Home సినిమా వార్తలు సినీ గీతానికి వన్నెలు దిద్దిన.. సినారె

సినీ గీతానికి వన్నెలు దిద్దిన.. సినారె

సినారె (డాక్టర్‌ సి.నారాయణరెడ్డి) అనగానే ముందుగా మనకు ‘విశ్వంభర’ గుర్తుకువస్తుంది. భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మక మైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న వచన గేయకావ్యమది. వైజ్ఞానికంగా, కళాత్మకంగా, ఆధ్యాత్మికంగా సాగిన మానవుని ప్రగతిని వ్యంగ్య సుందరంగా మలిచారు సినారె. అదేవిధంగా, సినారె అనగానే ‘రామప్ప’ సంగీతరూపకం గుర్తుకొస్తుంది. ‘ఈ నల్లని రాలలో’ అనే పాట ఇందులోదే. తదుపరి కాలంలో ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలోకి వచ్చింది. ‘కర్పూరవసంతరాయలు’ కావ్యము, లకుమ త్యాగమూ గుర్తుకొస్తాయి. ఇంకా..జలపాతం, విశ్వనాధనాయకుడు, నాగార్జునసాగరము, భూమిక, మంటలూ-మానవుడు, మధ్యతరగతి మందహాసం, రుతుచక్రం, మట్టిమనిషీ-ఆకాశం వంటి అనేకానేక కావ్యాలు గుర్తుకొస్తాయి. పద్యాలతో మొదలైన ఆయన సాహితీప్రస్థానం గేయంతో సాగి, వచనగేయ మార్గం పట్టింది. ఆయనకు ‘గేయ భగీరధుడు’ అనే పేరు తెచ్చిపెట్టింది. సాహిత్య విద్యార్థులకు వారి ‘ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు- ప్రయోగములు’ చాలా ఉపయుక్త గ్రంథం. ఎన్నో పరిశోధనలకు అది దిక్సూచి. కవిగా, వక్తగా, అధ్యాపకుడిగా ఆయన సుప్రసిద్ధులైనా, సామాన్య ప్రజలకు మాత్రం సినారెగా, సినిమా నారాయణరెడ్డిగా ఆయన ప్రసిద్ధులు, ‘నన్ను దోచుకుందువటె’ అంటూ సినీరంగ సింహద్వారంలోకి అడుగుపెట్టి, దాదాపు అయిదు దశాబ్దాలపాటు సినీగీతాన్ని మురిపించి.. మెరిపించి, కవ్వించి.. లాలించి నవరసాలతో సినీగీతాభిమానులకు వీనులవిందైన.. పసందైన విందునందించారాయన.

మధురగీతాల సినారె :

‘తోటలో నా రాజు తొంగిచూచెను నాడు’ అంటూ ప్రణయగీతాలు రచించినా, ‘ఏ పారిజాతమ్ములీయ గలనో సఖీ’ అంటూ ప్రకృతిలో ప్రణయినిని దర్శింపజేసినా, ‘మదనా సుందర నా దొరా’ అంటూ శృంగా రాత్మకంగా జావళీలు రాసినా, ‘మాయదారి సిన్నోడు..నా మనసే లాగేసిండు’..అంటూ జానపదంతో చిందులు వేయించినా, ‘నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవొద్దు’..అంటూ దేశభక్తిని ప్రబోధించినా, ‘సాయి శరణం బాబా శరణు శరణు’ అంటూ భక్తిగీతాలు రచించినా, ‘వటపత్రశాయికి వరహాల లాలీ’.. అంటూ లాలిపాటలు, ‘స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం’ అంటూ స్నేహపు గొప్పదనాన్ని కీర్తించినా, ‘పుత్తడిబొమ్మ మా పెళ్ళిపడుచు’ అంటూ పెళ్ళిపాటలు, ‘ఈ వేళలో ఈ పూలలో ఎన్నెన్ని రాగాలో’..అంటూ పూలపాటలు రాసినా..ప్రతి గీతంలోనూ సినారె ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అదే వారి రచనా శైలి..కవితా శైలి. వస్తువు ఏదైనా, కవితా ధాతువు లేని పాటే లేదంటే అతిశయోక్తి కాదు. పదప్రయోగాల్లో, సుదీర్ఘ సమాస చాలనాల్లో, ఆలంకారిక ప్రయోగాల్లో, వర్ణనలలో కనపడే వారి కవితాశైలి రసజ్ఞవేద్యం. ఆయన కలానికి రెండు వైపులా పదునే. ”సంగీత సాహిత్య సమలంకృతే..స్వరరాగ పదయోగ సమభూషితే’.. అంటూ గీర్వాణభాషలో వేదాంత రహస్యాలు వివరిస్తూ శారదా స్తుతిని చేయగలరు. మరోవైపు ‘కైపున్న మచ్చెకంటి చూపు..అది చూపు కాదు పచ్చల పిడిబాకు’..అంటూ అచ్చతెలుగు పల్లెపదాల్లోనూ పాటలల్లగలరు. అంతేకాదు, గజల్‌ ప్రక్రియను తెలుగు సినీగీతాల్లో ప్రవేశపెట్టిన ఘనత..డా. సి. నారాయణరెడ్డిగారిదే. ”పగలే వెన్నెల, జగమే ఊయల’ అనే పాటలోని ప్రతి చరణం చివరా కురిసిపోదా, విరిసిపోదా, మెరిసిపోదా అనే పదాలుండడమే గజల్‌ టెక్నిక్‌. అలాగే యుగళగీతాల్లో ప్రశ్న జవాబు పద్ధతినీ వారే పరిచయం చేశారు. వారి గీతరచనలో తొలి సినిమా అయిన ‘గులేబకావళి కథ’లో, ‘కలల అలలపై తేలెను’ అనే పాటలో..

