Home జిల్లా వార్తలు సైకిల్‌ ఎక్కనున్న రాఘవ

సైకిల్‌ ఎక్కనున్న రాఘవ

రాజకీయం అంటే గమ్యం తెలియని ప్రయాణం. ఒకసారి ఆ మార్గంలోకి వచ్చాక ఎన్ని మలుపులుంటే అన్ని మలుపుల్లో పోతుండాల్సిందే! కొందరి ప్రయాణంలో ఈ మలుపులు రాకపోవచ్చు. ఇంకొందరి ప్రయాణంలో లెక్కకుమించి మలుపులు రావచ్చు. ఇలాంటి మలుపులే జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాజకీయ జీవితంలో చోటుచేసుకుంటున్నాయి.

ఆత్మకూరు శాసనసభ నుండి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానాయ కుడు, ప్రజావైద్యుడు డాక్టర్‌ బి.సుందర రామిరెడ్డి కొడుకే రాఘవేంద్రరెడ్డి. సుందర రామిరెడ్డి రాజకీయం మొదలు పెట్టింది, ముగించింది కాంగ్రెస్‌లోనే! ఆయన రాజ కీయ జీవితంలో మలుపులు లేవు. కాని, రాఘవకు అలాంటి మార్గం ఏర్పడలేదు. 2005లో ఏఎస్‌పేట జడ్పీటీసీగా కాంగ్రెస్‌ నుండే ప్రయాణం మొదలుపెట్టాడు. 2008లో జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికల్లో ఆయన రాజకీయ జీవితంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.వి.శేషారెడ్డి పైనే విజయం సాధించాడు. ఆ తర్వాత తనను ఎమ్మెల్సీగా గెలిపించడంలో సహక రించిన తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ, ఆ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టడంతో ఆ పార్టీలో చేరాడు. 2009 ఎన్నికల తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. కాని, అంత కంటే ముందే రాఘవ కాంగ్రెస్‌కు చేరు వయ్యాడు. వై.యస్‌. మరణానంతరం జగన్‌ స్థాపించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాఘవ, 2014లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఉత్కంఠ పరిణామాల మధ్య జడ్పీ ఛైర్మెన్‌గా ఎన్నికయ్యాడు. ఓపక్క జడ్పీ ఛైర్మెన్‌గా వుంటూనే మరోపక్క వెంకటగిరి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. 2019లో వెంకటగిరి వైసిపి టిక్కెట్‌ నాదే అనుకున్న రాఘవకు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి రూపంలో మొండి చేయి ఎదురైంది. టీడీపీ నుండి వైసిపిలో చేరిన రామనారాయణరెడ్డికి వెంకటగిరి వైసిపి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించ డంతో రాఘవకు తల కొట్టేసినంతపనైంది. దీనిని పరాభవంగా భావించిన ఆయన ఇటీవలే వైసిపికి రాజీనామా చేశాడు. కేవలం 13ఏళ్ళ రాజకీయ జీవితంలో రాఘవకు ఇన్ని మలుపులొచ్చాయి.

కాగా, ఇప్పుడు మరో పెద్దమలుపు తిరిగింది ఆయన రాజకీయ జీవితం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబుతో రాఘవ దాదాపు 20నిముషాలు భేటీ అయ్యాడు. పార్టీలో రాఘవ రాజకీయ భవిష్యత్‌కు చంద్రబాబు పూర్తి హామీ ఇచ్చాడు. చంద్రబాబు కూడా రాఘవను వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వాడుకో వాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనను దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం బొల్లినేని కృష్ణయ్యను రంగంలో దించి వున్నారు. కృష్ణయ్య ఆసక్తితో రాలేదు. చంద్రబాబు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వంటి నాయకుల బలవంతం మీద వచ్చినవాడే! ఆయన రాజకీయ పునరాగమనం కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు. అయితే ఇప్పుడు రాఘవ రూపంలో ఆత్మకూరు నుండి కృష్ణయ్యకు ప్రత్యామ్నాయం వుంది. కాబట్టి టీడీపీలో అందరు కూడా రాఘవనే అభ్యర్థిగా సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో టీడీపీకి ‘రెడ్డి’ అభ్యర్థి కావాలన్నది మొదటి నుండి వినిపిస్తున్న అభిప్రాయం. ఈ ప్రకారమే ఆత్మకూరుకు భవిష్యత్‌లో రాఘవే అభ్యర్థి కానున్నాడని సమాచారం.

ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా రాఘవ దిగితే వైసిపి అభ్యర్థులలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రాఘవ పోటీకి దిగితే వైసిపి అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయావకాశాలు సన్నగిల్లు తాయి. అందుకని వెంకటగిరికి అనుకున్న ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరుకు తెచ్చి, వెంకటగిరిలో గట్టి వర్గమున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అక్కడ వైసిపి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి రాఘవ టీడీపీలో చేరిక ప్రభావం వెంకటగిరి, ఆత్మకూరు లపై బలంగానే పడబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here