Home సంపాదకీయం వ్యక్తి కాదు.. దేశ భ(శ)క్తి!

వ్యక్తి కాదు.. దేశ భ(శ)క్తి!

‘నిజమైన దేశభక్తుడు, నిరుపమాన నాయకుడు, పరిపాలనాదక్షుడు.. మనోహర్‌ పారికర్‌. దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుండిపోతాయి’

– ప్రధాని నరేంద్రమోడీ

”పారికర్‌ మృతితో దేశం ఒక గొప్ప పరిపాలనాదక్షుడిని కోల్పోయింది. పారికర్‌ ‘సామాన్యప్రజల ముఖ్యమంత్రి’. నిరాడంబరమైన జీవితంతో, గొప్పనేతగా ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు”.. పారికర్‌కు కేంద్ర క్యాబినెట్‌ కన్నీటి నివాళి.

నిరాడంబరత్వానికి మారుపేరు. రాజకీయరంగరలో నిజాయితీ రాజకీయాలకు మరో పేరుగా నిలిచిన మంచినేతల్లో ఒకరు..మనోహర్‌ పారికర్‌. అత్యంత సామాన్యుడు..అసామాన్యునిగా ఎదిగి ప్రజల గుండెల్లో మహనీయమైన నేతగా శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. అకుంఠిత దేశభక్తితో, అత్యంత సేవాభిలాషతో రాజకీయరంగంలోకి వచ్చి ప్రజల మనసుల్లో మహనీయమైన నేతగా నిలిచిపోయిన మహానేత..పారికర్‌. సాధారణంగా రాజకీయాల్లో తమ ప్రతిభాపాటవాలతో ఉద్దండునిగా రాణించేవారు ఎందరో ఉన్నారు. కానీ, ఎంతో ఉన్నత పదవుల్లో

ఉన్నా అత్యంత నిరాడంబరమైన జీవనశైలితో, సామాన్యునిగా ఉంటూనే దేశానికి అసామాన్యమైన సేవలు చేసేవారు ఎవరుంటారు?…అనుకున్నప్పుడు, మనకు వెంటనే గుర్తొచ్చే పేరు..మనోహర్‌ పారికర్‌. నిజాయతీకి- నిబద్ధతకు నిలువుటద్దంగా, నిరాడంబ రతకు ప్రతీకగా నిలిచిన ప్రజానేత పారికర్‌. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 63 ఏళ్ళ వయసులో.. ఈనెల 17న ఆ ప్రజాహృదయనేత కన్నుమూశారు. దేశంలో ఎన్నికల యుద్ధం ఆరంభ మైన ఈ తరుణంలో పారికర్‌ వంటి మహానాయకుని మృతి బిజెపికి పెద్ద లోటు అనే చెప్పవచ్చు.

రాజకీయరంగంలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి వంటి ఉన్నతపదవులను అధిష్టించినా… ఒక సామాన్యమైన వ్యక్తిలాగానే జీవించే అరుదైన వ్యక్తిత్వం.. మనోహర్‌ పారికర్‌ది. అంతేకాదు, నీతి-నిజాయతీ లకు నిలువెత్తు రూపంగా నిలవడమే పారికర్‌లోని గొప్పతనం. అందుకే ప్రజలకు ఆయనంటే ఎంతో అభిమానం. అధికార ఆర్భాటాలు ఆయనకు నచ్చవు. విమానాశ్రయానికి కూడా ఆటోలోనే రావడం, తన లగేజీని తనే తీసుకురావడం, అలా అత్యంత నిరాడంబరంగా జీవించడమంటేనే ఆయనకు ఇష్టం. తన విశిష్టమైన వ్యక్తిత్వంతో, విలక్షణమైన రాజకీయాలతో ఆధునిక గోవా నిర్మాతగా, గోవా ప్రజల ముద్దుబిడ్డగా పారికర్‌ విఖ్యాతి చెందారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లు కేంద్ర రక్షణశాఖ మంత్రిగా దేశానికి అనితరసాధ్యమైన సేవలందించారు. తాను ఆరెస్సస్‌ భావాలతో ఉన్నా, రాజకీయాల్లో అందరివాడిగా రాణించాడు. అజాతశత్రువుగా పేరొందాడు. ఆయన రాజకీయ జీవితం, సామాజిక నిరాడంబర జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమే.

