Home జిల్లా వార్తలు సాహస పోరాటమే!

సాహస పోరాటమే!

నెల్లూరు అసెంబ్లీ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నారాయణ పోటీ చేస్తున్నా డంట… 1999 ఎలక్షన్‌ నుండి ఈ మాట వింటున్నాం. 99 పోయింది, 2004 పోయింది, 2009 పోయింది, 2014 కూడా పోయింది. 2019 రాబోతోంది. అంటే ఆయన పోటీ చేస్తాడంట అన్న ప్రచారం మాత్రం 20ఎళ్ళుగా జరుగుతూనే వుంది. ఆయన పోటీచేసిందీ లేదు… పెట్టిందీ లేదు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఓ దశలో ఆయన ఉపముఖ్యమంత్రి అవుతాడనుకున్నారు. సమీకరణల మూలంగా మంత్రి పదవితో సరిపెట్టుకున్నాడు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంటే ఆయనకు ఎమ్మెల్సీ కావాలంటే ఎమ్మెల్సీ వస్తుంది… మంత్రి కావాలనుకుంటే మంత్రి అవుతాడు. అసలు స్టేట్‌ వద్దనుకుంటే రాజ్యసభకు పంపుతారు. చంద్రబాబు వద్ద నారాయణకు అంత పరపతి వుంది. ఇన్ని అవకాశాలు పెట్టుకుని ఏరోజూ ప్రత్యక్ష రాజకీయాలతో గాని, ప్రజలతోగాని సంబంధాలు లేని నారాయణ ఒక్కసారిగా శాసన సభ సమరంలోకి దిగుతాడా? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న? వాస్తవానికి అయితే అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి శాసనసభకు పోవాల్సిన అవసరం ఆయనకు లేదు. కాకపోతే ఇప్పుడు నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కోరిక మేరకో, లేదంటే చంద్రబాబు ఆదేశాల మేరకో ఆయన నెల్లూరు నగర అసెంబ్లీ నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నగరం నుండి ఆయన పోటీకి దిగడం అంటే ఒక రకంగా సాహసమే!

ఇప్పటివరకు నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా జాతీయ స్థాయిలోనే ఆయనకు ఒక ఇమేజ్‌ వుంది. నారాయణను బయట జిల్లాల్లో సైతం ఎంతో గొప్పగా వూహించుకుంటారు. అలాంటి నారాయణ నెల్లూరు అసెంబ్లీకి పోటీ చేస్తే సులభంగా గెలుస్తాడని ఎవరైనా అనుకుం టారు. ఇప్పుడు నెల్లూరులో చూస్తే అంత సులభతరమైన పరిస్థితి లేదు. వైసిపి సిటింగ్‌ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ ఎంతో స్ట్రాంగ్‌గా వున్నాడు. అతనిపై వ్యతిరేకత లేదు. గత తొమ్మిదిన్నరేళ్ళుగా నెల్లూరు నగర ప్రజల మధ్యే గిరికీలు కొడుతున్నాడు. దీనికితోడు ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వుంది. జగన్‌ పట్ల ఆదరణ పెరుగుతోంది. నారాయణకు కులం, ఆర్ధికం… ఈ రెండే అదనపు బలం. మిగతా అంశాలన్నీ బలహీ నతలే! 1994లో అంతటి మాగుంటోళ్ళే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల గెలవలేకపోయారు. అప్పుడు మాగుంట ప్రతినిధిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పి.వి.ప్రసన్నరెడ్డి టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి చేతిలో ఓడిపోవడం చూసాం. నెల్లూరులో మాగుంట వాళ్ళంటే ఎంతో పేరు. అప్పట్లో వాళ్ళ సాయం పొందనిది ఎవరు? కళ్యాణి ఫిలింస్‌లో ఎప్పుడూ జనాలుండేవాళ్ళు. ఎవరు వచ్చి ఆర్ధిక ఇబ్బందులు చెప్పుకున్నా ఎంతోకొంత సాయం చేసి పంపిస్తుండే వాళ్ళు. అంతలా దానధర్మాలు చేసిన వాళ్ళే ప్రభుత్వ వ్యతిరేకత గాలిలో ఓడిపోయారు. 2019లో తెలుగుదేశం వ్యతిరేక ప్రభావం వుండనే వుంటుంది. మరి దాని ముందు నారాయణ కుల, కరెన్సీ బలం తట్టుకుంటుందా? అన్నీ తుట్టుకుని గెలిస్తే నారాయణను పెద్ద తోపే అంటారు. ఓడితే మాత్రం ఓస్‌… నారాయణ సీన్‌ ఇంతేనా అని కూడా అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here