Home సంపాదకీయం వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు?

వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు?

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నియంతగా వ్యవహ రిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, మోడీని గద్దె దించి దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని, రాజ్యాంగ సంస్థల పవిత్రతను కాపాడుతామంటూ కొంతకాలంగా దేశంలో ఒక పొలిటికల్‌ బ్యాచ్‌ తిరుగుతోంది. ఈ ముఠా అంతా కూడా ముఖానికి సెక్యులర్‌ ముసుగు తగిలించుకుంది. రాజకీయ నాయకులకు ఇదొక రక్షణ కవచం లాంటిదన్న మాట. వీళ్ళ లక్ష్యం మోడీని ఓడించడం. మోడీ యాంటీగ్యాంగ్‌లో దేశంలో అన్ని రకాల వ్యవస్థలను 60ఏళ్ళ పాటు భ్రష్టు పట్టించి, లెక్కలేనన్ని స్కాంలకు దిక్సూచిగా మారిన కాంగ్రెస్‌పార్టీతో పాటు ఆయా రాష్ట్రాలలో తమ పార్టీల పాలనలో ఎన్నో వేలకోట్లు అవినీతి పాపాలకు పాల్పడిన సమాజ్‌వాది, బహుజన సమాజ్‌వాది, రాష్ట్రీయ జనతాదళ్‌, తెలుగుదేశం, జనతాదళ్‌(ఎస్‌), నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, తృణ మూల్‌ కాంగ్రెస్‌, నేషనల్‌కాన్ఫరెన్స్‌ పార్టీ, డిఎంకె వంటి ఎన్నో పార్టీలున్నాయి. ఈ ముఠాలో ఒక్క ఆమ్‌ఆద్మీ పార్టీకి తప్పితే మిగతా పార్టీలకు అవినీతి చరిత్ర వుంది. మోడీ యాంటీగ్యాంగ్‌లోని పార్టీలలో ఒక రిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నవాళ్ళే! ఎవరూ సచ్ఛీలురు లేరు. వీళ్లంతా కలిసి మోడీని దించేస్తారట! ఎవరిని ఎక్కిం చాలన్నా, ఎవరిని దించాలన్నా అది ప్రజల చేతుల్లో పని! పనిగట్టుకుని వీళ్ళు మోడీనే లక్ష్యం చేసుకోవడానికి కారణం ఒక్కటే! అవినీతి కేసుల్లో వున్న వీళ్లెవరినీ మోడీ వదలడం లేదు. పగలే కాదు, రాత్రిళ్ళు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాడు. కాంగ్రెస్‌పార్టీలాగా అవినీతి నేతలతో అడ్జస్ట్‌ కావడం లేదు. అది ఈ ముఠాకు కడుపు మంటగా మారింది.

మోడీ యాంటీగ్యాంగ్‌తో అంటకాగుతున్న లాలూప్రసాద్‌యాదవ్‌ ఇప్పటికే జైలు శిక్ష అనుభ విస్తున్నాడు. బిఎస్పీ అధినేత మాయావతి మీద సిబిఐ కేసులున్నాయి. ‘ఓటు-నోటు’ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనను ఎక్కడ ఇరికిస్తారోనని చంద్రబాబు భయపడుతున్నాడు. మోడీ దెబ్బకు వణుకొచ్చే ఆయన విలువలను, సిద్ధాంతాలను కూడా పక్కనపెట్టేసి కాంగ్రెస్‌తో కలిశాడు. నేను లేస్తే మనిషిని కాదంటూ ఇతర పార్టీలను కలుపుకుని మోడీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదంతా ఒకెత్తయితే, ఇప్పుడు ఆ కూటమిలోనే రేపు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో వున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎపిసోడ్‌ మరో ఎత్తు. దేశం ఇప్పటి దాకా ఆమెను ఒక కోణంలోనే చూసింది. మమతాబెనర్జీ అంటే బెంగాల్‌ టైగర్‌ గుర్తుకు వచ్చేది. ఆమెలో ఒక పోరాట యోధురాలు కనిపించేది. పాతికేళ్ల కమ్యూనిష్టు కోటను బద్ధలు కొట్టిన ధీరవనిత కనిపించేది. తన సిద్ధాంతాల కోసం, తన ఆశయాల కోసం కాంగ్రెస్‌నే వదిలేసి సొంతంగా పోరాడిన వీరనారి కనిపించేది. నూలుచీర, రబ్బరు చెప్పులు, డొక్కు మారుతి కారు మాత్రమే ఆమె పేరు వింటే గుర్తుకు వచ్చేవి. రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఇంతవరకు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అభిమానిస్తున్న మహిళా నాయకురాలెమె. అలాంటి మహిళ ఒకే ఒక్క తప్పటడుగుతో, తాను కూడా అవినీతి పార్టీల తాను మ్కులో ఓ భాగమేనని నిరూపించుకుంది.

