Home జిల్లా వార్తలు విష వలయంతో… నెల్లూరు విలవిల

విష వలయంతో… నెల్లూరు విలవిల

దేశంలో అత్యంత కాలుష్యమైన నగరాలు 14 ఉంటే, అందులో నెల్లూరు కూడా ఒకటని తాజాగా నిపుణుల హెచ్చరిక చూస్తే..నెల్లూరెంతగా కాలుష్యంలో కూరుకుపోతోందో..అనారోగ్యకర వాతావరణంలో పడి ఈ సుందర నగరం ఎంతగా విలవిలలాడిపోతోందో తేటతెల్లమవుతుంది. చూడచక్కని పచ్చని ప్రకృతి వాతావరణంతో, చల్లని గాలులతో గతంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న నెల్లూరు..ఇప్పుడు సెగలు పొగలతో నిండిపోతోంది. ఎటుచూసినా కాలుష్యంతో…దుమ్ము-ధూళితో నిండిపోతోంది. నెల్లూరు చరిత్రలోనే ఇంతటి దుర్గతి ఎప్పుడూ లేదు..అయినా, నగర పాలకుల్లో కానీ, అధికారుల్లో కానీ చలనం ఉండడం లేదు.

నెల్లూరు నగరవాసులకు..ఇక పాత నెల్లూరు ఒక మధురజ్ఞాపకంగానే మిగిలి పోయేట్టుంది. ఆ ప్రశాంతమైన వాతా వరణం, ఎటు చూసినా చెట్లు..పచ్చదనం, పెన్నానది గలగలలు, పక్షుల కిలకిలలు.. సముద్రపు గాలుల చల్లదనం ఇవన్నీ ఇక ఊహించుకుంటూ బతకాల్సిందే. ఆ ఆనందకర పరిస్థితులను కలగనాల్సిందే తప్ప..మనకిక కనిపించవు. ఇప్పుడు మనం పీల్చే గాలి..తాగే నీరు అన్నీ కలుషితమై పోయాయి. ఎటుచూసినా కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. చల్లదనం అన్నది ఆవిరైపోయి, నెల్లూరు కాలుతున్న పెనంలా సెగలుపొగలతో అట్టుడికిపోతోంది. కారణాలు అందరికీ తెలిసినవే…చెట్లు మటుమాయం అయ్యాయి. ప్రధానవీధు ల్లోనే కాదు, చిన్నచిన్న వీధుల్లోని పెద్దపెద్ద చెట్లు కూడా రోడ్లకి బలైపోయాయి. వానలు లేవు..రుతువులే మారిపోయాయి. సకాల వర్షాలతో పచ్చదనం పరవళ్ళతో ఉన్న నెల్లూరు ఇప్పుడు.. ఏడాదంతా మండుటెండగానే మండుతోంది. దీనికి తోడు నగరంలో వాహనాల సంఖ్య విపరీ తంగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా నెల్లూరులో ఆటోలు గణనీ యంగా పెరిగిపోయాయి. వాటి సంఖ్య కనీసం పాతికవేలకు పైగానే ఉంటుందన్నా ఆశ్చర్యం లేదు. ఇవి కాక, వేలాది బస్సులు, లారీలు, లక్షలసంఖ్యలో ద్విచక్రవాహ నాలు.. వెరసి ఎక్కడ చూసినా వాటి తాలూకు కాలుష్యం గాలిలో కలసిపోయి.. ప్రజల ఆరోగ్యం కూడా గాలిలోనే కలిసి పోతోంది. అందులోనూ ఇటీవల నగరంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులు క్రమబద్ధంగా లేక ఇష్టా రాజ్యంగా జరుగుతుండడం, ఎక్కడంటే అక్కడ రోడ్లంతా తవ్వేసి అనేకచోట్ల అలాగే నెలల తరబడి ఉంచేయడం వల్ల పరిసరాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. ఎన్నిసార్లు ఎవరెంతగా మొత్తుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఫలితంగా రకరకాల జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో నగర ప్రజలు ఎంతోకాలంగా ఈ బాధ లతో నరకయాతన పడుతూనే ఉన్నారు.

అంతా కాలుష్యమయం…

నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నా పాలకులు, అధికారులు పట్టించు కోకపోవడం విచారకరం. పరిశ్రమల కాలుష్యం, వాహనాల కాలుష్యం.. ఒకటే మిటి ఎక్కడ చూసినా అంతా కాలుష్యమే. పరిశ్రమల ద్వారా, ధర్మల్‌ కేంద్రాల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందని నిపు ణులు చెప్తున్నా ఆలకించేవారు లేరు. కాలుష్యం పెరగడం వల్ల గాలిలో స్వచ్ఛత తగ్గిపోతోందని అటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా అటు నగరపాలకులు కానీ, ఇటు అధికారగణం కానీ వినిపించుకోవడం లేదు. కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని, కాలుష్యాన్ని నివారించు కోవాలని చెప్పడమే తప్ప పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి పెద్దఎత్తున విరుచుకుపడుతున్న కాలుష్య నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

అగ్నిగుండంగా నెల్లూరు…

నెల్లూరంటే.. చల్లని ఆహ్లాదకర వాతావరణానికి ప్రసిద్ధి. జిల్లా అంతా పచ్చదనానికి కొరత లేకుండా ఉండేది. ముక్కారు (ఏడాదికి మూడు కార్లు) పండే నెల్లూరుసీమలో ఇప్పుడు వానలు కురవ డానికే భయపడిపోతున్నాయి. పొరపాటున ఎప్పుడన్నా ఒక చినుకు రాలినా.. మళ్లీ అంతలోనే మబ్బులన్నీ ఈ సెగలు చూసి ‘అమ్మో ఇది నెల్లూరా’ అంటూ భయపడి వెనక్కి మళ్ళిపోతున్నాయి. బోలెడంత సముద్రతీరం మనకున్నా..చల్లదనం అన్నదే కరువైపోయింది. జిల్లా ఇప్పుడు వర్షా భావంతో.. కరువుతో అల్లాడుతోంది. పంటలు ఎండిపోతున్నాయి. చివరికి తాగేందుకు గుక్కెడు నీళ్ళు దొరకని దుస్థితి కూడా నెల్లూరుసీమలో దాపు రిస్తున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇన్నేళ్ల నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేదు. వర్షాకాలం వస్తే ఆగకుండా వానలు కురి సేవి. ఇప్పుడు ఎండలదే రాజ్యం. పెన్నా నదిని కూడా ఇప్పుడు శుభ్రంగా ఎండ బెట్టేశారు. హాయిగా అక్కడ క్రికెట్టో.. కుందుడుకుమ్మో ఆడుకోవచ్చు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎప్పుడన్నా కనికరించి సోమశిల నుంచి నీళ్ళొస్తే ఆ నదిలో ఒక చిన్న పాయ సైడుకాలువలా పారుతుంది. దానికే సంబరపడాలిప్పుడు. ఈ కష్టాల న్నిటికీ కాలుష్యం భయంకరంగా పెరిగి పోవడమే ప్రధాన కారణం. ఈ దుస్థితి ఇలాగా కొనసాగితే నెల్లూరు అగ్ని గుండంలా మారిపోతుందన్నా అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు, అధికారులు అందరూ కలసి కాలుష్యనివా రణకు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఈ కృషిలో భాగస్వాములై కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు సహకరిస్తూ.. సింహ పురిని స్వచ్ఛపురిగా…పచ్చదనాల సిరిగా మార్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here