Home జిల్లా వార్తలు సిడ్నీ నగరానికి శ్రీసిటీ- ఆల్స్టామ్ మెట్రో రైళ్లు 

సిడ్నీ నగరానికి శ్రీసిటీ- ఆల్స్టామ్ మెట్రో రైళ్లు 

ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నగరానికి చెందిన మెట్రో ప్రాజెక్టు కోసం శ్రీసిటీలోని ఆల్స్టామ్ పరిశ్రమలో తయారైన చివరి సెట్ మెట్రో రైళ్లను గురువారం  సిడ్నీకి తరలించారు. దీనిని పురస్కరించుకుని ఆల్స్టామ్ పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆల్స్టామ్ సంస్థ ఆసియా-పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లింగ్ పాంగ్, ఇండియా మరియు దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్పోర్ లాంఛనంగా జెండా ఊపి రైళ్లను సాగనంపారు. ఈ సందర్భంగా లింగ్ పాంగ్ మాట్లాడుతూ, నేడు రెండు ముఖ్యమైన మైలురాళ్లను ఆల్స్టామ్ అధిగమించిందన్నారు. ఒకే రోజు సిడ్నీ మరియు చెన్నై మెట్రోలకు చివరి సెట్ రైళ్లు సరఫరా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇండియా నుంచి పూర్తిస్థాయిలో ఎక్సపోర్ట్ చేయబడిన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రాజెక్టుగా ఆమె సిడ్నీ ప్రాజెక్ట్ ను పేర్కొన్నారు. ఇక చెన్నై మెట్రో ప్రాజెక్ట్ కూడా ఆల్స్టామ్ కు  ఎంతో ప్రత్యేకమైనదిగా ఆమె అభివర్ణించారు. శ్రీసిటీలోని ఆల్స్టామ్ పరిశ్రమకు సంబంధించి చెన్నై మెట్రో మొట్టమొదటి ప్రాజెక్టు అన్నారు. అధునాతన టెక్నాలజీతో తయారై ఎంతో ప్రాధాన్యత కలిగిన సిడ్నీ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తిచేసినందుకు  తాము గర్విస్తున్నట్లు తెలిపారు. 2014 లో శ్రీసిటీ-ఆల్స్టామ్ లో ఉత్పత్తులు ప్రారంభించి ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టులు చేపట్టగ, ఇందులో మూడు ఇండియాకు సంబందించినది కాగా, ఒకటి అంతర్జాతీయ ప్రాజెక్టు అన్నారు. సిడ్నీతో పాటు చెన్నై, లక్నో ప్రాజెక్టులు పూర్తికాగా, కొచ్చి ప్రాజెక్ట్ మరో నెలలో పూర్తికానుందని వివరించారు.
అలైన్ స్పోర్  మాట్లాడుతూ,  2019లో మరో అంతర్జాతీయ ప్రాజెక్టు కెనడాకు చెందిన మాంట్రియల్ మెట్రోతో పాటు ముంబై మెట్రో లైన్ 3 ప్రాజెక్టు పనులను ఆల్స్టామ్ చేపట్టనుందని తెలిపారు. డిమాండును బట్టి శ్రీసిటీ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో ఆల్స్టామ్ టీంకు అభినందనలు తెలిపారు. సిడ్నీ మెట్రో రైళ్ల సరఫరాతో ఆల్స్టామ్ మరో మైలురాయి అధిగమించిందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా “మేడ్ ఇన్ శ్రీసిటీ” రైళ్లు సిడ్నీకి వెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, సిడ్నీ మెట్రో రైళ్లు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ రైళ్లు. అంతర్జాతీయంగా నిరూపితమైన  మెట్రోపాలిస్ రైలు ప్లాటుఫారం ఆధారంగా ఇవి తయారు కాబడ్డాయి. ఇందులో ఎన్నో అధునాతన వసతులున్నాయి. ఈ తరహా మెట్రోపాలిస్ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, బార్సిలోనా, అమ్స్టర్ డామ్ తదితర 25 కు పైబడి దేశాలలో మాత్రమే అందుబాటులో వున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here