Home జిల్లా వార్తలు శ్రావణంలో వైసిపిలోకి ఆనం

శ్రావణంలో వైసిపిలోకి ఆనం

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనే నాయకుడు ఇప్పుడు నెల్లూరుజిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు వైసిపిలో చేరతాడన్నది గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చ. తెలుగుదేశంలో వుండేది లేదని ఈమధ్యనే ఆయన తేల్చి చెప్పాడు. టీడీపీవాళ్ళు ఆయనను దాదాపుగా వదిలేసుకుని ఆయన స్థానంలో ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా కొత్త నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు. ఆనం తట్టాబుట్టా సర్దేసుకుని వైసిపి గూటికి చేరడానికి మార్గం మధ్యందాకా వచ్చేసాడు. తీరా వైసిపికి చేరువగా వచ్చాక, ఇక్కడ మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోయాడు.

మొదట వైసిపిలో సీటుపై క్లారిటీ లేదు. ఏ సీటు ఇస్తామన్నది తేల్చలేదు. అసలు సీటుకు గ్యారంటీ కూడా ఇవ్వడం లేదు. జగన్‌ను సీఎంను చేయడానికి అవసరమైతే తన సీటునైనా త్యాగం చేస్తానంటూ కొద్దిరోజుల క్రితం మేకపాటి గౌతంరెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అయితే వైసిపికి అధికారం వచ్చే అవకాశాలున్న తరుణంలోనే సీటు ఎట్లా వదులుకుంటావురా వెర్రోడా… అని తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి చీవాట్లు పెట్టడంతో గౌతం మళ్ళీ మనసు మార్చుకున్నాడు. ఆత్మకూరు సీటు నుండే తాను పోటీ చేస్తానని, ఈ సీటును వదిలే సమస్యే లేదని ప్రకటించుకున్నాడు. ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరితే ఆయనకు అవకాశముండేది ఆత్మకూరు నియోజకవర్గమే! దీనిపై గౌతం గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జగన్‌తో గట్టిగా వాదించాడని సమాచారం. ఆత్మకూరు కాకపోతే ఆనం రామనారాయణరెడ్డికి వున్న రెండో ఛాన్స్‌ వెంకటగిరి. ఇక్కడైనా ఆనం గట్టి అభ్యర్థే! అయితే ఇక్కడ సీటు విషయమై జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గట్టిగా పట్టి వున్నాడు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆ తర్వాత పార్టీని వదిలేసాడు. అప్పుడు ఎవరూ దొరకని పరిస్థితుల్లో బొమ్మిరెడ్డిని వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దాదాపు నాలుగేళ్ళపాటు బొమ్మిరెడ్డి రాఘవ వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు చూస్తూ వైసిపి శ్రేణులకు టచ్‌లో వుంటున్నాడు. ఇక్కడ పార్టీ కార్యక్ర మాలన్నీ కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతున్నాయి. ఇంతదూరం వచ్చాక ఆయన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. బొమ్మిరెడ్డిని ఒప్పించి ఆనం రామనారాయణ రెడ్డికి సీటివ్వడం కూడా అంత సులభమైన విషయం కాదు.

అయినా కూడా ఎట్టకేలకు ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌ లోని లోటస్‌పాండ్‌లో జగన్మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యాడు. ఏ సీటు అన్నది క్లారిటీ లేకుండానే ఆయన పార్టీలో చేరడానికి సిద్ధపడ్డాడని సమాచారం. పార్టీలో ఇంతవరకు ఎవరికి కూడా సీటు కన్ఫార్మ్‌ చేయలేదు కాబట్టి ఎలక్షన్‌ నాటికి పరిస్థితిని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుందని ఆనంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భేషరతుగానే పార్టీలో చేరడానికి ఆనం అంగీకరించాడని, ఆషాడం వెళ్ళాక శ్రావణ మాసంలో మంచిరోజు చూసుకుని చేరొచ్చని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here