెకు బదులు ఆమె భర్త పనబాక కృష్ణయ్య ఎత్తాడు. లక్ష్మమ్మ లేదా అని రఘువీరారెడ్డి అడిగాడు. అందుకు కృష్ణయ్య… వుంది సార్‌, ఇప్పుడే 108ను పిలిపించి ఆసుపత్రికి తీసుకెళుతున్నామని ఏడుస్తూ చెప్పాడు. ఏమైందంటూ రఘువీరారెడ్డి టెన్షన్‌తో అడిగాడు. ఏమైందో ఏమో, ఆనాడు పేపర్‌ తీసుకుని ఏదో చదివింది.. వెంటనే స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు. అదేం కాదులే, నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుందని చెప్పి రఘువీరారెడ్డి ఈసారి నేరుగా రాహుల్‌కే ఫోన్‌ చేసాడు. రాహుల్‌ ఫోన్‌ ఎత్తగానే… ఏంది బాబూ… దివంగతులైన వాళ్ళందరి ఫోటోలు వేసి ప్రకటన ఇచ్చారు అని అడిగాడు. అందుకు రాహుల్‌గాంధీ సీరియస్‌గా… తెలిసీ తెలియకుండా మాట్లాడకండి, నిన్న మీరేగా పోయినోళ్ళందరూ తిరిగొస్తే ఏపిలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని చెప్పారు. నేను ఆ ప్రయత్నమే చేసా అని చెప్పాడు. రఘువీరారెడ్డి మనసులో… ఓర్నాయనో…. పోయినోళ్ళంటే పైకి పోయినోళ్ళు కాదు… పార్టీని వదిలి పోయినోళ్ళు… నిన్ను పప్పు అని వూరకే అనడంలేదు… నిన్ను నమ్ముకుని ఏపిలో కాంగ్రెస్‌ను బ్రతికిద్దామనుకోవడం కంటే చంద్రబాబు హయాంలోనే పోలవరం పూర్తవుతుందని నమ్ముకోవడం బెస్ట్‌ అనుకుంటూ రఘువీరారెడ్డి ఫోన్‌ పెట్టేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here