Home సంపాదకీయం సరిహద్దుల్లో యుద్ధమేఘాలు

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు

ఒక చెంప కొడితే రెండో చెంప చూపించిన పూజ్య బాపూజీ సిద్ధాంతాన్ని ఏడు దశాబ్దాలుగా ఆచరిస్తున్నాం. చైనా వాడు యుద్ధానికొచ్చాడు… ఒక చెంప కొట్టాడు… రెండో చెంప చూపించారు. మానస సరోవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ వాడొచ్చాడు… ఒక చెంప మీద కొట్టాడు… రెండో చెంప చూపించాం. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆక్రమించేశాడు. రెండు దేశాలతో జరిగిన రెండు యుద్ధాలలో గెలుపు మనది, నష్టమూ మనదే! అత్యంత విలువైన భూభాగాలను కోల్పోయాం. ఇదంతా కూడా ఒక చెంపన కొడితే రెండో చెంప చూపించమన్న సూత్రానికి అనుభవించిన ఫలితం.

భారత్‌ ఇంకా అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుందనే భ్రమలో పాకిస్థాన్‌, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలున్నట్లున్నాయి. ఆ భ్రమలోనే ఉగ్రదాడులకు పాల్పడుతున్నాయి. కాని, ఇప్పుడుండేది పాకిస్థాన్‌లోని ముస్లింలను, భారత్‌లోని ముస్లింలను ఒకే కోణంలో చూసే కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు, భారతదేశంలో వున్న ముస్లింలను భారతీయులుగానే, ఈ దేశాన్ని ప్రేమించే వారిగానే చూసే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఓట్ల బ్యాంకు రాజకీయాలకు భయపడని ప్రభుత్వం. అందుకే ఒక చెంప మీద కొట్టిన పాకిస్థాన్‌ను రెండు చెంపలు వాయించింది. భారత్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో గతంలో సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా చూపిం చింది. తాజాగా ఉగ్రశిబిరాలపై వైమానిక మెరుపు దాడులతో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే సమాధాన మిచ్చింది.

భారత్‌ ప్రతీకారానికి పాల్పడితే పర్యవసానం ఎలా వుంటుందో ఫిబ్రవరి 26వ తేదీ తెల్లారుజామున 3.45 నుండి 4.07 గంటల మధ్యలో జరిగిన భారత వైమానిక దాడులను చూస్తే పాకిస్థాన్‌కు అర్ధమై వుంటుంది. భారత జాతి యావత్తు రెండు వారాలుగా పగతో రగిలిపోతోంది. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతూ వుంటుంది. ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వమా హైవేపై జరిగిన

ఉగ్రదాడిలో వాహనాలలో సరిహద్దుకు వెళుతున్న 44మంది సిఆర్‌పిఎఫ్‌ జవానులు వీరమరణం పొందారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాది అదిల్‌అహ్మద్‌ చేసిన ఆత్మహుతి దాడితో ప్రపంచమే ఉలిక్కిపడింది. ఉగ్రదాడుల వేటలో నిరంతరం శ్రమపడుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ దాడి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో యూరి, పఠాన్‌కోట్‌ దాడులకు సర్జికల్‌ స్ట్రైక్‌తో ప్రతీకారం తీర్చుకున్న భారత ప్రభుత్వం ఈసారి పాకిస్థాన్‌ను అన్ని విధాలా కట్టడి చేసే పనికి శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్‌ ఆర్ధిక మూలాలను దెబ్బతీసే పని మొదలుపెట్టింది. పాక్‌కు భారత్‌ నుండి కూరగాయల ఎగుమతిని నిలిపి వేయడమే కాక, ఆ దేశం నుండి వచ్చే సరుకు రవాణాపై 200శాతం సుంకాలు పెంచింది. నెహ్రూ నిర్వాకం మూలంగా 70ఏళ్ళ నుండి పాకిస్థాన్‌ అనుభవిస్తూ వచ్చిన సింధు నదీ జలాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతోనే పాక్‌ను అష్ట దిగ్భంధనం చేసినట్లయ్యింది. ఇక పాక్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానానికి అన్ని దేశాలే కాదు, పాక్‌ మిత్రదేశమైన చైనా కూడా మద్దతు పలకడంతో ఆ దేశం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది.

పుల్వమా దాడి విషయంలో నరేంద్ర మోడీ పాక్‌పై దౌత్యయుద్ధం చేస్తున్నాడని అందరూ భావిస్తున్న తరుణంలో భారత యుద్ధ విమానాలు ఒక్కసారిగా గర్జించాయి. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లారుజామున 3.45గంటల ప్రాంతంలో 12 మిరాజ్‌ యుద్ధ విమానాలతో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహ్మద్‌

ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డారు. వెయ్యి కిలోల బాంబులు వదిలారు. దాదాపు 350మంది ఉగ్రవాదు లను హతమార్చారు. పాకిస్థాన్‌ ఊహలకు అందని దాడి ఇది! పాకిస్థాన్‌ రాడార్లకు కూడా అందకుండా మిరాజ్‌లు తమ పని పూర్తి చేసుకు వచ్చాయి. ఈ మెరుపు దాడి తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ ముఖంలో నవ్వు వచ్చింది. రెండు వారాల పాటు దిగాలుగావున్న త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారతీయులు తిరిగి సగర్వంగా తలెత్తారు.

భారత్‌ దాడితో పాకిస్థాన్‌ అతలాకుతలమవు తోంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్లమెంటులో ఆయనకు నిరసనల సెగ తగిలింది. ఉగ్రదాడి తర్వాత శాంతికి ఓ అవకాశం ఇవ్వండంటూ వేడుకున్న ఆయన భారత దాడిపై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించాడు. పాక్‌ ఆర్మీ చేతిలో ఇమ్రాన్‌ కీలుబొమ్మ. పాక్‌ ఆర్మీ ఇంతవరకు ఉగ్రవాదులను ముందుకు తోసి భారత్‌లో రక్తపాతం సృష్టిస్తోంది. ఇప్పుడు భారత వాయుసేనే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. పాక్‌ నుండి ఇక ముందు ఎటువంటి సవాళ్ళు ఎదురైనా భారత త్రివిధ దళాలు సన్నద్ధంగా వున్నాయి. పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత దాడిని ఏ దేశం వ్యతిరేకించలేదు. ఏ దేశమూ ఖండించలేదు. దీంతో పాకిస్థాన్‌ తీవ్ర నైరాశ్యంలో చిక్కుకుపోయింది.

గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నో విధ్వంసాలు సృష్టించారు. కొన్ని లక్షల మంది సైనికులు, పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని దాడులు జరిగినా శాంతి, సహనం అనే మంత్రాలను మన పాలకులు వల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆ నాయకులు పోయారు. కన్నుకు కన్ను… పన్నుకు పన్ను, ఒక తలకు పది తలలు… ఇదే నరేంద్ర

మోడీ లెక్క! ఇది పక్కా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here