Home జిల్లా వార్తలు వై.యస్‌. కుటుంబంలో… ‘మేకపాటి’ చిచ్చు

వై.యస్‌. కుటుంబంలో… ‘మేకపాటి’ చిచ్చు

2019 సార్వత్రిక ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో సీట్ల వేడి చిన్నగా మొదలౌతోంది. వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీలో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి ప్రాధాన్యతను కల్పించడంతో పాటు పార్టీ ఆవిర్భావం నుండీ పార్టీనే అంటిపెట్టుకుని వున్నవారికి న్యాయం చేసే విషయంలో పార్టీ అయోమయపరిస్థితులలో పడుతోంది.

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తొలినుండీ వై.వి.సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఉంది. దశాబ్దాల కాలంగా బయట జిల్లావాసులు ప్రకాశం జిల్లాలో పోటీ చేయడం జీర్ణించుకోలేక అక్కడ ఓటర్లు గత ఎన్నికల్లో స్థానిక నినాదంతో పోటీ చేసిన వై.వి.సుబ్బారెడ్డికి పట్టం కట్టారు. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డికి తోడ ల్లుడు, వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డికి బాబాయి అన్న అంశాలు కూడా ఇక్కడ సుబ్బారెడ్డి విజయానికి దోహదపడ్డాయి. పార్టీ ఓడిపోయినా సుబ్బారెడ్డి మాత్రం ప్రజల మనసుల్లో గెలిచాడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ తాను పార్ట్‌టైం పొలిటీషియన్‌ కాదనిపించుకున్నాడు. మళ్ళీ కూడా తానే ఢంకా భజాయించి గెలిచే పరిస్థితి కల్పించు కున్నాడు.

సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వై.వి.సుబ్బారెడ్డిపై ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఒంగోలు పార్లమెంటు నుండి మాగుంటను వైసిపి అభ్యర్థిగా బరిలో దింప నున్నారని పార్టీ వర్గాలే ప్రకటించడంతో మనస్తాపం చెందిన సుబ్బారెడ్డి అలకబూనాడు. తనను కాదని వేరే అభ్యర్థికి సీటెలా ఇస్తారని బహిరంగంగానే ధ్వజమెత్తాడు.

అయితే సుబ్బారెడ్డి కోరిక న్యాయమైనదే అయి నప్పటికీ ఆయన అలా బహిరంగంగా పార్టీని విమర్శించడం మంచిదికాదని పార్టీ వర్గాల భావన. ఈ తరుణంలో మాగుంటను నెల్లూరు వైసిపి అభ్యర్థిగా ఎందుకు నిలపరాదనే వాదన కూడా పార్టీ శ్రేణుల నుండి వస్తోంది. అయితే ఇక్కడే అసలైన సమస్య ఏర్పడుతోంది. తమ కుటుంబానికి ఖచ్చి తంగా 3టిక్కెట్లు కావాల్సిందేనని మేకపాటి బృందం పట్టుపడుతోందని సమాచారం. పెద్దాయన ఉదయ గిరికి వెళ్లి, తమ్ముడికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవచ్చుగా, లేదా ఇప్పుడు వై.వి.సుబ్బారెడ్డికి ఇస్తామని చెప్తున్న రాజ్యసభ పెద్దాయనకే ఇస్తే సమస్య సమసిపోతుంది కదా అన్నది పార్టీ వాదుల వాదన. అయితే మేకపాటి బృందం మాత్రం తమకు 3టిక్కెట్లు కావాల్సిందే అన్న మంకుపట్టు వీడకపోవడం, వీరి డిమాండుకు పార్టీ అధ్యక్షుడు సైతం వంతపాడడం ఎవ్వరికీ మింగుడు పడడం లేదు. మొత్తానికి ఒక్క మేకపాటి టిక్కెట్టుతో పార్టీలో సంక్షోభం తొలగిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు పెద్దమనసుతో ముందుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఎవరికి వారు తమ స్వార్ధానికే పెద్దపీట వేస్తూ తాము గెలిస్తే చాలనుకుంటున్నారు తప్ప తమతో పాటు తమ పార్టీ గెలవాలి, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన చేయలేకపోవడం విచారకరమన్న అభిప్రాయం కూడా రాజకీయ మేధావి వర్గాలలో వినిపిస్తోంది.

నెల్లూరు దేశం నుండి మాగుంట…?

పిల్లి పిల్లి పోరు కోతి తీర్చిందన్నట్లుగా వై.యస్‌.ఆర్‌ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరును తన అవకాశంగా మలచుకుంటున్న తంత్రబాబు వెంటనే పావులు కదిపి మాగుంటను నెల్లూరు పార్లమెంటు దేశం అభ్యర్థిగా పోటీ చేయవలసిందిగా అడిగినట్లు వినికిడి. ఇక్కడ దేశం అభ్యర్థిగా మాగుంట వస్తే అసెంబ్లీ స్థానా లలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చన్నది బాబు ఆలోచన.

రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటినుండీ ఇప్పటి వరకూ మాగుంట కుటుంబం నెల్లూరు నుండి బరిలో దిగలేదు కాబట్టి, ఇక్కడ వారి అభ్యర్ధిత్వం జిల్లా తెలుగుదేశం పార్టీకి అదనపు ఆకర్షణ కాగలదన్న ధీమా కూడా దేశం శ్రేణుల్లో వినపడుతోంది. ఈ మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా వున్న తమ అనుచరులు, అభిమానులను పిలిపించుకుని వారి అభిప్రాయాలను కూడా కోరినట్లు తెలుస్తోంది.

మొత్తానికి మేకపాటి మంకుపట్టు అటు వై.యస్‌. కుటుం బంలో చిచ్చు పెట్టడమే కాకుండా, ఇటు జిల్లాలో పార్టీకి నష్టాన్ని చేకూర్చబోతుందన్నది రాజకీయ భీష్మాచార్యుల అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here