Home జిల్లా వార్తలు సర్వేపల్లి… ఎవరిదో మళ్ళీ!

సర్వేపల్లి… ఎవరిదో మళ్ళీ!

జిల్లాలో మెట్ట, మాగాణి కలగలిసిన నియోజకవర్గం ఏదన్నా వుందంటే అది సర్వేపల్లి. సర్వేపల్లి అన్నది ఒక మండల కేంద్రం కూడా కాదు, కేవలం ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మీద ఏర్పడ్డ నియోజకవర్గం అలానే వుంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కూడా దీని పేరు మార్చలేదు.

2009కు ముందు ఇందుకూరుపేట, ముత్తుకూరు, టిపిగూడూరు, వెంకటాచలం మండలాలలో కొంతభాగం, నెల్లూరు రూరల్‌ మండలంలో కొంత భాగంతో సర్వేపల్లి నియోజకవర్గముండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఇందుకూరుపేట మండలం కోవూరులోకి పోగా, ముత్తుకూరు, టిపి గూడూరు వంటి డెల్టా మండలాలతో పాటు వెంకటాచలం పూర్తిగా, మనుబోలు, పొదలకూరు వంటి మెట్ట మండలాలలు కొత్తగా ఈ నియోజకవర్గంలో చేరాయి.

2019 ఎన్నికలు… పాత ప్రత్యర్థులే మళ్ళీ తలపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసిపి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి. సోమిరెడ్డి రాజకీయ మనుగడకు ఈ ఎన్నికలు విషమ పరీక్ష కానున్నాయి. సర్వేపల్లి నుండి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా ఆరోసారి. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడిపోయి ఓటమి హ్యాట్రిక్‌ కొట్టాడు. ఇప్పుడు కూడా ఓడిపోతే అదొక రికార్డ్‌ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే తపనతోనే ఐదేళ్ళుగా ఆయన నియోజకవర్గంలో తిరుగుతూనే వున్నాడు. 2014లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మంత్రిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను సాధించాడు. నిధులను బాగానే తెచ్చాడు. నియోజకవర్గంలో కాళ్ళకు బలపాలు కట్టుకున్నట్లు తిరిగాడు.

మరోపక్క వైసిపి అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. సోమిరెడ్డికి ఎక్కడా తగ్గలేదు. ఆయనపై బురదచల్లడంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ బురదను కడుక్కోవడానికే సోమిరెడ్డి నానా తంటాలు పడాల్సివచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో సోమిరెడ్డి అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా? లేక ప్రభుత్వ వ్యతిరేకత మళ్ళీ సోమిరెడ్డిని ముంచుతుందా? తెలియని పరిస్థితి. నియోజకవర్గంలో సమీకరణలు మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత అంశంతో పాటు, ఆనం, ఆదాల వంటి వాళ్ళు వైసిపిలో చేరడంతో వారి వర్గీయులు చాలామంది వైసిపిలో చేరారు. ఈ ఎన్నికల వరకు ఆనం వర్గాన్ని కాకాణి బాగానే వాడుకున్నాడు. సోమిరెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో చేసిన పనులు ఫలితాన్నిస్తాయో లేక మారిన సమీకరణాలతో సోమిరెడ్డి వరుసగా ఈ నియోజకవర్గం నుండి నాలుగోసారి, కోవూరుతో కలిపితే ఐదోసారి ఓటమి మూటగట్టుకుంటాడో చూడాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here