Home జిల్లా వార్తలు వైసిపిలోకి మాగుంట?

వైసిపిలోకి మాగుంట?

రాష్ట్ర రాజకీయాలలోనే మాగుంట కుటుంబానికి ఓ ప్రత్యేకత వుంది. ఆ కుటుంబం ఏ పార్టీలో వున్నా హూందాగా వ్యవహరిస్తుంది. వివాదాలకు దూరంగా వుంటుంది. అతివాద ధోరణి విమర్శలకు దరిదాపుల్లో కూడా వుండదు. అందుకే ఆ కుటుంబసభ్యులు ఏ పార్టీలో వున్నా అన్ని పార్టీల వాళ్ళు వారిని గౌరవిస్తుంటారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి నేర్పిన రాజకీయ సంస్కారం అది.

మాగుంట కుటుంబం వారసుడిగా రాజకీయ రంగంలో వున్న మాజీ పార్లమెంటుసభ్యులు, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలో వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరే అవకాశాలున్నట్లు, ఈమేరకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలలోనే వైసిపి వాళ్ళు ఆయనను మిస్‌ చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వదిలి తెలుగుదేశంలో చేరిన ఆయన ఆ పార్టీ నుండి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడం, వైసిపి అభ్యర్థి వై.వి. సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోవడం తెలిసిందే! ఆ తర్వాత ప్రకాశం జిల్లా స్థానిక శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పట్టుబట్టి మాగుంట శీనయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఎమ్మెల్సీగా గెలిచాక మంత్రిపదవి కూడా ఇస్తామన్నారు. ఆయన ఎమ్మెల్సీగా గెలవడం అయితే జరిగిందిగాని, మాగుంటకు మంత్రి పదవి ఇవ్వలేదు. మాగుంట వాళ్ళకు పదవులు అడిగే తత్వం లేదు. చంద్రబాబుకు అడిగితే గాని ఇచ్చే గుణం లేదు.

తెలుగుదేశంలో మాగుంటకు ఇబ్బందికర పరిస్థితులే వున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకత్వ పోకడలు, ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక ఆయన ఆ పార్టీని వీడి వైసిపిలో చేరాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

ఆయన వైసిపిలో చేరితే ఒంగోలు లోక్‌సభ వైసిపి అభ్యర్థి ఆయనే అయ్యే అవకాశాలున్నాయి. త్వరలో మాగుంట శ్రీని వాసులురెడ్డి పార్టీ మారే ప్రకటన రావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here