Home జిల్లా వార్తలు సమున్నత ఆశయం.. మహోన్నత ధ్యేయం

సమున్నత ఆశయం.. మహోన్నత ధ్యేయం

ఇది ఓ మహా విద్యాలయం.. చారిత్రాత్మక సరస్వతీ నిలయం. వందేళ్ళ చరిత్ర కలిగిన విద్యా కుసుమం. ఇప్పుడా సంస్థను నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. పవిత్రమైన ఈ సంస్థపై కొందరు చరిత్రహీనుల కన్నుపడింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇన్నాళ్ళకు అభివృద్ధి ఫలాలను అందుకోబోతున్న తరుణంలో కొన్ని స్వార్థపూరిత శక్తులు, విషపురుగులు ఈ సంస్థను, సంస్థ సారధులను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది క్షమించరాని విషయం… చారిత్రాత్మక తప్పిదం!

1981లో కస్తూరిదేవి విద్యాలయ సంస్థలోని మూడెకరాల భూమిని ఆనాటి కమిటీసభ్యులు, వారితో పాటు మిగిలిన సభ్యుల అండతో కొందరు బడా పారిశ్రామికవేత్తలు లీజు పేరుతో కాజేసే గలీజు పనికి శ్రీకారం చుట్టినప్పుడు, ఆ సంస్థను, ఆ సంస్థ ఆస్తులను కాపాడడానికి ఆవిర్భవించిన నెల్లూరీయుల ప్రియపుత్రిక.. ‘లాయర్‌’ వారపత్రిక.

అప్పటి నుండి ఇప్పటివరకు సంస్థను, సంస్థ ఆస్తులను పరుల పాలు కానివ్వకుండా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం తపనపడుతుండిన జెవిరెడ్డిగారికి అండగా ఉంటూ, పలు పర్యాయాలు సంస్థ బాగోగుల కోసం మీరంతా ముందుకు రండి.. అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది నెల్లూరు ప్రముఖులను అభ్యర్థిస్తూ ‘లాయర్‌’ వారపత్రిక వ్యవస్థాపకులు, కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారి ఆశయసాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న పత్రిక.. ‘లాయర్‌’.

నాటి నుంచి నేటి వరకు, రేపటి నుండి సంస్థను అభివృద్ధి పథంలో పెట్టేవరకు అదే పంధాతో, అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది.. మా (మీ) లాయర్‌.

కస్తూరిదేవి విద్యాలయ సంస్థల గురించి ఎవరికీ తెలియని వాస్తవాలను, సంస్థ కోసం పాటుబడ్డ ప్రముఖుల వివరాలను ‘ఇదీ కస్తూరిదేవి కథ’ అనే శీర్షికతో ఈ వారం నుండి పాఠకుల ముంగిళ్ళలో ఆవిష్కరించబోతోంది.. మా (మీ) లాయర్‌.

కస్తూరిదేవి విద్యాలయం… ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఆ సంస్థ

పురోగతిని అడ్డుకోవడం ఏ ఒక్కరి తరమూ కాదు. ఈ సంస్థ అభివృద్ధే ధ్యేయంగా అక్షర సత్యాలతో పునరంకితమవుతూ… వాస్తవాల వీచికలను మా పాఠకులకు అందిస్తున్నాం.

ఒక సమున్నత ఆశయంతో, మహో న్నత ధ్యేయంతో ఆనాటి స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి పొణకా కనకమ్మ స్ఫూర్తితో బాలికల విద్యే ధ్యేయంగా 1923వ సంవత్సరంలో ‘శ్రీమతి కస్తూరిబా పాఠశాల’ పేరుతో శ్రీ కస్తూరి దేవి విద్యాలయం సంస్థ పురుడుపోసు కుంది. నెల్లూరులో ఉన్న అనేకమంది ప్రముఖులు, దాతల అండదండలతో.. మహనీయురాలు పొణకా కనకమ్మ ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. జాతీయ భావాలతో, ఉన్నతాదర్శాలతో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది.

1927లో తొలి కమిటి

ఈ సంస్థ నిర్వహణా బాధ్యతలు, సంస్థ అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని 1927వ సంవత్సరంలో ఈ సంస్థకు ఒక కమిటీ ఏర్పడింది. 11-3-1927న జరి గిన నిర్వాహక సభా తీర్మానంలో ఈ విద్యా లయాన్ని రిజిస్టరు చేయించాలని, కార్య నిర్వాహక సంఘానికి శ్రీయుత కెవి రాఘవాచార్యుల వారు అధ్యక్షులుగను, శ్రీమతి పొణకా కనకమ్మగారు కార్యదర్శిగా ఉండునట్లు, శ్రీయుత తిక్కవరపు వెంకట రామారెడ్డి గారు కోశాధిపతిగ ఉండునట్లు తీర్మానించారు. ఈ విద్యాలయానికి శాశ్వత నివేశనమునకుగాను తగిన ప్రయత్నములు త్వరలో చేయాలని, మరియు గాంధీ మహాత్ముడు ఈ మండలమునకు వేం చేయునప్పటికి వారిచే ఈ విద్యాలయ మునకు పునాదులు వేయించుటకై ముందు జరగవలసిన ఏర్పాట్లన్నియు చేసి సిద్ధపరచి ఉంచాలని తీర్మానించుకున్నారు. ఆ మేరకు 12-3-1927న ‘శ్రీ కస్తూరిదేవి విద్యా లయం’ సంస్థను రిజిస్టరు చేశారు.

