Home రాష్ట్రీయ వార్తలు వేడెక్కిన ఏపి… నేతల్లో బీపి

వేడెక్కిన ఏపి… నేతల్లో బీపి

దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం టెన్షన్‌ వుంటే ఏపిలో మాత్రం ఎన్నికల యుద్ధ టెన్షన్‌ నెలకొంది. రాష్ట్రంలోని 25లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఎండలతో పాటు ఎన్నికల వాతావరణం కూడా మండిపోతోంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య సంకుల సమరానికి రాష్ట్రం వేదిక కాబోతోంది. అధికారాన్ని నిలుపుకోవడానికి తెలుగుదేశం, 2014 ఎన్నికల్లో తృటిలో కోల్పోయిన అధికారాన్ని ఈసారి చేజిక్కించుకోవడానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు కథనోత్సాహంతో వున్నాయి. ఇరుపార్టీలు కూడా ఎన్నికల యుద్ధ సన్నాహాలలో తలమునకలై వున్నాయి.

ఈసారి ఎన్నికలు చంద్రబాబు ఐదేళ్ళ పాలనకు రెఫ రండం కాబోతున్నాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అన్న భావం లేదు. ఎందుకంటే అప్పటివరకు రాష్ట్రాన్ని పాలించి ఏడ్చిన కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చిపోయింది. అటు చంద్రబాబు… ఇటు జగన్‌. వారిపై వ్యతిరేకతకు అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబుకు అప్పటికే పదేళ్ళ గ్యాప్‌ వచ్చింది. కాబట్టి గతంలో ఆయనపై చూపిన వ్యతి రేకతను మరచిపోయారు ప్రజలు. చంద్రబాబు, జగన్‌లను బేరీజు వేసినప్పుడు అనేక అంశాలలో చంద్రబాబువైపే మొగ్గు కనిపించింది. దాంతోనే టిడిపి అధికారంలోకి వచ్చింది.

మరిప్పుడు రాష్ట్రంలో చంద్రబాబుకు అంత అనుకూల వాతావరణం వుందా? అంటే లేదనే చెప్పాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో చంద్ర బాబు పూర్తిగా విఫలమయ్యాడు. అవినీతి, అక్రమాలు పెరిగాయి. అమరావతి రాజధాని అట్టర్‌ఫ్లాప్‌ సబ్జెక్ట్‌. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుండింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమనే పరిస్థితి. చంద్రబాబు ఎన్నో ఎన్నికలు చూసుంటాడు. ఎన్నో ఎన్నికలు చేసుంటాడు. కరెక్ట్‌గా ఎన్నికలకు రెండు నెలల ముందు తాయిలాలు వదిలాడు. పసుపు – కుంకుమ, పింఛన్‌ల పెంపు, రైతులకు ఆర్ధికసాయం ఈ కోవలోనివే! ఈ తాయిలాలు పార్టీలో కొంతవరకు ఊపును తెచ్చాయనే చెప్పవచ్చు.

ఇక చంద్రబాబు రాజకీయ చాణక్యం, అనుభవం ఏంటన్నది ఆయన చేస్తున్న అభ్యర్థుల కూర్పుతోనే అర్ధమవుతుంది. ఆగర్భశత్రువుల మధ్య సైతం సీట్ల సర్ధుబాటు చేస్తున్నాడు. కరణం – గొట్టిపాటి, జేసీ – పరిటాల, కోట్ల – కె.ఇ, అశోకగజపతిరాజు- సుజయ్‌ రంగారావు, ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డి… ఇలా ఎంతోకాలంగా నిప్పు – ఉప్పులా వున్న కుటుం బాలను ఒక్కటి చేసి ఆయన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాడు. ఎవరూ పార్టీని వదిలిపోకుండా సీట్లు సర్దుబాటు చేస్తున్నాడు. ఎన్నికల నిర్వహణలో వేగంగా ముందుకు పోతున్నాడు.

ఇంటి పోరుతో వైసిపి

ప్రజల్లో బలం వుందిగాని ఎన్నికల నిర్వహణలో చూస్తే చంద్రబాబు వేగాన్ని వైసిపి అందుకోలేక పోతోంది. అయితే 2014 ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఈ విషయంలో కొంత మెరుగైందని చెప్ప వచ్చు. పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా జగన్‌ ఐదేళ్లు అవిశ్రాంతంగా పోరాడాడు. ప్రజల్లోకి చొచ్చుకు పోవడంలో తండ్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డిని మరిపిం చాడు. 3,200 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాద యాత్రతో అసాధ్యుడనిపించుకున్నాడు. రాష్ట్రంలో ఈ ఒక్కసారికి జగన్‌కు ఓటేయాలి అనే సానుకూల వాతా వరణాన్ని తీసుకొచ్చాడు. వైసిపికి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి వంటి వారి రూపంలో ఒక టీమ్‌ కూడా సెట్‌ అయ్యింది. పార్టీలోకి చేరికలు కూడా బాగానే వున్నాయి. ముఖ్యంగా ‘కాపు’ వర్గం నేతలు వైసిపిలో చేరుతుండడం పార్టీకి ఊపు నిస్తోంది. అయితే, అభ్యర్థుల ఎంపిక విషయంలోనే వైసిపి ఇంకా వెనుకబడివుంది. ఓ పక్క చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ చకచకా అభ్యర్థుల ఎంపిక కానిస్తున్నాడు. దీనివల్ల అభ్యర్థులు ముందుగా ప్రజల్లోకి వెళ్లగలుగు తారు. కాని, వైసిపిలో అభ్యర్థుల విషయంలోనే ముందరికాళ్లకు బంధాలు పడుతున్నాయి. ఆయా జిల్లాల్లో వీళ్లైతే ఎంపీలు, లేదా ఎమ్మెల్యేలుగా గెలవరు అని ఖచ్చిత సమాచారం వున్న నాయకులను కూడా పక్కన పెట్టలేకపోతున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలని వాళ్ళకే సీట్లిస్తే పార్టీకి నష్టమని తెలిసి కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.

అధికారం కావాలంటే మెజార్టీ సీట్లు సాధిం చాలి. మెజార్టీ సీట్లు కావాలంటే గెలుపుగుర్రాలనే ఎంచుకోవాలి. అంతేగాని, అభ్యర్థులతో పనేంటి. నన్ను చూసే కదా జనం ఓట్లేసేది అనే భ్రమల్లోనే వుండి వైసిపి ఎన్నికలకు పోతే 2014కు 2019కి పెద్ద తేడా వుండదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here