Home జాతీయ వార్తలు సేవకుడే.. సైనికుడు

సేవకుడే.. సైనికుడు

మహిమలూరు… నెల్లూరుజిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూరు. గట్టిగా వెయ్యి గడపలున్న గ్రామమది. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులకు, జనాభా లెక్కలప్పుడు అధికారులకు మాత్రమే గుర్తొచ్చే ఊరు! అలాంటి ఊరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతోంది! దేశంలో అందరికీ పరిచయమైంది. చాలామంది ఉన్నత చదువులకు ఊరు వదిలి వెళ్లేటప్పుడు పుట్టిన ఊరికి పేరు తెస్తామని చెబుతుంటారు. అలా ఎంతమంది మాటను నిలబెట్టుకున్నారో తెలియదు గాని, తన గ్రామాన్ని చరిత్ర పుటల్లో నిలిపి జన్మభూమి ఋణాన్ని తీర్చుకున్నాడు డాక్టర్‌ గుండ్ర సతీష్‌రెడ్డి! అవును… ఆయన వల్ల ఈరోజు ఆయన పుట్టి పెరిగిన మహిమలూరుకే చెప్పలేనంత కీర్తి వచ్చింది.

డిఆర్‌డిఓ సైంటిస్ట్‌గా, డైరెక్టర్‌గా, కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా మనకు ఇంతవరకు పరిచయమైన గుండ్ర సతీష్‌రెడ్డి మరో మైలురాయిని దాటాడు. దేశ రక్షణకు గుండెకాయ లాంటి డిఆర్‌డిఓ(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ)కు ఛైర్మెన్‌గా ఎంపికయ్యారు. ఇది పదవి కాదు… హోదా అంతకన్నా కాదు. దేశ భద్రతకు సంబంధించిన అతిపెద్ద బాధ్యత! సతీష్‌రెడ్డి శక్తి సామర్ధ్యాలను, దేశం పట్ల ఆయనకున్న భక్తిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతను కట్టబెట్టింది! తెలుగు తేజానికి సమున్నత పీఠం దక్కింది. శాస్త్ర సాంకేతిక రంగంలో అసామాన్యమైన ప్రతిభాపాటవాలతో ముందుకు దూసుకువెళ్తున్న ప్రఖ్యాత సీనియర్‌ శాస్త్రవేత్త, మన నెల్లూరీయుడైన డా. గుండ్రా సతీష్‌రెడ్డికి దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) అధిపతిగా అత్యున్నత స్థానం లభించింది. డిఆర్‌డిఓ వంటి బృహత్తరమైన సంస్థకు అధిపతిగా ఆయన నియ మితులు కావడం మన జిల్లాకు, రాష్ట్రానికే కాదు..తెలుగుజాతికీ…మొత్తంగా మన దేశానికే గర్వకారణం. డిఆర్‌డిఓ ఛైర్మెన్‌ పదవిని అధిష్టించిన తెలుగువారిలో సతీష్‌రెడ్డి రెండవ వారు. గతంలో డాక్టర్‌ సూరి భగవంతం ఈ బాధ్యతలు నిర్వర్తించివున్నారు. చిన్న వయసులోనే డిఆర్‌డిఓ వంటి బృహత్తర రక్షణసంస్థకు అధిపతిగా నెల్లూరు ముద్దుబిడ్డ సతీష్‌రెడ్డి నియమితుడు కావడం కూడా ఒక రికార్డే.

సామాన్య రైతు కుటుంబం నుంచి శాస్త్రసాంకేతిక రంగానికి…

సతీష్‌రెడ్డి స్వస్థలం నెల్లూరుజిల్లా ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన మహిమలూరులో ప్రాధమిక విద్యాభ్యాసం అనంతరం నెల్లూరులో ఇంటర్‌ చదివారు. ఆ తర్వాత అనంతపురం జెఎన్‌టియు నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. హైదరాబాద్‌ జెఎన్‌టియు నుంచి ఎంఎస్‌, పిహెచ్‌డి పట్టాలు అందుకున్నారు.

అంచలంచలుగా ఎదుగుతూ…

సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన సతీష్‌రెడ్డి శాస్త్రసాంకేతిక రంగంలో ప్రతిభతో రాణిస్తూ 1985లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో శాస్త్రవేత్తగా చేరారు. భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆయన్ను ఏరికోరి నేవిగేషన్‌ విభాగంలో నియమించారంటే సతీష్‌రెడ్డి ప్రతిభాపాటవాలు ఎంత ఉన్నతమైనవో ఊహించుకోవచ్చు. అబ్దుల్‌కలాం మానసపుత్రికైన హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమరత్‌లో చేరారు. కలాం మార్గదర్శకత్వంలో సతీష్‌రెడ్డి సమీకృత నిర్దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. యువశాస్త్రవేత్తగా, అంచలం చలుగా ఎదిగారు. 2014లో కేంద్రం సతీష్‌రెడ్డిని విశిష్ట శాస్త్రవేత్తగా పరిగణించి పదోన్నతి కల్పించింది. 2015లో రక్షణశాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా కూడా నియ మించింది. శాస్త్ర సాంకేతికపరంగా జాతీయ విధానాలు రూపొందించడంలోను, క్షిపణుల సమర్ధత కోసం రూపొందించిన రోడ్‌మ్యాప్‌లోనూ సతీష్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌ లాబొరేటరీస్‌కి(క్షిపణులు) డైరెక్టర్‌ జనరల్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.

