Home సంపాదకీయం సరైన నిర్ణయం

సరైన నిర్ణయం

మనమొకటి తలిస్తే.. ఒక్కోసారి వేరొకటి జరిగి తీరుతుంటుందన్నది పెద్దల మాట. అయితే, జరగకూడని ఘోరం జరిగాకే… మనమెంత పొరపాటు చేశామో అర్ధమవుతుంది. అయితే, అప్పటికే పరిస్థితులు చేయిదాటిపోయివుంటాయి. ఇప్పుడు కశ్మీర్‌లో బిజెపి పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ పిడిపితో కలసి పాలనసాగించి.. అనేక విభేదాలను సహిస్తూ వచ్చినా…చివరికి మిగిలిందేమిటి?.. తెగదెంపులే!… ఎట్లయితేనేమి.. మూడేళ్ళ కలహాల కాపురం తర్వాత ఎట్టకేలకు పిడిపితో బిజెపి తెగదెంపులు చేసుకుంది. దీంతో పిడిపి-బిజెపి సంకీర్ణకూటమి పాలనకు తెరపడి సంచలనం కలిగించింది. దీంతో, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడంతో, కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు రంగం సిద్ధమైంది. రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కశ్మీర్‌ ముఖ్యమంత్రి మొహబూబాముఫ్తీ కోరడం, కశ్మీర్‌లో హింసను అదుపుచేసేందుకు రంజాన్‌- అమర్‌నాధ్‌ యాత్రల సందర్భంగా భద్రతాబలగాల చేత కాల్పుల విరమణ పాటింపజేయాలంటూ అఖిల పక్షభేటీ విజ్ఞప్తి చేయడంతో కేంద్రం వారి విజ్ఞప్తులను మన్నించింది.

అయితే, అందువల్ల ఆశించిన ఫలితం లేక పోగా.. అదే అదనుగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయి కశ్మీర్‌లో హింసాకాండకు తెగబడడం ఎంత దారుణం?.. పాక్‌ వేర్పాటువాద శక్తులు విజృంభించి కశ్మీర్‌లో మరింత హింసకు ఆజ్యం పోయడంతో కశ్మీర్‌ మళ్ళీ నిప్పులగుండమైది. కశ్మీర్‌లోని ప్రముఖ పాత్రికేయుడు సుజాత్‌బుఖారీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడం, వీర జవాన్‌గా ఉన్న ఔరంగజేబు అనే సైనికుడిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీయడం.. ఇలా పెరిగిపోతున్న హింసాత్మకజ్వాలలతో కశ్మీర్‌ భగ్గుమంటూనే ఉంది. ఇదంతా పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుశ్చర్యలే. ఒకవైపు కశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తూనే, మరోవైపు అమర్‌నాధ్‌ యాత్రీకుల యాత్రను భగ్నం చేసేందుకు పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు విషసర్పాల్లా పొంచివున్నారనే సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, పిడిపితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా బిజెపి సిద్ధపడింది. పాలనపై పూర్తి అధికారం ఉంటే తప్ప జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు, వేర్పాటువాదులను సమర్ధంగా అణచలేమని భావిస్తూ అప్పటికప్పుడు బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయమే.. కానీ, ఆ నిర్ణయమేదో ఎప్పుడో తీసుకుని ఉండాల్సింది. అయినా, శాంతిమంత్రాలు వల్లిస్తూ కూర్చుంటే ఉగ్రవాద రాకాసులు ఊరు కుంటారా?.. వారికి కావాల్సింది మారణ కాండలు.. నెత్తుటిముద్దలు.. హింసాజ్వాలలే తప్ప శాంతివచనాలు కాదు కదా!.. అందుకు వత్తాసుగా ముఫ్తీ ప్రభుత్వం ఉండడంతో పాక్‌ ఉగ్రవాదుల దుష్కృత్యాలు జోరుగా సాగుతున్నాయి. వాటికి అంతుపొంతూ ఉండడం లేదు.

