Home సంపాదకీయం సోషలిజానికి చిరునామా

సోషలిజానికి చిరునామా

రాజకీయాలు రకరకాలు. ఎన్ని రకాల రంగులున్నాయో.. రాజకీయాలు కూడా అన్ని రకాలు. ఎప్పుడు ఏ రంగు పులుముకుంటుందో.. ఏ రకంగా మారుతుందో చెప్పలేని రంగమేదైనా ఉందంటే అది రాజకీయరంగమే. ఊసరవెల్లి రాజకీయాలు… గోడమీద పిల్లి రాజకీయాలు.. అవకాశవాద రాజకీయాలు.. రాజీ రాజకీయాలు.. ధన రాజకీయాలు.. ప్రత్యక్ష-పరోక్ష రాజకీయాలు.. ఇలా రకరకాలుంటాయి. వీటన్నిటికీ పూర్తిగా భిన్నమైనవి సాహసోసేత రాజకీయాలు. అవి అందరికీ వంటబట్టేవి కాదు. నిర్భీతి.. నిర్మొహమాట తత్వంతో ఉన్నవారే ఇందులో ప్రాధాన్యతను సంతరించుకోగలరు. అందులో ఆరితేరిన యోధులెవరైనా ఉన్నారా అంటే.. ముందుగా మనకు గుర్తొచ్చేది ఫైర్‌బ్రాండ్‌ జార్జ్‌ ఫెర్నాండజ్‌ పేరే.

