Home జిల్లా వార్తలు వేడెక్కుతున్న విఆర్‌

వేడెక్కుతున్న విఆర్‌

వందేళ్ళకుపైగా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక విఆర్‌ విద్యా సంస్థల పాలక వర్గానికి ఎన్నికలు షురూ అయ్యాయి. దాదాపు 3దశాబ్దాల పాటు సాగిన ఆనం సోదరుల ఆధిపత్యానికి సుప్రీం కోర్టు ఇటీవలే చెక్‌ పెట్టింది. వాళ్ళ పాలకవర్గం చెల్లదని తీర్పు నివ్వడం తెలిసిందే! వాస్తవంగా ఆనం నాయకత్వంలో ఏర్పడ్డ పాలకవర్గం చెల్లదంటూ ప్రత్యర్థులు కోర్టుకు పోవడం ఆనం వాళ్ళకే మేలైంది. కోర్టులో కేసు లేకుంటే నిర్ణీత టైంకు మళ్ళీ పాలకవర్గానికి ఎన్నికలు జరిగివుండేవి. అప్పుడు పరిస్థితులను బట్టి బలాబలాలను బట్టి కొత్తోళ్ళు వచ్చినా వచ్చుండొచ్చు. కేసు కోర్టులో వుండడం వల్ల 30ఏళ్లు పాలకవర్గానికి ఎన్నికలు లేకుండా పోయాయి. ఆనం వాళ్ళే పెత్తనం సాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కమిటీని రద్దుచేసి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు 3దశాబ్దాలు అధికారం అనుభవించారు కదా! అంతకన్నా ఇంకేం కావాలి!

విఆర్‌ విద్యా సంస్థలకు కొత్త పాలక వర్గాన్ని ఎంపిక చేసే క్రమంలో ఓట్ల నమోదు ప్రక్రియ మొదలు కావడం తెలిసిందే! 2016 వరకు విఆర్‌ విద్యాసంస్థలలో హైస్కూల్‌ నుండి పిజి వరకు చదివిన ఎవరైనా ఓటర్లుగా నమోదు కావచ్చు. కలెక్టరేట్‌లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయగా పూర్వవిద్యార్థులు మందకొడిగా తమ ఓట్లను నమోదు చేసుకుంటున్నారు.

పార్టీల వారీగా ప్యానెళ్ళు…

విఆర్‌ పాలక వర్గ కమిటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు, గెలి చేందుకు ఆయా పార్టీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పావులు కదుపుతున్నారు. విఆర్‌ విద్యా సంస్థలలో ఒకప్పుడు ఏబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ వంటి విద్యార్థి సంఘాలు బలంగా వుండేవి. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబివిపి నాయకులే ఆనం పాలకవర్గంపై కోర్టుకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ మద్దతుదారులైన ఆమంచర్ల శంకరనారాయణ సారధ్యంలో ఒక ప్యానెల్‌ ఏర్పాటై జోరుగా ఓట్ల నమోదు చేయిస్తోంది.

అలాగే వామపక్ష మద్దతుదారులు కూడా పాలకవర్గం ఎన్నికల్లో పోటీ చేసే దిశగా శరవేగంగా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఓట్ల నమోదు ప్రక్రియను వీళ్ళు కూడా వేగ వంతంగా జరిపిస్తున్నారు. ఇక ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా అడ్డుతగిలి, ఆటంకం కల్పించే మరో గ్యాంగ్‌ కూడా ఒక ప్యానెల్‌గా రంగంలోకి దిగి విఆర్‌ ఆస్థులను కబ్జా చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒకెత్తయితే విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టును నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఆనం వర్గీయులు కూడా ఒక ప్యానెల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళు ఇప్పటికే కరపత్రాల పంపిణీ కూడా మొదలుపెట్టారు. వి.ఆర్‌ విద్యాసంస్థలలో మొదలు, కొస తెలిసిన ఆనం రామనారాయణరెడ్డి ఈ ప్యానెల్‌ను నడిపిస్తున్నాడు. పాత ఓటర్ల లిస్టుతో పాటు కొత్త ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వీరి వద్దే వుండొచ్చు. ఓట్లు నమోదు, ఓటర్లను కలవడం వీళ్ళకు కొంత సులభమైన పని. పాలకవర్గానికి ఎన్నికలు జరిగినా కూడా విఆర్‌ విద్యా సంస్థలపై తమ పెత్తనం పోకూడదనే ఉద్దేశ్యంతోనే పోరాటానికి సిద్ధమయ్యారు. ఓట్ల నమోదు పూర్తయితే పాలక కమిటి ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావచ్చు. 2019 జనరల్‌ ఎలక్షన్స్‌ కంటే విఆర్‌ ఎలక్షన్సే నెల్లూరులో ముందుగా టెన్షన్‌ వాతావరణం తెచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here