Home రాష్ట్రీయ వార్తలు సీతయ్య… ఇక లేడు

సీతయ్య… ఇక లేడు

ఎన్టీఆర్‌ సృష్టించిన రాజకీయ ప్రభంజనంలో చైతన్య రథసారధిగా నిలిచిన హరికృష్ణ, ఎన్టీఆర్‌ భద్రతే లక్ష్యంగా వేలాది కిలోమీటర్లు తిరుగుతూ, తానే స్టీరింగ్‌ పట్టుకుని చైతన్య రథాన్ని నడుపుతూ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో తిరిగారు. తండ్రి ఎన్టీఆర్‌ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకునేవారు. తన తండ్రి అధిరోహించిన చైతన్యరథానికి ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యద్భుతంగా నడిపారు. ఎన్టీఆర్‌ అధికారంలో ఉన్నా, లేక విపక్షంలోనే ఉన్నా హరికృష్ణే ఆయనకు సారధిగా ఉండేవారు. అయినా..విధి దయలేనిది. చివరికి కారు నడుపుతూనే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ విషాదాన్ని తట్టుకోలేక ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు..రాజకీయ నేతలు..సినీరంగ ప్రముఖులు..పెద్దసంఖ్యలో అభిమానులు పెద్దగా విలపించారు. ఎన్టీఆర్‌ తనయుడు..హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్‌ కుటుంబం శోకసాగరమే అయింది.

ఆగస్టు 29.. ఇదో విషాద దినం. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల్లోనే కాక, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను.. అశేష ప్రజానీ కాన్ని కలచివేసిన దినం. బుధవారం (ఆగస్టు 29) ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ తనయుడు, మాజీ ఎంపి, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ(61) మృతిచెందారు. ఆయన మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నెల్లూరుజిల్లా కావలిలో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు మరో ఇద్దరు మిత్రులతో కలసి బుధవారం వేకువన 4.30గంటలకు హైదరాబాద్‌ నుంచి తన ఎపీ 28 డబ్ల్యు 2323 నంబరు కారులో హరికృష్ణ తనే కారును డ్రైవ్‌ చేస్తూ బయలుదేరారు. అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిలో అన్నెపర్తి వద్ద నీళ్ళబాటిల్‌ తీసుకునేందుకు వెనక్కి తిరిగినప్పుడు, ముందున్న మలుపును గుర్తించి తప్పించే సమయంలో అకస్మాత్తుగా బ్రేక్‌ వేయ డంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన హరికృష్ణని కామినేని ఆసుపత్రికి తరలించిన కొద్దినిమిషాల్లోనే మృతిచెందారు.

శోకసంద్రంలో కుటుంబసభ్యులు :

ఈ ప్రమాద విషయం తెలిసినవెంటనే ఆయన కుమారులు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఆసుపత్రి వద్దకు హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే మృతిచెందిన తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరుమని విలపిం చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లు బయలుదేరి కామినేని ఆసుపత్రికి వచ్చారు. హరికృష్ణ సోదరి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సోదరుడు బాలకృష్ణ తదితరులంతా వచ్చి హరికృష్ణ భౌతిక కాయాన్ని చూసి పెద్దపెట్టున విలపించారు.

రాజకీయాల్లో కీలకపాత్ర :

ఎన్టీఆర్‌ హయాంలోనూ, ఆ తర్వాత కూడా రాజకీయరంగంలో హరికృష్ణది ప్రత్యేకస్థానం. తెలుగు యువత నాయ కునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా హరికృష్ణ సేవలు అమూల్యం. 2013లో రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

నిజ జీవితంలోనూ సీతయ్యే :

హరికృష్ణది చిన్నతనం నుంచి విలక్షణ మైన వ్యక్తిత్వం. పైకి కఠినంగా అన్పించినా మనసంతా వెన్నే. నిజజీవితంలో కూడా సీతయ్యే. మొండితనం, ముక్కుసూటి మనస్తత్వం.. ఆయన తత్వం. నిజాయితీ పరుడు, మానవతావాది కూడా! ఎలాంటి భేషజం లేకుండా.. తాను నమ్మిన బాట లోనే నడిచేవారు. జీవితంలో ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన సాహసి ఆయన. ప్రజలన్నా, అభిమానులన్నా ఎంతో ఇష్టం. హరికృష్ణ సినీరంగ ప్రస్థానం ఎంతో విశేషమైనది. చిన్నవయసులోనే ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో బాలకృష్ణునిగా నటించిన హరి కృష్ణ, ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిం చారు. ఎవరి మాట వినడు సీతయ్య.. అంటూ సీతయ్య చిత్రంతో మరింతగా ప్రజాదరణ పొందారాయన. ఎన్టీఆర్‌ తన యునిగా… సినీ నటునిగా, రాజకీయ నాయ కునిగా హరికృష్ణ జీవితప్రస్థానం ఎంతో విశిష్టమైనది. సీతయ్య లాంటి మంచి మనసున్నవారు మహా అరుదు. ఆయన మరణం..తెలుగుజాతికి తీరని లోటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here