రాజకీయరంగంలో మడమ తిప్పని సోషలిస్టు దిగ్గజంగా ఆయన ప్రసిద్ధులు. నిర్భీతి, ముక్కుసూటి తనంగా వ్యవహరించడం ఆయన సహజ లక్షణాలు. రాజకీయ రంగంలో సాహసోపేత రాజకీయాలకు ఆయనే ఓ చిరునామాగా పేరుపొందారు. రామ్‌మనోహర్‌లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడై, చిన్న వయసులోనే కార్మికోద్యమంలో అడుగుపెట్టి తిరుగు లేని కార్మికనాయకునిగా ఖ్యాతి చెందారాయన. అందులోనూ ఎల్లవేళలా కార్మికపక్షాన ఉంటూ కార్మిక సమస్యల పరిష్కారానికి గొంతెత్తిన యోధు డుగా… శ్రామిక నాయకుడుగా ఆయన దేశవ్యాప్తంగా కార్మికుల అభిమానాన్ని చూరగొన్నారు. ఎప్పుడూ తన సిద్ధాంతమే తనది అన్నట్లుగా ఖచ్చితమైన విధానా లను పాటించేవారు. 1967లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అప్పటి సంయుక్త సోషలిస్టుపార్టీ అభ్యర్థిగా దక్షిణ బొంబాయి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన ఎస్‌కె పాటిల్‌ను సైతం ఓడించిన ధీరోదాత్త రాజకీయవేత్త.. జార్జి ఫెర్నాండెజ్‌. ఆ తర్వాత బీహార్‌లోని ముజఫర్‌పూర్‌, నలంద నుంచి పలుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయరంగంలో ఉద్దండునిగా.. ధీరోదాత్త నాయ కునిగా పేరొందినా.. ఆయన ఏనాడూ వినమ్రతను వీడలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నేతగా.. అత్యంత నిరాడంబరుడుగా.. అంతకు మించి అత్యంత నిజాయితీపరుడుగా ఆయన ప్రజలందరి ప్రేమాభిమానాలను పొందగలిగారు. పరిస్థితులు ఎంతగా వత్తిడి చేసినా ఆయన ఏనాడూ ప్రజాపక్షం నుంచి, తన రాజకీయ సిద్ధాంతాల నుంచి పక్కదారి పట్టలేదు. 1974లో ఫెర్నాండెజ్‌ నాయకత్వంలో జరిగిన రైల్వే సమ్మెతో దేశం మొత్తం స్తంభించిపోయింది. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనితరసాధ్యమైన రీతిలో ఆయన నిర్వహించిన సమ్మె ఆయనకు దేశవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కాలంలో ఆయన రైల్వే మంత్రి కావడం యాదృచ్ఛికమే అయినా, రైల్వే సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ మరువరానిది. అందులోనూ తొలినుంచీ ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేకి. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు అనేకమంది నాయకులు బెంబేలెత్తిపోతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడాయన. అప్పట్లో విపక్షాలన్నీ కలసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తే అందులో కీలకపాత్ర ఫైర్‌బ్రాండ్‌ ఫెర్నాండెజ్‌దే. అందుకే అప్పట్లోనే ఆయన పేరు వింటేనే జనం జై కొట్టేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఫెర్నాండెజ్‌ ఎంతకైనా తెగిస్తారనే పేరు వచ్చిందాయనకు. ఆ తర్వాత బరోడా డైనమైట్‌ కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అదే సందర్భంలో 1977లో జరిగిన ఎన్నికల్లో ఆయన ముజఫర్‌నగర్‌ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. ఫలితాలు వచ్చేనాటికి ఆయన జైల్లోనే ఉన్నారు కూడా. ఆ తర్వాత ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో ఫెర్నాండెజ్‌ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1998-99లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఆయన మరింత కీలకమైన పదవిలో పనిచేశారు. అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణమంత్రిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అదేవిధంగా కార్గిల్‌ యుద్ధ సమయంలో దేశాన్ని విజయ పథం వైపు నడిపించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ప్రత్యేకించి దేశరక్షణకు నిరంతరం శ్రమించే సైనికులంటే ఆయనకెంతో ఇష్టం. రక్షణమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సుమారు 30 సార్లు సైనిక ప్రాంత మైన సియాచిన్‌ సందర్శించి వారితో ఎంతో అభిమా నంగా ముచ్చటించేవారు. నిబద్ధత-నిర్భీతి రాజ కీయాలకు పెట్టిందిపేరుగా నిలిచారాయన. తన ఎదుగుదల కోసం కాక..ప్రజల అభ్యున్నతి కోసం ఆయన రాజకీయాలు చేశారు. తన జీవితంలో అనేక ప్రజా సమస్యలను, ముఖ్యంగా కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించారు. తాను జన్మిం చింది కర్నాటకలో అయినప్పటికీ, ఆయన రాజకీయ భూమిక.. బీహారే. బీహార్‌ అన్నా.. బీహార్‌ ప్రజలన్నా ఆయనకు ప్రాణం. అదేవిధంగా బీహార్‌ ప్రజలు కూడా ఆయన్ను ఎంతగానో అభిమానించేవారు. బీహార్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు పలుసార్లు ఎన్నికైన ఫెర్నాండెజ్‌, చివరిగా 2009-10లోనూ బీహార్‌ నుంచే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కార్మిక సమస్యల పరిష్కారానికే ఆయన ఎక్కువగా మొగ్గు చూపారు. చట్టసభల్లోనూ సందర్భం వచ్చినప్పుడల్లా కార్మిక గళాన్ని వినిపించిన శ్రామికనేత జార్జి ఫెర్నాండెజ్‌. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఫెర్నాండెజ్‌.. గతనెల 29వ తేదీ ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. సాహసోసేత రాజకీయాలకు..అంతకన్నా తీరని లోటు. జీవితాంతం సోషలిస్టు భావాలనే నమ్మి ఆచరించిన మహానేత ఆయన. ముఖ్యంగా కార్మికవర్గాల హృదయాల్లో ఆయన స్థానం ఏనాటికీ చెక్కుచెదరనిది. దేశానికి ఆయన చేసిన సేవలు సదా చిరస్మరణీయమైనవి. ఆయన మృతితో దేశం ఒక ధీరదిగ్గజాన్ని కోల్పోయింది. అయినా, ఆయనలా నిర్భీతి రాజకీయాలు చేసే నాయకులు ఈకాలంలో ఇంకెవరున్నారు?…ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here