ప్రముఖుల ప్రశంసలు…

”నెల్లూరులోని శ్రీ కస్తూరిదేవి జాతీయ బాలికా పాఠశాలలో గరపునట్టి విద్య జాత్యభివృద్ధికి మిక్కిలి అనుకూలించు నట్టిదిగ ఉన్నదని దేశనాయకులు శ్రీమాన్‌ ఎస్‌.శ్రీనివాసయ్యంగార్‌, దేశోద్దారకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు మొదలగు ప్రముఖులు అభిప్రాయమిచ్చి ఉండుట చేత, ఈ విద్యాలయము దొర తనము వారివల్ల గ్రాంటు తీసుకొనక ప్రజల సహాయము మీదనే ఆధారపడి యుండుట చేతను, ఈ పాఠశాలకు మన జిల్లాలోని కో-ఆపరేటివ్‌ సొసైటీలు తమ కామన్‌గుడ్‌ ఫండ్‌లో నుండి గాని, మరి యే ఇతర విధమున గానీ ధన సహాయము చేయుదురు గాక”.. అని పాఠశాల పాలక వర్గం 24-4-1927లో కోరుతూ ఒక సర్క్యులర్‌ ద్వారా తీర్మానించింది.

అప్పట్లో నార్త్‌మోపూరు ఆర్‌ఎల్‌రెడ్డి గారి ధర్మముల నుంచి పాఠశాల సాయం కోరేందుకు కూడా తీర్మానం జరిగింది. ఈ సమావేశంలో శ్రీయుతులు ఓరుగంటి వెంకటసుబ్బయ్య, రాళ్ళపల్లి రామ సుబ్బయ్య, తిక్కవరపు వెంకటరామిరెడ్డి, పొణకా కనకమ్మ, కెవి రాఘవాచార్యులు, పి.రామచంద్రారెడ్డి, బెజవాడ సుందర రామిరెడ్డిలు పాల్గొన్నారు.

బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా…

విద్యాలయం అభివృద్ధి కోసం నిర్వాహకులు ఎంతగానో తాపత్రయ పడేవారు. చివరికి చందాలు దండైనా సరే బాలికల విద్యాభ్యున్నతికి పాటుపడా లని నిర్ణయించుకున్నారు. 1927 ఆగస్టు 7వ తేదిన జరిగిన కమిటీ సమావేశంలో ఈ విద్యాలయానికి ఒక రూపాయి చందా ఫండ్‌ను ఏర్పరచి, అట్లు చందా ఇచ్చిన వారిని సభ్యులుగా పరిగణించాలని తీర్మానించుకున్నారు.

అంతేకాదు, ఈ విద్యాలయానికి చందాలు వేయించి వసూలు చేసేవారికి వారు వసూలు చేయు మొత్తంలో పాతిక భాగం వారి ప్రయాణఖర్చులకు, భోజన ఖర్చులకు, వారికి ప్రతిఫలంగా ఇచ్చేవారు. చందాలు వసూలుచేసేవారు విద్యాలయా నికి పంపేందుకు అయ్యే మనీఆర్డర్‌ ఖర్చులు కూడా విద్యాలయం వారే భరా యించేవారు. అంత న్యాయబద్ధంగా ఈ సంస్థ నిర్వహణను చేపట్టేవారు. ఆ వచ్చే పైకాన్నంతా కూడా దొడ్ల రామిరెడ్డి గారి బ్యాంక్‌లో కోశాధిపతి అయిన శ్రీయుత తిక్కవరపు వెంకటరామిరెడ్డిగారి పేరు తోనే యధాప్రకారం ఉంచేవారు. ఆ మేరకు 9.10.1927లో తీర్మానం కూడా జరిగింది.

నాటక ప్రదర్శనల ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా కొందరు ఈ విద్యాలయం అభివృద్ధికి ఇచ్చేవారు. 8-10-1927లో తెనాలి నాట్యసభ వారు ‘ప్రతాప రుద్రీయము’ నాటకాన్ని ప్రదర్శించి వచ్చిన మొత్తాన్నంతా ఈ విద్యాలయం అభివృద్ధికి ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ నాటి మహానుభావుల సమాజసేవాభావానికి, సమాజాభ్యు దయానికి వారు చేసిన సేవానిరతికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు.

