Home రాష్ట్రీయ వార్తలు సర్వేలతో.. సర్వనాశనమే!

సర్వేలతో.. సర్వనాశనమే!

2014 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముంచిన అంశాలేంటి?… చంద్రబాబు ఋణమాఫీ, పవన్‌కళ్యాణ్‌, నరేంద్రమోడీ ఇమేజ్‌, బాబు గారి అనుభవం, విభజన పరిస్థితులు, జగన్‌పై అవినీతి కేసులు, కాంగ్రెస్‌ కేడర్‌ టీడీపీలో చేరిపోవడం, జగన్‌ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా బ్రాహ్మణులు, వైశ్యులు పూర్తిగా టీడీపీ వైపు చేరడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు నిర్వహిం చడం.! కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసిపి ఓటమికి బోలెడు కారణాలున్నాయి. అంతేనా… మరో ముఖ్యకారణం కూడా ఉంది. అదే సర్వే ఫలితాలు. 2014లో ఈ సర్వేలే జగన్‌ కొంప ముంచాయి.

2014లో ఏ సర్వేలు చూసినా ఏపిలో వైసిపిదే విజయం అంటూ నొక్కి వక్కాణించాయి. జగన్‌ సొంత మీడియా సైతం అసంబద్ధ అవాస్తవ సర్వేలతో జగన్‌ను గాలిలో తేలిపోయేలా చేసింది. ఎలక్షన్‌ ముందు జరిగిన సర్వేలన్నీ కూడా వైసిపికి 100 నుండి 125 సీట్ల దాకా కట్టబెట్టాయి. తీరా ఎన్నికలయ్యాక చూస్తే ఏమయ్యింది. అధికారంలోకి వస్తామనుకున్న కలలు ఆవిరై ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సర్వేలను నమ్ముకునే అప్పుడు అతివిశ్వాసానికి పోయారు. కాంగ్రెస్‌ నుండి వస్తామన్న సీనియర్‌ నాయకులను వద్దన్నారు. అభ్యర్థుల ఎంపికలో ద్వితీయశ్రేణి నాయకులకు ప్రాధాన్యతనిచ్చారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణను వదిలేసారు. కేవలం సర్వేలను నమ్ముకుని జగన్‌ గాలిలో గెలిచిపోతా మనుకున్నారు. కాని, చంద్రబాబు చిన్నయ సూరి కథల్లో చెప్పిన ‘కుందేలు – తాబేలు’ కథను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నికలకు పోయాడు. సర్వేలను నమ్ముకుని వైసిపి నాయకత్వం అతి విశ్వాసానికి పోతే, చంద్రబాబు మాత్రం ఏ గాలిని నమ్ముకోకుండా తన అనుభవాన్ని నమ్ముకున్నాడు. ఏఏ రూట్లలో వెళితే ఓట్లు రాలుతాయో ఆ రూట్లలో వెళ్లాడు. బలవంతంగా బీజేపీతో పొత్తు పెట్టించుకున్నాడు. ఇంటికి పోయి పవన్‌కళ్యాణ్‌ను పిలుచుకున్నాడు. అలివికాదని తెలిసినా ఋణమాఫీ అంటూ రైతులను బురిడీ కొట్టించాడు. సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నా గట్టి కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి తెచ్చుకుని సీట్లి చ్చాడు. ఈ కాలానికి తగ్గట్లు ఎలక్షన్‌ ఏ విధంగా చేయాలో చంద్రబాబు అలాగే చేసాడు. అధికారాన్ని చేపట్టాడు.

2019 ఎన్నికలు సమీపిస్తున్న నేప థ్యంలో పలు మీడియా సంస్థలు తిరిగి సర్వేలతో హోరెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపిలో వైసిపిదే అధికారం అంటూ తేల్చే స్తున్నాయి. చంద్రబాబు కంటే జగన్‌కే ప్రజాదరణ శాతం ఎక్కువుగా వుందని పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో రిపబ్లిక్‌ టీవీ అయితే ఏపిలో 25 లోక్‌సభ స్థానాలకు గాను 21స్థానాలను వైసిపియే గెలుచుకోబోతుందంటూ తన సర్వేను వెల్లడించింది. 21లోక్‌సభ స్థానాలు అంటే సరాసరిన 140 అసెంబ్లీ స్థానాలతో సమానమన్న మాట!

2014లో జగన్‌కు ఇదే స్థాయిలో ప్రజాదరణ ఉండింది. అభ్యర్థులను ప్రకటించకముందు పరిస్థితి అంతా పార్టీ నాయకత్వం, ప్రభుత్వ వ్యతిరేకత అన్న అంశాల మీదనే ఆధారపడి వుంటుంది. అంటే జయాపజయాలలో వీటి పాత్ర 50శాతమే! మిగిలిన 50శాతం సమర్ధు లైన అభ్యర్థుల ఎంపిక, ప్రజల ఆలోచన, అవసరాలను బట్టి ఇచ్చే హామీలు, కుల మతాల పోకడలు, స్థానిక పరిస్థితులు, ఎన్నికల పొత్తులు వంటి అంశాలపై ఆధారపడి వుంటుంది. 2014 ఎన్నికల్లో జగన్‌ ఈ అంశాలన్నింటిలో విఫలమ య్యాడు. కాబట్టే గెలుపుకు దూరమయ్యాడు.

ఎన్నికల యుద్ధానికి సంబంధించి వైసిపి అధినేతగా జగన్‌ కసరత్తు సగం మాత్రమే పూర్తయ్యింది. పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుంది. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం పోయింది. అదే సమయంలో నాయకుడిగా జగన్‌పై విశ్వసనీయత పెరి గింది. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలకు మరింత చేరువ కాగలి గాడు. రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత వున్న నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందాడు. ఎన్నికల యుద్ధం చేయడానికి ఆయన సగం బాధ్యతలు నెరవేర్చాడు. ఇక సర్వేలు పరిధి దాటి ఎలక్షన్‌ చేయాలంటే మిగతా అంశాలలోనూ పరిణితి చూపాలి. ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలి. బూత్‌ స్థాయిలో కేడర్‌ పటిష్టతపై శ్రద్ధ చూపాలి. పార్టీలోకి అనుభ వజ్ఞులను ఆహ్వానించాలి. రాష్ట్రవ్యాప్త ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే కలిసి వచ్చే పార్టీలతో సైతం పొత్తుకు సిద్ధ పడాలి. మనం ఇంకా గెలుపుకు దూరంగా వున్నాం, గెలవాలంటే ఇంకా వేగం పెం చాలి అనే ఆలోచనతో పని చేస్తేనే వైసిపి అధికారానికి చేరువవుతుంది. అలాకా కుండా క్రితంసారిలాగే సర్వేలను నమ్ము కుని గాల్లో దీపం పెడితే సర్వనాశనమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here