Home సంపాదకీయం శుభ పరిణామం

శుభ పరిణామం

ఉత్తరకొరియా భద్రతకు కట్టుబడతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

కొరియన్‌ ద్వీపకల్పంలో పూర్తి అణునిరాయుధీకరణకు కట్టుబడతాన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌

అమెరికా-ఉత్తరకొరియాల మధ్య సరికొత్తగా సంబంధాల స్థాపనకు కొరియన్‌ ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాధీశుల అంగీకారం.

అణునిరాయుధీకరణకు అంగీకరిస్తూ ఉమ్మడి ప్రకటనపై రెండు దేశాల అధినేతల సంతకాలు

సింగపూర్‌ భేటీ ప్రత్యేకత.

ప్రపంచమంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలకఘట్టం రానే వచ్చింది. అమెరికా-ఉత్తరకొరియాల సింగపూర్‌ భేటీ ఎవరూ ఊహించని విధంగా అద్భుతాల్నే సృష్టించింది. ఇరుదేశాలు శాంతి సామ రస్యాల సాధనకు కట్టుబడుతూ ఒప్పందం చేసు కోవడం, కొరియా ద్వీపకల్పంలో సుస్థిరశాంతికి కలసి కృషి చేయాలనుకోవడం, అణు నిరాయుధీకరణకు అంగీకరించడం వంటి నిర్ణయాలతో ఈ భేటీ ప్రపంచాన్ని ఆనందపరిచింది. యావత్‌ ప్రపంచం కోరుకుంటున్న విధంగానే ఇక్కడ శాంతి సామరస్యా లకు భరోసా లభించినట్లయింది.

కనీవినీ ఎరుగని విధంగా, మొట్టమొదటిసారిగా ఇటీవల సింగపూర్‌లో జరిగిన అమెరికా-ఉత్తర కొరియా దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు ఎంతో చరిత్రాత్మకమైనది. అత్యంత ప్రాధాన్యమైనది కూడా. ఇది కొత్త భవితకు ద్వారాలు తెరుస్తుందనే ఆశాభావం అందరిలో చిగురించింది. తాము చేసిన ఉమ్మడి ప్రకటనలోని అంశాలను వేగవంతంగా అమలు చేయడానికి ట్రంప్‌, కిమ్‌ కట్టుబడడం అందరూ ఆహ్వానించదగిన పరిణామం కూడా.

ఇటీవలి దాకా విద్వేషాలతో.. ఘర్షణపూరిత ధోరణి రగులుతున్న నేపథ్యంలో ఇరుదేశాల అధినేతల మధ్య తాజాగా సరికొత్త మైత్రీభావంతో జరిగిన ఈ భేటీ ప్రపంచదృష్టిని బాగా ఆకట్టుకుంది. అన్నిరకాల వివాదాలకు స్వస్తి చెప్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ల సింగపూర్‌ భేటీ ప్రశాంతవాతావరణంలో ఫలప్రదం కావడం ఎంతైనా మంచి పరిణామం. ఈ బేటీ జరగడమే ఒక పెద్ద విశేషం కాగా, అది ఎంతో సజావుగా జరిగి, ఆ రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కావడం మరింత విశేషమే.

ముఖ్యంగా, దక్షిణ కొరియాతో కలసి చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి పలికేందుకు ట్రంప్‌ అంగీకరించడం… తాము గతాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని, ప్రపంచం ఒక పెనుమార్పును చూడబోతోందని కిమ్‌ ప్రకటించడం.. ఒక అద్భుతం. తమ ఈ మైత్రి ద్వారా కొరియన్‌ ద్వీపకల్పంలోను, ప్రపంచవ్యాప్తంగాను శాంతి, సుస్థిరతకు దోహదపడుతుందని, పరస్పర విశ్వాసం, పాదుకొల్పే చర్యల వల్ల కొరియన్‌ ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు ఊతమిస్తుందని విశ్వసిస్తూ ఆ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ జె. ట్రంప్‌, ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌జోన్‌ ఉన్‌లు చేసిన సంయుక్త ప్రకటనతో దశాబ్దాల తరబడిగా ఆయా దేశాల మధ్య సాగుతున్న ఉద్రిక్తతలకు, వైషమ్యా లకు అడ్డుకట్ట వేసినట్లే. ఇక..శాంతికి ముందడుగు పడినట్లేనని అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన శాంతిని స్థాపించడానికి కలసి పనిచేస్తామని అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు ఇద్దరూ ఒక ఒప్పందానికి రావడం ప్రపంచమంతా అభి నందించే విషయం.

అంతేకాదు, గతాన్ని పక్కనపెట్టి ముందుకు అడుగేద్దామని ఇద్దరు అధినేతలూ సంకల్పించడం అందరికీ మహదానందకరం. అందులోనూ, ప్రపం చాన్ని అణు మారణహోమాన్నుంచి తప్పించేందుకు దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రపం చానికంతటికీ ఎనలేని సంతోషం కలిగించే విషయం. ఉద్రిక్తతలను పెంచే యుద్ధవిన్యాసాలకు అమెరికా చరమగీతం పాడనుండడం, ఉభయదేశాల ప్రజల శాంతి సౌభాగ్యాలను ఆకాంక్షిస్తూ కొరియా ద్వీప కల్పంలో సుస్థిర శాంతికి, అణు నిరాయుధీకరణకు కట్టుబడడం ద్వారా ఈ భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది. దీంతో, ఎట్టకేలకు కధ సుఖాంతమైంది.

ఏదేమైనా, విశ్వశాంతి శుభోదయమే.. మానవాళికి మహోదయం. ప్రపంచం శాంతిగా ఉంటేనే సకల మానవాళి అంతా సుఖసంతోషాలతో వర్థిల్లుతుంది. యుద్ధమేఘాలు ఎక్కడ ఆవరించినా ప్రపంచశాంతికి విఘాతం కలుగుతుంది. విద్వేషాలు మాని స్నేహసౌహార్ద్రభావాలతో, శాంతి సామరస్యాల పరిరక్షణే ధ్యేయంగా కృషిచేయడమే మానవాళికి ఆనంద దాయకమైన విషయం. అయితే, అణ్వాయుధాలు ఇంకా మరికొన్ని దేశాల వద్ద కూడా ఉన్నాయి. అలాంటి దేశాలన్నీ కూడా విశ్వశాంతిని కాంక్షిస్తూ సకల మానవాళి శ్రేయస్సును కోరుకుంటూ సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ముందుకు రావాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. అప్పుడే విశ్వశాంతికి పూర్తి స్థాయిలో భరోసా ఉంటుంది. ఆ దిశగా అన్నిదేశాలు అడుగు ముందుకు వేసిననాడే విశ్వశాంతికి అసలైన శుభోదయం..మానవాళికి మహోదయం. ఆ రోజు త్వరితంగా రావాలని.. వస్తుందని… అందరం మనసారా కోరుకుందాం!….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here