కీలక వ్యవస్థలకు శ్రీకారం…

అగ్ని-1,2,3,4,5, పృథ్వి, ధనుష్‌, అస్త్ర, ఆకాశ్‌, బ్రహ్మోస్‌, నిర్భయ్‌, హెలీనా, నాగ్‌, ఎంఆర్‌ శామ్‌ వంటి క్షిపణుల్లోని కీలకవ్యవస్థలను సతీష్‌రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేశారు. వ్యూహాత్మక ఆయుధాలు, ఏవియానిక్స్‌ టెక్నాలజీ రూపకల్పనలో విశేష అనుభవం గడించిన సతీష్‌రెడ్డి 2013లో మే1న ఆర్‌సిఐకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2014 సెప్టెంబర్‌లో విశిష్ట శాస్త్రవేత్తగా పదోన్నతి పొంది రక్షణ రంగంలో ఎన్నెన్నో ప్రయోగాల్లో తిరుగులేని విజయాలు సాధించారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విభాగం అధిపతి హోదాలో అనేకానేక అధునాతన ఆయుధాల రూపకల్పనకు, కీలకవ్యవస్థలకు శ్రీకారం చుట్టారు. స్వదేశీ ఆర్‌ఎఫ్‌, ఐఐఆర్‌ సీకర్ల అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హోదాలో దేశంలో తొలి వెయ్యి కిలోల గైడెడ్‌ బాంబ్‌ అభివృద్ధి చేసి, దీర్ఘశ్రేణి స్మార్ట్‌ గైడెడ్‌ ఆయుధాల అభివృద్ధికి పునాదులు వేశారు. స్వదేశీ ఇనర్షియల్‌ సెన్సర్లు,

ఉపగ్రహ ఆధారిత దిక్సూచి(శాట్‌నావ్‌) రిసీవర్లు, అధునాతన ఇనర్షియల్‌ నావిగేషన్‌ వ్యవస్థలు, నౌకా మార్గనిర్ధేశ సాధనాల అభివృద్ధి ద్వారా అనేక ఆయుధాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషించారు. ఏపీలోని కృష్ణాజిల్లా నాగాయలంక సముద్రతీరంలో క్షిపణి ప్రయోగకేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు.

ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు…

శాస్త్ర సాంకేతికరంగంలో సతీష్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి పురస్కారాలెన్నో లభించాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేవిగేషన్‌, రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీల నుంచి ఫెలోషిప్‌ ఆయన సాధించారు. అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ అసోసియేట్‌ ఫెలోషిప్‌తో పాటు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ నుంచి హోమి జె బాబా మెమోరియల్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. రష్యాకి చెందిన ఫారిన్‌ మెంబర్‌ ఆఫ్‌ ది అకాడమీ ఆఫ్‌ నేవిగేషన్‌ అండ్‌ మోషన్‌ కంట్రోల్‌ సంస్థల్లో సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయునిగా రికార్డు సృష్టించారు. ఇంకా అనేక వర్శిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు, ఘనమైన పురస్కారాలు అందజేశాయి. రక్షణరంగానికి విశిష్ట సేవలందిస్తున్న సతీష్‌రెడ్డికి రాష్ట్రప్రభుత్వం గత ఏడాది ‘హంస’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. డిఆర్‌డిఓలో స్వదేశీ పరిజ్ఞాన రూకల్పన, అభివృద్ధికి, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు, వైమానిక పరిజ్ఞానం పెంపొందించేందుకు సతీష్‌రెడ్డి చేస్తున్న సేవలు అనన్య సామాన్యం. నేవిగేషన్‌ రంగంలో ఆయన రూపొందించిన అనేక పరికరాలను క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు కూడా. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయాలనే సంకల్పంతో ఆయన తన లక్ష్యసాధనవైపు అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో దిగ్విజయంగా రాణిస్తూ.. రక్షణ రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా.. అగ్రగామిగా నిలిచేందుకు అహరహం శ్రమిస్తూ… దేశానికే గర్వకారణంగా నిలుస్తూ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యద్భుతమైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తున్న డిఆర్‌డిఓ అధిపతి.. మన నెల్లూరీయుడైన సతీష్‌రెడ్డికి..’లాయర్‌’ శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here