జలకమాడ జవరాలిని చిలిపిగ చూసేవెందుకు?

తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు

చూపుతోనే హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు?

విరిసీ విరియని పరువము మరులుగొలుపుతున్నందుకు.. అంటూ జానపద గీతాల గమనరీతులను కొల్లగొట్టి తన సినీగీతానికి పూలబాటలు వేసుకున్నారు. ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో, ‘గోగులు పూచె గోవులు కాచె.. ఓ లచ్చగుమ్మడి’ అనే జానపద గేయాన్ని సినీగీతంగా, కవిత్వాంశ గల ప్రణయగీతంగా మలచడంలోనే ఆయన నవ్యతాప్రియత్వం కనపడుతుంది. సినారె పాటల్లో ఆలంకారిక ప్రయోగాలెక్కువ. ముఖ్యంగా

ఉపమాలంకార ప్రయోగంలో కొత్తపుంతలు చూపిస్తారాయన.

1. ‘దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు?.. (మురళీకృష్ణ-కనులు కనులు కలిసెను..అనే పాట). 2. ‘నవ్వులా..అవి కావు..నవపారిజాతాలు, రవ్వంత సడిలేని రసరమ్యగీతాలు’…(ఏకవీర-తోటలో నా రాజు’ అనే పాట). 3. ఎవరన్నారివి కన్నులని..అరరె మధువొలికే గిన్నెలవి…(‘దొరికితే దొంగలు’ చిత్రంలోని పాట ఇది).. ఇలా ప్రతి పాట క్రమాలంకారంతో, ఒకే భావంతో, శిల్పరమణీయంగా కుదురుకుంటుంది. ‘డబ్బుకు లోకం దాసోహం’ చిత్రంలోని ‘మెరిసే మేఘమాలిక..ఉరుములు చాలు చాలిక’ అనే పాటలోనూ క్రమాలంకారాన్ని గమనించవచ్చు.

రవ్వంత సడిలేని రసరమ్యగీతాలు :

తెలుగు భాషను సినారె మరింతగా తీర్చిదిద్దారు. విశ్వవిద్యాలయ అధ్యాపకత్వం దీనికి ఎంతగానో

ఉపకరించింది. ‘అనురాగ గీతిలోన అచ్చతెనుగు అందం’ అంటారొక పాటలో. సినారె సినీగీతాల్లో కనబడే అసంఖ్యాకమైన పదబంధాల్లో కొన్ని చూడండి.

”వన్నెకాడు, జవరాలు, పసిడికిరణాలు, కొదమతేటులు, కోరమీసం, మిసిమి వెన్నెల, రాచవన్నె, మదనుని తూపులు, పచ్చికపానుపు, జిలుగుపైట, కొసచూపు, రామచక్కని, సోగకనులు, చికిలిచూపు, సన్నజాజి మనసు..ఇత్యాది ఎన్నో అందమైన పదాలు కనబడుతాయి.

పాటకు కవితా సింగారాలు కైజేసి, సినీగీతాన్ని కూడా కావ్యపంక్తిలో నిలబెట్టారు సినారె. వారివి ‘రవ్వంత సడిలేని రసరమ్యగీతాలు’. వారి చంధశ్శిల్పం ‘సురుచిర సుందర తల్పం’. ఆయన గీతాలు అలంకార సమలంకృతాలు. అనౌచిత్యానికి ఆమడదూరాలు. సినారె కలంలోంచి జాలువారిన అలనాటి మధురగీతాలను గుర్తుచెయ్యడం ద్వారా రసజ్ఞపఠితల్లో ఆనందానుభూతి కలుగుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. తీయని జ్ఞాపకాలను మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళిన డా. సి.నారాయణరెడ్డిగారికిదే అక్షర నివాళి!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here