Home గల్పిక వివేకా బయోపిక్‌పై ఇంద్రుడి ఆసక్తి

వివేకా బయోపిక్‌పై ఇంద్రుడి ఆసక్తి

డిసెంబర్‌ 23వ తేదీ… స్వర్గలోకం రాజధాని అమరావతి నగరం. ”ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు” అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా అప్పుడే సూర్యుడు నిప్పు కణికలా పైకి లేస్తున్నాడు. ”హ్యాపీ బర్త్‌డే టూయూ హ్యాపీ బర్త్‌డే టూయూ వివేకా” అనే బర్త్‌డే సాంగ్‌ చెవిన పడడంతో తన గదిలో గాఢనిద్రలో వున్న స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(67) ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఎవరూ లేరు… అంతా చీకటిగా వుంది. వివేకా కొంచెం ఆదుర్ధాగా… ఏయ్‌… ఎవరు మీరు, దమ్ముంటే ముందుకు రండి, చీకట్లో దాగి నన్ను ఆట పట్టించడం కాదు, అని అన్నాడు. అప్పుడు ఒక చేయి నేరుగా అతని కళ్ళకున్న నల్లకళ్ళద్దాలను తీసి పక్కన పెట్టింది. అంతే ఒక్కసారిగా అక్కడంతా వెలుగు. వివేకాకు అప్పుడు గుర్తొచ్చింది, రాత్రి తాను పడుకునే ముందు కళ్ళకున్న నల్లకళ్లద్దాలు తీసే యడం మరచిపోయానని. ఎదురుగా చూసాడు. రంభ, ఊర్వశి, మేనకలతో పాటు లేటెస్ట్‌గా భూలోకం నుండి వెళ్లిన శ్రీదేవి, ఆర్తీఅగర్వాల్‌లు కూడా వున్నారు. వాళ్లంతా చేతుల్లో పూలబొకేలు పట్టు కుని వున్నారు. ఏంటి విషయం అని వివేకా అడిగాడు. ఈరోజు మీ బర్త్‌డే సార్‌… విషెస్‌ చెప్పడానికి వచ్చాం. మీరు త్వరగా రెడీ అయ్యి ‘ఇంద్రలోక్‌ హాల్‌’కు వచ్చేయండి. అక్కడ చిన్న ఫంక్షన్‌ వుంది, అందరూ మీ కోసం వెయిటింగ్‌ అని చెప్పి పూలబొకేలు ఆయన చేతిలో పెట్టి వెళ్లిపోయారు. వివేకా బాత్‌రూంకు పోదామనుకుని రాజు అని కేకేసాడు. ఒక్క సెకన్‌కు మళ్ళీ ఆయనకు గుర్తొచ్చింది… ఇది భూలోకం కాదని, స్వర్గలోకమని… పిఏ రాజు అక్కడ వుండడని. వివేకా లేచి బాత్‌రూంకెళ్లి స్నానం చేసి నల్ల కళ్లద్దాలు, నల్లసూటు, నల్లబూట్లు వేసు కుని నీట్‌గా ముస్తాబై ‘ఇంద్రలోక్‌ కన్వెన్షన్‌ హాల్‌’కు వచ్చాడు. అక్కడ ఇంద్రుడితో పాటు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, సావిత్రి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలు వున్నారు. వివేకాను వారంతా ఘనంగా ఆహ్వానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వివేకా చేత 67 కిలోల బర్త్‌డే కేక్‌ను కట్‌ చేయించారు. తర్వాత అందరి కోరిక మేరకు వివేకా ‘గున్నా గున్నా మామిడి’ అనే పాటకు రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి డ్యాన్స్‌ ఇరగదీసాడు. ఆ తర్వాత అందరూ కూర్చుని మాటలు పెట్టుకు న్నారు. ఇంద్రుడు వుండి… ఈమధ్య భూలోకంలో ఇక్కడికి వచ్చిన వారి బయోపిక్‌లు తీస్తున్నారంట కదా, అది మంచి వ్యాపారంగా వుంది. ఈమధ్యే ‘సావిత్రి’ జీవితం మీద ‘మహానటి’ తీసారు. అది సక్సెస్‌ అయ్యింది అని చెబుతుండగా వివేకా వుండి… దేవేంద్రా, నేను సావిత్రి గారి అభిమానిని, ఒకసారి ఇక్కడ కూడా ఆ సినిమా ప్రదర్శించే ఏర్పాటు చెయ్యకూడదూ అని కోరాడు. అందుకు దేవేంద్రుడు… త్వరలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు ఎన్‌టిఆర్‌’, వై.