1955లో గోవాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పారికర్‌, పాఠశాల దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై కార్యకర్తగా చేరి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకునిగా గోవా అంతా తిరిగేవారు. 1978లో ముంబై ఐటిఐలో ఇంజనీరింగ్‌ చదువుకుని, ఆ తర్వాత 1990లలో రామజన్మభూమి ఉద్యమంపై గోవాలో విస్త ృత ప్రచారం చేయడంతో బిజెపి ప్రముఖులకు పారికర్‌ పట్ల అభిమానం ఏర్పడింది. అప్పట్లో ప్రాంతీయపార్టీగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ ప్రభావం గోవాప్రజల్లో బాగా ఉండేది. ఆ పార్టీ ప్రాబల్యానికి అడ్డుకట్టవేసేందుకు బిజెపి పారికరే తగ్గ నాయకుడని భావించి ఆ బాధ్యతను అప్పగించింది. అలా క్రమేణా రాజకీయరంగంలోకి ప్రవేశించిన పారికర్‌, 1991 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి చూసినా, 1994లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజి నుంచి పోటీచేసి విజయం సాధించారు. అప్పట్లో తాను ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా, ఆ తర్వాత జరిగిన రాజకీయపరిణామాల్లో 2000 అక్టోబర్‌లో పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన బాధ్యతలు చేపట్టారు. ఐఐటి చదువుకున్న తొలి సిఎంగా ఆయన పేరొందారు. అప్పుడు రెండేళ్ళపాటు సిఎంగా ఉన్నారు. ఆ తర్వాత మారిన రాజకీయాల్లో మళ్ళీ 2002లో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, 2005లో సిఏం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2007లో గోవాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. 2012 ఎన్నికల నాటికి మళ్ళీ బిజెపి పుంజుకుంది. పారికర్‌ నేతృత్వంలో గోవాలో మొత్తం 40 స్థానాలకు గాను 21 స్థానాల్లో బిజెపి ఆధిక్యత సాధించి పారికర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం విశేషం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా గోవాలో బిజెపి ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. ఈ ఎన్నికలకు ముందు, గోవాలో జరిగిన బిజెపి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ప్రతిపాదించింది కూడా పారికరే కావడం మరో విశేషం. ప్రధానిగా మోడీ పదవిని అధిష్టించిన తర్వాత, గోవాకు ముఖ్య మంత్రిగా ఉన్న పారికర్‌కు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖ పదవిని అప్పగించిందంటే పారికర్‌ విశిష్టమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా భావించవచ్చు. అయితే, ఆ తర్వాత 2017లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మెజార్టీ రాకపోవడంతో, తిరిగి ఆయన రాష్ట్రానికి వచ్చి ఇతరపార్టీల సహకారాన్ని కూడగట్టి గోవాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అంతటి సమర్ధవంతుడైన ప్రజానేత పారికర్‌. అంతెందుకు, పారికర్‌ సిఎంగా ఉంటేనే బిజెపికి మద్దతు ఇస్తామని మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా స్పష్టంగా చెప్తున్నా రంటే పారికర్‌ నిజాయితీ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలీ… పారికర్‌ మృతితో ఇప్పుడు గోవా రాజకీయాలు గందరగోళస్థితిలో పడ్డాయి. దేశరాజకీయాల్లో అజాతశత్రువుగా, నిరాడంబరునిగా.. నిజాయతీపరునిగా, రాజనీతిజ్ఞునిగానే కాక అకుంఠిత దేశభక్తితో భరతమాత ముద్దుబిడ్డగా పేరొందిన పారికర్‌ మృతి.. ఎంతైనా బాధాకరం. ఇలాంటి మహనీయమైన నేతల్ని కోల్పోవడం బిజెపికే కాదు… దేశం మొత్తానికే తీరని లోటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here