Home జిల్లా వార్తలు వైసిపిలోకి.. రామ్‌కుమార్‌

వైసిపిలోకి.. రామ్‌కుమార్‌

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో నిన్నటితరం, నేటి తరం, రేపటి తరాలకు గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. సాధారణ ఉపాధ్యాయుడిగా రాజకీయ రంగంలోకి వచ్చి జిల్లాస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. ఎందరికో రాజకీయ భవిష్యత్తును కల్పించిన రాజకీయయోధుడు. రాజకీయాలలో రాణించాలనుకునేవారికి ఆయనొక యూనివర్శిటీ లాంటోడు. ఆయన రాజకీయ విశ్వవిద్యాలయం నుండి నేటి రాష్ట్ర రాజకీయాలలోకి చాలామంది నాయకులు పుట్టుకొచ్చారు. ఎమ్మెల్యే నుండి ముఖ్యమంత్రి దాకా ఎన్నో పదవులు చేపట్టినా ఆయనెప్పుడూ రాజకీయ వారసత్వం గురించి ఆలోచించలేదు. తన తర్వాత తన కొడుకులకు పదవులు దక్కాలనుకోలేదు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికి నలుగురు కొడుకులున్న ప్పటికీ వారిలో రాజకీయాలలోకి ఆలస్యంగా వచ్చింది, అందులోనూ తండ్రి బ్రాండ్‌ను వాడు కోకుండా రాజకీయంగా సొంతంగా అడుగులు వేస్తున్నది నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డే!

తన తండ్రి తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్‌పార్టీలో నుండే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన రాం కుమార్‌రెడ్డి… 2014లో వెంకటగిరి నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిల బడ్డాడు. విభజన మూలంగా రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ మట్టికొట్టుకు పోయిన పరిస్థితుల్లో ఆయన వెంకటగిరి నుండి ఓడిపోయాడు. ఎన్నికల అనంతరం ప్రస్తుత ఉపరాష్ట్రపతి, అప్పటి కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ఆశీస్సులతో బీజేపీలో చేరాడు. ఈ నాలుగేళ్ళు బీజేపీలో బాగానే పని చేసాడు. అయితే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రజల్లో బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్న అభిప్రాయం తదితర కారణాలైతేనేమీ, జగన్‌ నాయకత్వంలో పనిచేయాలన్న అభిలాషయితేనేమీ రామ్‌కుమార్‌ ఆలోచనలు వైసిపి వైపు మళ్లేలా చేసాయి.

ఇటీవల ప్రకటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఆయనను కార్యదర్శిగా నియమించారు. అయితే ఈ పదవిని ప్రకటించిన పదిగంటల్లోపే ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్నాడు. వైసిపిలో చేరి ఒక కార్యకర్తగా పనిచేయడానికి సంసిద్ధత తెలిపాడు. అంతేకాదు, ఎటువంటి పదవులు, ఎలాంటి సీట్లు ఆశించకుండానే ఆయన బీజేపీని వదిలి వైసిపిలో చేరబోతున్నాడు.

జిల్లాలో ఒక బలమైన వర్గం నేదురుమల్లిది. వెంకటగిరి అసెంబ్లీతో పాటు గూడూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాలపై నేదురుమల్లి ప్రభావం ఉంటుంది. నేదురుమల్లి రామ్‌కుమార్‌ రాకతో ఈ మూడు నియోజకవర్గాలలోనూ వైకాపాకు అదనపు బలం వచ్చినట్లే! రేపు అసెంబ్లీల వారీగా అభ్యర్థుల ఎంపికలో కూడా వెంకటగిరికి సమర్ధులైన అభ్యర్థులలో ఒకడు కాగలడు.

జగన్‌ తండ్రి దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఆయనకు ఎంతగానో సహకరించారు. వై.యస్‌. పరిపాలనను జనార్ధన్‌రెడ్డి పలుమార్లు ప్రశంసల్లో ముంచెత్తారు. ఇప్పుడు వై.యస్‌. వారసుడు జగన్‌ నడుపుతున్న పార్టీలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేరుతున్నాడు. తండ్రుల బంధం లాగే ఈ తనయుల బంధం కూడా బలపడాలని, జగన్‌ సారధ్యంలో రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైకాపా మరింత పటిష్టంగా తయా రవ్వాలని అభిమానులు కోరుకుం టున్నారు.

శ్రావణంలోనే ఆనం…

మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి కూడా ఈ నెలలోనే జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరను న్నాడని తెలుస్తోంది. ఆషాఢ మాసం అని ఆయన వేచి చూస్తున్నాడు అని అంటున్నారు. శ్రావణ మాసంలో జగన్‌ పాదయాత్ర విశాఖలోకి ప్రవే శించగానే విశాఖ వేదికగా ఆయన పార్టీలో చేరనున్నాడని సమాచారం.

అటు ‘రామ్‌’ ఇటు ‘నారాయణ’ ఇద్దరూ వైకాపా తీర్ధం పుచ్చుకోవడం జగన్‌రెడ్డి పార్టీకి జిల్లాలో మరింత బలం చేకూరినట్లే. అయితే ఇక్కడ రామ్‌కుమార్‌రెడ్డి పార్టీలోకి రావడం పార్టీకి మంచి అండగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రామ్‌కుమార్‌ వల్ల జిల్లా మొత్తం వున్న నేదురుమల్లి అభిమానులు ఆనందంలో వున్నారని, వారంతా వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతారన్నది వారి ఆలోచన.

అయితే రామనారాయణరెడ్డి పార్టీలోకి రావడం ఎక్కువ మందికి మింగుడు పడడం లేదు. ఆయన వచ్చినందువల్ల పార్టీ జెండా ఆయనకు లాభపడుతుందే తప్ప, ఆయన వల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది వారి వాదన. అయితే, రామ్‌కుమార్‌ రెడ్డి తాను జగన్‌ను కలవడం, వెంటనే నిర్ణయం ప్రకటించడం… వెంట వెంటనే జరిగిపోయాయి. కాని, రామనారాయణరెడ్డి మాత్రం ఇంకా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఆనం మార్కు రాజకీయాన్ని చేస్తున్నాడు. పైగా ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వున్న రాఘవేంద్రరెడ్డికి రామ్‌కుమార్‌కి మంచి సంబంధాలు వున్న తరుణంలో వీరిద్దరినీ కాదని అక్కడ రామనారాయణకి టిక్కెట్‌ ఇవ్వడం కూడా సమంజసం కాదని, అలా ఇస్తే పార్టీ వర్గాల్లో అసంతృప్తి చెలరేగే అవకాశం వుందని రాజకీయ మేధావుల విశ్లేషణ. ఈ తరుణంలో పార్టీ టిక్కెట్‌ ఎవరిని వరిస్తుందోనన్నది కూడా పెద్ద చర్చ నీయాంశంగా మారింది. ఏదిఏమైనా… ఒక ప్రజాముఖ్యమంత్రి కుమారుడికి అండగా మరో మాజీముఖ్యమంత్రి తనయుడు నిలవడం పార్టీకి శుభపరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here