Home జిల్లా వార్తలు వైసిపిలో.. ఎంపీకి కీలకంగా ఆత్మకూరు!

వైసిపిలో.. ఎంపీకి కీలకంగా ఆత్మకూరు!

2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ వైసిపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపుకు ప్రధాన కారణం ఆత్మకూరు నియోజకవర్గమే! ఎంపీ అభ్యర్థికి ఇక్కడ 33వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టే ఆ ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డి ముక్కిమూలిగి 13వేల ఓట్ల తేడాతో బయట పడగలిగాడు. మిగతా ఆరు నియోజకవర్గాలలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా, ఎలాంటి క్రాస్‌ ఓటింగ్‌కు తావు లేకుండా ఆత్మకూరు అసెంబ్లీ మేకపాటిని నిలబెట్టింది.

ఆరోజు ఆత్మకూరులో భారీ మెజార్టీ రావడానికి కారణం సరైన ప్రత్యర్థి లేకపోవడమే! కాంగ్రెస్‌ అభ్యర్థిగా దిగిన ఆనం రామనారాయణరెడ్డి అసలు ఎలక్షనే చేయలేదు. రామనారాయణరెడ్డి ఇక్కడ ప్రధాన పోటీలో వుంటాడనుకుని తెలుగుదేశం వాళ్ళు నామ మాత్రపు అభ్యర్థిగా గూటూరు కన్నబాబును పెట్టారు. అటు ఆనం ఎలక్షన్‌ చేయక, ఇటు టీడీపీ అభ్యర్థి వీక్‌ కావడంతో వైసిపి మెజార్టీ అటు లోక్‌సభలో ఇటు అసెంబ్లీలో 30వేలు దాటింది.

ఆత్మకూరు నియోజకవర్గంలో 2014 ఎన్నికల నాటి పరిస్థితి రేపుండదు. తెలుగుదేశం అభ్యర్థిగా దాదాపు బొల్లినేని కృష్ణయ్యే రంగంలో వుండబోతున్నాడు. గట్టిపోటీ ఖాయం. ఆత్మకూరులో వచ్చే మెజార్టీయే వైసిపి ఎంపీ అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి అనే వాటిని పక్కన పెడదాం. అవి అదృష్టం కొద్ది కలిసొచ్చేవి. గెలవాలంటే ముందు సమర్ధులైన అభ్యర్థుల ఎంపిక కీలకం. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డే నిలిచే అవకాశాలెక్కువ. లోక్‌సభ పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలలోనూ టీడీపీ నుండి గట్టి అభ్యర్థులనే దించడానికి కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీలలో ఎవరు గెలిచినా భారీ మెజార్టీలుండవు. కాబట్టి ఎంపీ అభ్యర్థుల మధ్య కూడా ముఖా ముఖీ పోరు తప్పదు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీలో ఎవరు గెలిచినా నెల్లూరురూరల్‌, నెల్లూరు సిటి, కోవూరు, కావలి వంటి నియోజకవర్గాలలో ఆదాలకు కొంత ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం వుంది. అయితే 2014లో లాగా భారీ స్థాయి క్రాస్‌ ఓటింగ్‌ ఉండకపోవచ్చు. ఈ నియోజకవర్గాలలోనూ మేకపాటి కంటే రాజకీయాలకు అతీతంగా ఆదాలకు వ్యక్తిగత సంబంధాలు ఎక్కువ కాబట్టి ఓటింగ్‌లో మొగ్గు ఆదాలకే ఉండొచ్చు. ఉదయ గిరి, కందుకూరులలో అసెంబ్లీకి పడ్డ ఓట్లే లోక్‌సభకు పడతాయి. పెద్ద తేడా రాదు. వైసిపి ఎంపీ అభ్యర్థి సేఫ్‌లో వుండాలంటే ఆత్మకూరులో గతంలో లాగే భారీ మెజార్టీ రావాలి. మేకపాటి గౌతంరెడ్డి మొదట ఆలోచన చేసినట్లు ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు వైసిపి అభ్యర్థి అయ్యుంటే మంచి మెజార్టీకి ఆస్కార ముండేది. ఎంపి అభ్యర్థికి కూడా కలిసొచ్చేది. కాని గౌతమ్‌ తన ఆలోచనను తానే ఆచరణలో పెట్టలేదు. చివరకు ఆత్మకూరులో తానే నిలబడుతున్నాడు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఆయనపై వ్యతిరేకత వుండడంతో పాటు, ఆనం వెంకటగిరికి పోతుండడంతో ఆయనకు చెందిన మనుషులెవరూ గౌతంతో కలవడం లేదు. దీనికితోడు ఆత్మకూరులో తెలుగుదేశం నాయకు లందర్నీ ఒక గొడుగు క్రిందకు చేర్చే ప్రయత్నాలు జరుగుతు న్నాయి. వీళ్లకు వైసిపి నుండి బయటకొచ్చిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా తోడు కావచ్చు. కాబట్టి ఇక్కడ బలమైన గాలి వీస్తే తప్పితే ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ వుండదు. ఇక్కడ భారీ మెజార్టీ లేకపోతే వైసిపి అభ్యర్థి కష్టాల్లో పడ్డట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here