యస్‌.రాజశేఖరరెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’లు కూడా రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు కలిపి ఒకేరోజు ప్రదర్శిద్దాంలే అని చెప్పి… మళ్ళీ ఆయనే… ఇంతకీ వివేకా, నీ బయోపిక్‌ కూడా తీస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. అందుకు వివేకా… నా బయో పిక్‌ తీయాలంటే చాలా కష్టం సార్‌ అని అన్నాడు. ఎందుకు కష్టం అని దేవేంద్రుడే అడిగాడు. దానికి వివేకా… మనిషిని పోలిన మనుషులు ఈ భూమ్మీద ఏడు గురు వుంటారంటారు… కాని నన్ను పోలీన మనిషి మాత్రం ఇంకెవరూ వుండరు. నా బయోపిక్‌ అంటే నవ రసాలు పోషించాలి, ఇందులో శృంగార శాస్త్రం ఎక్కువుగా వుంటుంది. గోడలు దూకాలి, స్కూటర్‌లపై రౌండ్లు కొట్టాలి, వరుసపెట్టి సిగరెట్లు కాల్చాలి… ముఖ్యంగా చాలామంది హీరోయిన్‌లను పెట్టాల్సి వుంటుంది. దీనికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే నా బయోపిక్‌ తీసేందుకు ఎవరూ సాహసం చేయరు… అని చెప్పాడు. అంతలో ‘నారాయణ నారాయణ’ అనుకుంటూ అక్కడకు నారదుడు వచ్చాడు. ఏం నారద ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డావని దేవేం ద్రుడు అడిగాడు. మా మిత్రుడు వివేకా బర్త్‌డే అని తెలిసింది. శుభాకాంక్షలు చెప్పి పోదామని వచ్చాను అని నారదుడు చెప్పి… అందరూ ఇక్కడే వున్నారు, టీవీ ఆన్‌ చేయలేదా అని అడిగాడు. ఈరోజు ప్రోగ్రామ్‌ ఏముందని దేవేంద్రుడు అడిగాడు. అందుకు నారదుడు… మన ఎన్టీఆర్‌పై ఆయన కొడుకు బాలకృష్ణ తీసిన బయోపిక్‌ టీజర్‌ విడుదల లైవ్‌ ఇస్తున్నారు కదా అని చెప్పాడు. అప్పుడు అందరూ టీవీ ముందు కూర్చున్నారు. ఇంద్రుడు టివి ఆన్‌ చేసి జెమిని ఛానెల్‌ పెట్టాడు. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ టీజర్‌ విడు దల లైవ్‌… బాలకృష్ణ వేదికమీదున్నాడు. దగ్గుపాటి పురంధరేశ్వరి, కళ్యాణ్‌రామ్‌, రాణా, మోహన్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌… ఇలా ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడిపోతున్నారు. ఆ లైవ్‌ చూస్తూ ఎన్టీఆర్‌ పక్కనున్న వై.యస్‌., ఏఎన్‌ఆర్‌ లతో… మా బాలయ్య ఈ సినిమాను బాగానే తీసుంటాడు… క్లైమాక్స్‌లో నా అల్లుడు చంద్రబాబు నాకు వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలను బాగానే పెట్టి వుంటాడు… ఈ సినిమా చూసాక చంద్ర బాబు అసలు రూపం బయటపడుతుంది అని చెప్పాడు. అంతలో లైవ్‌షోలో వేదిక మీదున్న బాలకృష్ణ… ఈ సినిమాలో కీలకపాత్రధారికి మూలం మా బావ గారైన నారా చంద్రబాబునాయుడు గారు టీజర్‌ విడుదల చేస్తారని చెప్పాడు. లైవ్‌లో ఆ మాట వినడంతోనే ఎన్టీఆర్‌ ఒక్కసారిగా మళ్ళీ పొడిచార్రా అంటూ స్పృహతప్పి పడిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here