Home జిల్లా వార్తలు సైకిల్‌ దిగిన మాగుంట

సైకిల్‌ దిగిన మాగుంట

శాసనమండలి సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కొద్ది రోజులుగా తన రాజకీయ భవిష్యత్‌ నిర్ణయంపై జరుగుతున్న చర్చలకు తెరదించారు. 16వ తేదీన జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరి ఒంగోలు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. దీంతో మాగుంట తెలుగుదేశంలో ప్రయాణం ఐదేళ్లకే ముగిసినట్లయ్యింది.

నెల్లూరులో మూడుహాలోళ్ళుగా పేరుబడ్డ స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 1991లో హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఒంగోలు లోక్‌సభ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయ సాధించారు. ఎంపి అంటే ఏమేం చేయొచ్చో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోవచ్చో చూపించారు. విద్యాదాతగా, మంచినీటి ప్రదాతగా ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో సుబ్బరామరెడ్డి దేవుడయ్యాడు. అలాంటి నాయకుడిని 1995 డిసెంబర్‌ 1వ తేదీన నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారు. ఆయన రాజకీయ వారసత్వంతో ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఒంగోలు లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల ద్వారా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు తెరమీదకు వచ్చారు. 1998 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన ఆయన, 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వాజ్‌పేయి సానుభూతి మూలంగా ఓడిపోయారు. మళ్ళీ 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చుబడిపోవడంతో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంలో చేరి, ఒంగోలు లోక్‌సభకు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆయనను తర్వాత ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించారు.

అయితే తెలుగుదేశంలో వున్నాడనేగాని ఆయన అనుచరులు, అభిమానులు ఆ పార్టీలో ఇమడలేకపోయారు. వారి మనసంతా కూడా వైసిపివైపే లాగేది. మాగుంట కూడా వారి మనసులను అర్ధం చేసుకుని సైకిల్‌ దిగి ఫ్యాన్‌ క్రిందకు చేరాడు.

ప్రకాశం ప్రజలను మరువలేం…

ఈ నెల 14వ తేదీన ఒంగోలులోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే వైసిపిలో చేరుతున్నట్లు కూడా ప్రకటించ డంతో అక్కడే భారీసంఖ్యలో ఉన్న ఆయన అనుచరులు పెద్దఎత్తున హర్ష ధ్వానాలు చేశారు. అయితే, టిడిపికి రాజీనామా చేస్తూ కూడా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీపైగాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై గాని ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేయలేదు. అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. ఒకనాడు ఆదరించిన కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో పాటు 2014లో తనకు సీటు ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వై.యస్‌. కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన అనుచరులు, అభిమానుల మనోభీష్టం మేరకు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నట్లు, ఒంగోలు నుండే ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తమను ఎంతో కాలంగా ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోనన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here