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌వనీని రెండేళ్ళ క్రితం భద్రతాదళాలు అంతమొందించిన ప్పుడు భద్రతాదళాల చర్యను బిజెపి అభినందించగా, పిడిపి అందుకు వ్యతిరేకించడం, భద్రతాదళాలపై రాళ్ళు విసిరినవారిపై కేసులు ఉపసంహరించాలని పిడిపి నిర్ణయించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా కశ్మీర్‌లో పెరుగుతున్న దుశ్చర్యలను నిరోధించాలంటే, మెహబూబాముఫ్తీ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా జరగదని, కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవడం కుదరదని బిజెపికి అర్ధమైంది. అంతేకాదు, కశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల్ని మెరుగుపరచడంలో పిడిపి విఫలమైందనేది కూడా జగమెరిగిన రహస్యమే.

అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే, జమ్ము-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. అయితే, పాక్‌ దుశ్చర్యలతో కశ్మీర్‌లో ఎంతోకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండడమే దారుణం. వాటిని ప్రభుత్వాలు నివారించలేకపోవడంతో కశ్మీర్‌లో నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నాయి. కశ్మీర్‌లో

ఉగ్రవాదం, హింస పెరిగిపోయి చివరకు ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే స్థితి ఏర్పడింది. పిడిపి- బిజెపి సంకీర్ణపాలన వల్ల ఒరిగిందేమీ లేదని, కశ్మీర్‌ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్లయిందనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ హింసాకాండల్లో కశ్మీర్‌లో గత మూడేళ్ళలో 373 మంది సైనికులు, 239 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, కశ్మీర్‌ను పిడిపి-బిజెపి కూటమి నాశనం చేశాయని, ఈ మూడేళ్ళలో కశ్మీర్‌ను ఎంత వీలైతే అంత నాశనం చేసి ఇప్పుడు బిజెపి పక్కకు తప్పుకుందని, పిడిపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిజెపి భారీ తప్పిదానికి పాల్పడిందని కాంగ్రెస్‌ నేతల విమర్శలు బిజెపికి కనువిప్పు కలిగించేవే. గత ఎన్నికల్లో 89 మంది సభ్యులున్న కశ్మీర్‌ అసెంబ్లీలో పిడిపికి 28, బిజెపికి 25 స్థానాలు లభించాయి. బిజెపికి మరో నాలుగు స్థానాలు దక్కివుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. మిగిలిన వాటిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి 15, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. 2015లో పిడిపి-బిజెపి కూటమిగా ఏర్పడి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అసలు పిడిపి విధానాలకీ.. బిజెపి సిద్ధాంతాలకీ గిట్టదు. ఇరుపార్టీల మధ్య నాలుగామడల దూరం ఉండనే ఉంది. అయితే, కశ్మీర్‌లో హింసకు ముగింపు పలకాలన్న ధ్యేయంతో పిడిపి-బిజెపి అప్పట్లో కలసి ఒక్కటైనా.. పాలనలోకి వచ్చేసరికి ఆ లక్ష్యం అటకెక్కింది. పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురైందన్నట్లుగా తయారైంది బిజెపి పరిస్థితి. అందుకే పిడిపితో తెగదెంపులు చేసుకుంది.

ఏదేమైనా, పాకిస్తాన్‌ నుంచి అడ్డదారులు తొక్కుతూవచ్చి భారత్‌ భూభాగంలోని జమ్ము కశ్మీర్‌ను హింసాత్మక చర్యలతో భగ్గు మనిపిస్తున్న ఉగ్రవాదుల పీచమణచుకుంటే తప్ప కశ్మీర్‌ లోయలో శాంతి ఉండదు. ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో అరికట్టకుంటే హింసే తప్ప ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఇకనైనా కేంద్రం వెంటనే ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించివేయాలి. తద్వారా కశ్మీర్‌లో శాంతిస్థాపనకు కృషిచేయాలి. అదేవిధంగా కశ్మీర్‌ ప్రజల భద్రతకు, అభ్యున్నతికి గట్టిచర్యలు తీసుకుని… కశ్మీర్‌ తిరిగి కళకళలాడేలా.. శాంతిబావుటా ఎగురవేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here