శాశ్వత భవన నిర్మాణానికి సంకల్పం…

కస్తూరిదేవి విద్యాలయానికి శాశ్వత భవనాన్ని త్వరలోనే నిర్మించాలన్న గట్టి సంకల్పంతో 1927 మార్చి 11న జరిగిన సమావేశంలో ఆ సంకల్పం నెరవేరేందుకు కనీసం 20వేల రూపాయలు కావాల్సి

ఉంటుందని, నాలుగు నెలల్లోగా ఆ ధనాన్ని వసూలు చేయాలని సంకల్పిం చారు. 1928 జూలై 18న జరిగిన సమా వేశంలో.. కస్తూరిదేవి విద్యాలయానికి శాశ్వత నివేశనము అత్యంతావశ్యకమగుట చేత నెల్లూరు హైరోడ్డులో కందప్ప మేస్త్రీ సత్రమునకు సంబంధించిన ‘బండ్లదొడ్డి’గా పిలువబడు స్థలము సుమారు 2 ఎక రములు, ఆ సత్రం ట్రస్టీల వల్ల ఒక సంవ త్సరానికి 545 రూపాయలకు మించని నేలబాడుగ వారికి చెల్లించు షరతుతో ఈ విద్యాలయ కమిటీవారు శాశ్వత కౌలుకు తీసుకొనునట్లు తీర్మానించుకున్నారు. ఇలా వారు విద్యాలయం అభివృద్ధికి ఎంతగానో తంటాలుపడ్డారు.

ప్రధానాచార్యులుగా

ఓరుగంటి వారు…

అదేవిధంగా, బ్రహ్మశ్రీ ఓరుగంటి వెంకటసుబ్బయ్య పంతులుగారు ఈ విద్యాలయమునకు ప్రధానాచార్యులుగా

ఉండి, విద్యాలయాన్ని అభివృద్ధికి తెచ్చేం దుకు పాటుపడాల్సిందిగా కోరుతూ తీర్మానించారు. వారు ఇక్కడ ఉండి పని చేసినందుకు 50 రూపాయలకు మించని మొత్తాన్ని స్వీకరింపవలసిందిగా కోరారు.

కొద్దికాలానికి ‘శ్రీ కస్తూరిదేవి విద్యా లయము’ పేరుతో లెటర్‌హెడ్స్‌ వేయిం చారు. అందులో, స్థాపితము : 1923, రిజిస్టరు చేయబడినది : 1927 అని ముద్రించడమే కాక, రాట్నం బొమ్మను ముద్రించి…ఇందు బాలికలకు ఉచితముగ తెనుగు, సంస్కృతము, హిందీ, సంగీతము, కుట్టుపని, పేము పని నేర్పబడును..అని ముద్రించారు. దీనినిబట్టి ఆ కాలంలో బాలికలకు విద్యే కాక, వారి బతుకు తెరువుకు ఉపయోగపడే కుట్టుపని, పేము పని కూడా నేర్పడం వారిలో ఉండే బాలి కాభ్యున్నతి ఆకాంక్షకు ప్రతీక.

అప్పట్లో ఈ విద్యాలయానికి అధ్యక్షు నిగా కె.వి.రాఘవాచార్యులు బిఏబిఎల్‌, కార్యదర్శులు పొణకా పట్టాభిరామరెడ్డి, పొణకా కనకమ్మ, కోశాధికారి తిక్కవరపు వెంకట్రామిరెడ్డి, కమిటీ సభ్యులు బెజవాడ సుందరరామిరెడ్డి, పర్వతరెడ్డి రామచంద్రా రెడ్డి, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, రాళ్ళపల్లి రామసుబ్బయ్యల పేర్లతో లెటర్‌హెడ్‌ ముద్రితమైంది.

ఆతర్వాత కొద్దిరోజులు కార్యదర్శి శ్రీమతి పొణకా కనకమ్మగారు అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమె ఒక నెల రోజుల పాటు సెలవు కోరినందువల్ల ఆమె స్థానంలో ఆ నెల రోజులు కార్యదర్శిగా సమావేశాలు నిర్వహించేందుకు ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారిని నియమించు కున్నారు.

1928 జూన్‌ 22న అల్లూరు శ్రీకృష్ణ విలాస సభవారు ఈ విద్యాలయం సహా యార్ధం జూలై 3న చిత్రనళీయము నాటకమును ప్రదర్శించుటకు ఏర్పాట్లు చేశారు. అటు దాతల సహకారంతోను, నాటక ప్రదర్శనల వారిచ్చే సాయంతోను విద్యాలయ నిర్వహణ జరిగేది.

ఏదేమైనా సరే బాలికలకు విద్య చెప్పించి తద్వారా వారి కుటుంబాలకు, సమాజానికి వెలుగుబాటలు పరవాలనే సదాశయంతో వారంతా నిరంతరం తపించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here