Home జిల్లా వార్తలు సిట్టింగ్‌ సీటుపై ఫైటింగ్‌

సిట్టింగ్‌ సీటుపై ఫైటింగ్‌

నెల్లూరుజిల్లాలో జంపింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ను తీసి పక్కనపెడితే వైసిపికి ఆరు మంది ఎమ్మెల్యే లున్నారు. వీరిలో 5మందికి మళ్ళీ సీట్ల విషయంలో పోటీ లేదు. నెల్లూరు సిటీలో అనిల్‌కుగాని, రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌కు గాని, సూళ్ళూరుపేటలో సంజీవయ్యకు గాని, సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి గాని సీట్ల విషయంలో పోటీ లేదు. ఆ సీట్లు మాకు కావాలని ఎవరూ అడగడం లేదు. మొన్నటిదాకా ఆత్మకూరు విషయంలో సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంకు ఆనం రామనారాయణరెడ్డితో పోటీ వుండింది గాని, ఆయనను వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా పంపిం చడంతో ఈయనకు ఇప్పుడు లైన్‌ క్లియర్‌గా వుంది.

ప్రస్తుతానికి సిటింగ్‌ ఎమ్మెల్యేగా వుండి సీటు కోసం గట్టిగా పోరాడుతున్నదల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డే! కావలి సీటు కోసం ఈసారి మాజీ ఎమ్మెల్యేలైన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణు గోపాలరెడ్డిలు చాలా పట్టుబడుతున్నారు. ఈసారి ప్రతాప్‌కు సీటు రాకుండా వీరిద్దరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ జగన్‌ పర్సనల్‌గా చెబితే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వెనక్కు తగ్గుతాడేమోగాని ఈసారి మాత్రం విష్ణు వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోనే ఆయన డైరెక్ట్‌గా జగన్‌నే కలిసాడు. సీటు నాకు కావాల్సిందేనన్నాడు. డబ్బు విషయంలో కూడా నా తంటాలు నేను పడతానని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పొచ్చాడు. ఇప్పుడు కూడా అదే స్టాండ్‌ మీదున్నాడు. తనను కాదని ప్రతాప్‌కు సీటిస్తే ఆయనకు వ్యతిరేకంగా పని చేయడానికి సైతం మానసికంగా సిద్ధపడ్డట్లు తెలుస్తోంది.

ప్రతాప్‌ను, విష్ణును కలిపి పని చేయిస్తేనే కావలి నియోజకవర్గంలో వైసిపి గట్టిగా నిలబడుతుంది. ప్రతాప్‌కు సీటిస్తే కావలి టౌన్‌, దగదర్తి, బోగోలు మండలాలలో పని చేసుకోగలిగినా అల్లూరు మండలం వచ్చేసరికి విష్ణు సహకారం లేకుండా ముందుకు పోలేడు. కావలి టిడిపి అభ్యర్థిగా భావిస్తున్న బీద మస్తాన్‌రావు సొంత మండలమిది. అలాగే నెల్లూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థిగా ప్రచారంలో వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి సొంత మండలం కూడా ఇదే! వారిద్దరూ కలిస్తే టిడిపి సహజంగానే బలంగా వుంటుంది. ఈ మండలంలో కనీసం విష్ణు సపోర్ట్‌ చేస్తేనే వైసిపి గట్టిగా నిలబడుతుంది. ప్రతాప్‌కు సీటిస్తే, విష్ణు అడ్డం తిరిగే అవకాశముంది. ఈ ముగ్గురు నాయకులు కలిస్తే అల్లూరు మండలంలో వైసిపికి ఎదురుదెబ్బ తగులుతుంది. దీనిని కవర్‌ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి కావలి అభ్యర్థి ఎంపిక వైసిపి అధిష్టానానికి క్లిష్టమైన సమస్యే! ఎవరినీ నొప్పించకుండా అభ్యర్థిని ఒప్పించడంలోనే ఇక్కడ వైసిపి భవిష్యత్‌ ఆధారపడి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here