Home రాష్ట్రీయ వార్తలు సౌమ్యుడిని చంపిన కిరాతకులెవరు?

సౌమ్యుడిని చంపిన కిరాతకులెవరు?

ఓ పక్క రాష్ట్రంలో ఎన్నికల యుద్ధ వాతావరణం… జగన్‌కు గెలుపో ఓటమో.. తేల్చుకోవాల్సిన సమయం. అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు… అధికారపార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలను పన్నే పనిలో క్షణం తీరిక లేని జీవితం… ఈ సమయంలోనే వై.యస్‌.కుటుంబంలో ఒక్క కుదుపు… పెద్దకుదుపు… వూహించని విషాదం.

దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్‌ చిన్నాన్న, మాజీమంత్రి వై.యస్‌.వివేకానందరెడ్డి దారుణహత్య. వై.యస్‌. కుటుంబసభ్యులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి అభిమానులను నివ్వెరపరిచే విషాదవార్త.

వైయస్సార్‌ జిల్లా పులివెందులలోని తన ఇంట్లో వై.యస్‌. వివేకానందరెడ్డి హత్యకు గురికావడం జరిగింది. ఈ నెల 15వ తేదీ ఉదయం ఆయన హత్య వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన బాత్‌రూమ్‌లో పడిపోయి వుండడాన్ని చూసి మొదట గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా భావించారు. రక్తపు మడుగులో వున్నా గుండెపోటుకు గురైనప్పుడు బాత్‌రూంలో ట్యాప్‌ పై తల పడి వుంటుందని, రక్తం కారి వుంటుందని అనుకున్నారు. అయితే మృతదేహంపై తర్వాత బలమైన గాయాలు కనిపించడంతో హత్యగా అనుమానించి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడం పోస్ట్‌మార్టమ్‌లో ఆయనది హత్యేనని తేలడంతో ఈ హత్య ఒక మిస్టరీగా మారిపోయింది.

చంద్రబాబు పాలనలో వై.యస్‌. కుటుంబంలో జరిగిన రెండో హత్య ఇది. గతంలో చంద్రబాబు సీఎంగా వున్నప్పుడే వై.యస్‌. రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. వై.యస్‌. సీఎం అయ్యాక తన తండ్రి హంతకులపై ప్రతీకారానికి పోకుండా న్యాయ స్థానాలనే నమ్మాడు. ఇక దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ దుర్ఘటన వెనుక ఎవరి హస్తం వుందన్నది ఇంకా తేలలేదు.

ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే వై.యస్‌.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఆయన హత్యపై దర్యాప్తును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్‌ బృందం వివేకా హత్యను ఆర్ధిక వివాదాల కోణంలో చూస్తూ కొందరిని విచారిస్తోంది. జగన్‌ మాత్రం చంద్రబాబు హయాంలో ఈ హత్య వెనుక నిజాలు బయటకు రావంటూ, దీనిపై థర్డ్‌ పార్టీ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.

చంద్రబాబు మాత్రం దీనిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తు న్నాడు. ఈ హత్యను వై.యస్‌. కుటుం బానికి అంటగట్టాలని ప్రయత్నిస్తు న్నాడు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకే వెగటు కలిగించింది. సీఎం అన్న హోదా మరచి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెకిలిగా వ్యవహరించారాయన. ఇప్పుడు వై.యస్‌.వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ ఆయన అంతే చౌక బారుగా వ్యవహరించాడు. ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక ఎస్‌.ఐ లెవల్లో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడిన తీరు కూడా వెగటు కలిగించేలా వుంది.

వై.యస్‌.వివేకానందరెడ్డి సౌమ్యుడు, వివాదరహితుడు. ఫ్యాక్షనిస్టు కాదు. ఎవరికీ ఆయనను చంపాల్సిన అవసరం లేదు. రాజకీయ అండదండలు, బలమైన సహకారం లేనిదే ఆయనను హత్య చేసేంత ధైర్యం చేయలేరు. వివేకా నందరెడ్డి హత్యపై రాజకీయ ప్రమేయం పనిచేయని సంస్థలతో దర్యాప్తు చేయిస్తే కాని నిజాలు బయటకు రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here