పశ్చిమబెంగాల్‌లో 2013లో శారదా చిట్‌ఫండ్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. ఒక వందమంది గ్రూప్‌గా ఏర్పడి శారదా చిట్‌ఫండ్స్‌ పేరుతో చైన్‌లింక్‌ స్కీంను మొదలుపెట్టి దాదాపు 10వేల కోట్ల దాకా దండారు. ఈ స్కీంలో దాదాపు 10లక్షల మంది బాధితులున్నారు. ఈ చిట్‌ఫండ్‌ కుంభకోణం 2013లో వెలుగు లోకి రాగా, అప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వమే దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ స్కాంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన నాయకులు కూడా వున్నట్లు తెలు స్తోంది. అప్పటి నుండి ఆ కేసు విచారణ కొనసాగు తూనే వుంది. అప్పట్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఈ కుంభకోణం గురించి మమతా బెనర్జీపై కూడా విమర్శలు చేసి వున్నాడు. ఈ కేసు విచారణ పరం పరలోనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కలకత్తా పోలీస్‌ కమిషనర్‌ను విచారించడానికి వెళ్లిన సిబిఐ అధికారుల బృందాన్ని పశ్చిమబెంగాల్‌ పోలీసులు అవమానకర రీతిలో నిర్బంధించడం వివాదానికి దారి తీసింది. దీనికితోడు సిబిఐను అడ్డం పెట్టుకుని విపక్షాలను వేధిస్తున్నారంటూ మమతా బెనర్జీ నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. అయితే సుప్రీం కోర్టు మమతా ప్రభుత్వానికి కీలెరిగి వాతపెట్టింది. విచారణకు సహకరించాల్సిందేనని, కలకత్తా కమిషనర్‌ను మరో ప్రాంతంలో విచారించాలని, శారదా స్కాం సాక్ష్యాలను ధ్వంసం చేసుంటే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించింది. సుప్రీం కన్నెర్ర జేయడంతో మమతా తన నిరసన నాటకానికి తెరదించింది.

ఈ వారంరోజుల్లో జరిగిన సంఘటనలతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నదెవరో, రక్షించగలి గిందెవరో, రాజ్యాంగ సంస్థలకు గౌరవమిస్తున్నదెవరో, వాటి మీద దాడి చేస్తున్నదెవరో దేశ ప్రజలకు అర్ధమైపోయింది. గతంలో సిబిఐ విచారణకు నరేంద్ర మోడీ, అమిత్‌షాలే కాదు, చాలామంది నాయకులు హాజరై వున్నారు. ఈరోజు తన జమానాలోని ఒక పోలీసు అధికారిని విచారించడానికి సిబిఐ అధికారులొస్తే మమతా బెనర్జీ నానా ఆగిత్యం చేసింది. వాళ్ల విచారణ జరిగితే వీళ్ల బొక్కలు బయటపడతాయని భయం! ఒక్క మమతా బెనర్జీయే కాదు, ఆ కూటమిలోని మెజార్టీ పార్టీల నాయకులు తమ అవినీతి భాగోతాలు బయటపడతాయనే భయంతోనే మోడీని ఓడించాలంటున్నారు. ఇలాంటివాళ్ళు దేశాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటే ప్రజలు నమ్ముతారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here