Home జిల్లా వార్తలు సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం

సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం

దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని… వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి ముందే టీడీపీపై ఆనం సోదరులు అసంతృప్తితో వున్నారన్న వార్త గుప్పుమంది. ఇది తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో వున్న సమయంలో వివేకాను పరామర్శించడానికి వెళ్ళారు. వివేకా అంత్యక్రియలు రోజున నెల్లూరొచ్చారు. ఆనం కుటుంబసభ్యులతో దాదాపు ముప్పావుగంట చర్చించి రాజకీయంగా మీకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆనం సోదరులు పార్టీని వీడిపోయే పరిస్థితి దాకా ఎందుకు తీసుకొచ్చారంటూ జిల్లా మంత్రులిద్దరినీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని చంద్రబాబు తిట్టారు. నచ్చజెప్పి ఆనంను పార్టీలో నిలబెట్టుకున్నా మనుకునేంతలోనే కథ అడ్డం తిరిగింది. గత నెలలో నిర్వహించిన ఆత్మకూరు, నెల్లూరురూరల్‌ నియోజకవర్గాల మహానాడుల్లో పాల్గొన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీద విమర్శలు ఎక్కుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన పాల్గొన్న చివరి కార్యక్రమా లవే! ఆ తర్వాత నెల్లూరులో జరిగిన జిల్లా మహానాడుకు గాని, విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మహానాడుకు గాని ఆయన హాజరు కాలేదు. దాంతోనే ఆయన ఇక తెలుగుదేశంలో వుండడనే విషయం అర్ధమైంది.

బొత్సనే వారధి…

వాస్తవానికి ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవడానికి వైసిపి అగ్ర నాయకత్వంలో అంతగా ఆసక్తి లేదు, ఎందుకంటే గతంలో వై.యస్‌ కుటుంబంపై వారు చేసిన వ్యక్తిగత విమర్శలే కారణం. అయితే 2014లో ఇలా పట్టించుకుని కొందరిని పార్టీలోకి తీసుకోక పోబట్టే నష్టపోయామని, రాజకీయాలలో ఇవన్నీ కామన్‌ అని బొత్స వంటి నాయకులు జగన్‌కు నచ్చజెప్పి ఆనంకు వైసిపిలో లైన్‌క్లియర్‌ చేసారు. టీడీపీలో వున్నా ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరులో వైసిపికి బలమైన ప్రత్యర్థి అవుతాడు. అతనిని వైసిపిలోకి లాక్కుంటే టీడీపీకి బలమైన అభ్యర్థే వుండడు. ఈ లాజిక్‌తోనే ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రాజీనామానే తరువాయి…

తాను పార్టీ మారడంపై రెండు నెలలుగా వూహాగానాలు జరుగుతున్నా ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడా దీనిపై బహిరంగంగా మాట్లాడలేదు. కాని 13వ తేదీ తొలిసారిగా మీడియా ముందు నోరు విప్పాడు. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక పోతున్నామని చెప్పకనే తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. ఈ విషయమై ఆత్మకూరు నియోజక వర్గంలోని తన అనుచరులతో పాటు జిల్లా వ్యాప్తంగా వున్న తన అనుచరులు, మిత్రు లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసే అవకాశా లున్నాయి. మరి వైకాపాలో ఎప్పుడు చేరుతాడన్నది నిర్ణయం జరగాల్సివుంది. జూలై 8వ తేదీ వై.యస్‌. జయంతి రోజు ఒకవేళ జగన్‌ సమక్షంలో ఆయన పాదయాత్రలో ఎక్కడుంటే అక్కడకు వెళ్ళి చేరే అవకాశాలున్నాయి.

ఏ సీటు నుండి పోటీ…

ఆనం రామనారాయణరెడ్డిని వైసిపిలోకి తీసుకోవాలన్న ఆలోచనకు బీజం వేసింది ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి. వైసిపి అధికారంలోకి రావాలని, జగన్‌ సీఎం కావాలనే లక్ష్యంతో వున్నాడు. అందుకే ఆనం పార్టీలోకి వస్తే ఆత్మకూరు సీటును వదులుకోవడానికి సిద్ధమన్న సంకేతాలు ఇచ్చాడు. అయితే… పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశాలున్న సమయంలో సిటింగ్‌ సీటు వదులుకోవడం ఎందుకని కుటుంబసభ్యులు చేసిన సూచనతో తాను ఆత్మకూరు నుండే పోటీ చేస్తానని మళ్ళీ స్టేట్‌మెంటిచ్చాడు. ఇప్పుడు రామనారాయణరెడ్డికి సీటు ఎక్కడా అన్నది మేకపాటి గౌతం నిర్ణయంపై కూడా ఆధారపడి వుంటుంది. మేకపాటి కుటుంబసభ్యులకు 2014ఎన్నికల్లో లోక్‌సభ, రెండు అసెంబ్లీ సీట్లిచ్చారు. ఈసారి కూడా వారికి మూడుసీట్లే ఇస్తే రామనారాయణరెడ్డికి వెంకటగిరి నుండి పోటీ చేసే ఛాన్స్‌ వుంటుంది. గౌతం ఆత్మకూరును వదులుకుంటే ఆనం ఆత్మకూరు నుండే పోటీ చేయాల్సి రావచ్చు. ఇది కాకుండా మేకపాటి కుటుంబసభ్యులు అసెంబ్లీల వరకే పోటీచేసినా లేదా ఒకరు నరసారావు పేట లోక్‌సభకు వెళ్ళినా ఆనంకు నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కలగొచ్చు.

టీడీపీలో ఎవరి వైఫల్యం…

2015లో ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారు. ఆరోజు అవసరం లేక పోయినా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడేళ్ళు కూడా కాంగ్రెస్‌పార్టీలోనే ఉం డుంటే వారి మీద గౌరవంగా వుండేది. చంద్రబాబుతో పాటు జిల్లా మంత్రి నారాయణ కూడా వారిని టీడీపీలోకి తీసుకెళ్ళడంలో ప్రధానపాత్ర పోషించారు. ఆరోజు మంత్రిగా కాదు, ఎమ్మెల్సీగా కూడా లేనటువంటి సోమిరెడ్డికి ఈ విషయంలో ఎటువంటి పాత్ర లేదు. ఆనంకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు, నారాయణలు విఫల మయ్యారు. కాని, ఆనం మాత్రం పార్టీని వదిలే ముందు సోమిరెడ్డిని తిట్టిపోతున్నాడు. ఇదే పెద్ద కామెడీ!

మొత్తానికి ఆనం పార్టీ మార్పుపై సందేహాలు తొలగిపోయాయి. క్లారిటీ వచ్చింది. వైసిపిలో చేరే తేదీనే ఖరారు కావాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here