Home సంపాదకీయం విఫల ప్రయోగాలు!

విఫల ప్రయోగాలు!

భారత రాజకీయ చరిత్రలో రెండు విభిన్న మార్గాలుంటాయి. ఈ దేశంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా మనుగడ సాగిస్తుంటాయి. అయితే ఆ పార్టీల ఆలోచనాధోరణులు వేర్వేరుగా వుంటాయి. జాతీయ పార్టీల విధాన నిర్ణయాలు సువిశాల జాతి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రాంతీయపార్టీల ఆచరణ, ఆలోచన అంతా కూడా తమ రాష్ట్రం, తమ ప్రాంతం, తమ బాషా అనే పరిధికే లోబడి వుంటుంది. ప్రాంతీయ ఆలోచనలు, ప్రాంతీయ సంకుచిత భావాలు, ప్రాంతీయ భాషాభిమానం వున్న నేతలు జాతీయ స్థాయిలో అధికారం చేపడితే, వాళ్ళు వాళ్ల ప్రాంతాల అభివృద్ధికి చూపించినంత శ్రద్ధ, దేశ ప్రయోజనాలపై చూపించరు.

దేశ రాజకీయ చరిత్రలో ‘కూటమి’ అన్నది ఒక విఫల ప్రయోగం. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయి. 1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ జనతా కూటమి అధికారం లోకొచ్చిన రెండోయేడాదే కుప్పకూలింది. 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ను చూసాము. అది కూడా పట్టుమని రెండేళ్ళు నిలవలేదు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ బ్రతుకూ రెండేళ్ళే! 1998లో వాజ్‌పేయి నాయకత్వాన ఏర్పడ్డ ఎన్డీఏ మనుగడ కూడా 13నెలలే! 1996లో పి.వి.నరసింహారావు, 1999లో వాజ్‌పేయి, 2004 నుండి 2014వరకు మన్మోహన్‌సింగ్‌లు మాత్రమే పూర్తికాలం సంకీర్ణ ప్రభుత్వాలను నెట్టుకు రాగలి గారు. అయితే పూర్తికాలం నడిచిన ఈ ప్రభుత్వాలకు కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలే నేతృత్వం వహించడం గమనార్హం.

ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేక కూటమి నిర్మాణమంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దేశాలు పట్టి తిరుగుతున్నాడు. అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నాడు. చివరకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధపడ్డాడు. దేశంలో ఎన్డీఏ, యూపిఏ కూటములు ఎప్పటినుండో ఉన్నాయి. దేశంలో ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడం ఇక అసంభవం అన్నది ఎప్పుడో అర్ధమైంది. అందుకే జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు తమ సిద్ధాంతాలకు దగ్గరగా వున్న పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కూటములు కట్టాయి. బీజేపీ వాళ్ళు ఎన్డీఏ అని పెట్టుకుంటే, కాంగ్రెస్‌ యూపిఏ అని పెట్టుకుంది. ఈ రెండు కూటములలో కూడా పెద్ద పార్టీలను ఇబ్బంది పెట్టే పార్టీలేవీ లేకపోవడంతో వీటి సంకీర్ణ పాలన సవ్యంగానే నడిచింది.

ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి ఒకే వేదికపైకి తెస్తానంటూ చంద్రబాబు చేస్తున్న దండగ ప్రయత్నం ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం జాతీయ రాజకీయాలలో తాను కూడా చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడానికి తప్పితే రెండో ఉపయోగం కనిపించడం లేదు. ఈయన మద్దతు కూడగడుతున్నానని తిరుగుతున్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్‌తో కలిసే వున్నాయి. కర్నాటకలో జేడిఎస్‌, కాంగ్రెస్‌ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య స్నేహం 15ఏళ్ల క్రిందట నుండే వుంది. తమిళనాడులో డిఎంకె వుండేది యూపిఏలోనే! రేపు అవసరం, అవకాశాన్ని బట్టి డిఎంకె ఎన్డీఏతో కలిసినా కలవొచ్చు. యూపిలో కాంగ్రెస్‌, ఎస్పీ, బిఎస్పీ కలిసి ఇటీవలే ఉపఎన్నికల్లో పోటీ చేసాయి. వీళ్ళను కొత్తగా కలపాల్సిన పనిలేదు. ఇక వామపక్షాలు అన్నవి సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం కాబట్టి అవసరాన్ని బట్టి కాంగ్రెస్‌తోనే కలుస్తుంటాయి. దేశంలో ప్రతి జాతీయ, ప్రాంతీయపార్టీ అటు ఎన్డీఏలోనో, ఇటు యూపిఏలోనో వుంది. తటస్థులుగా వున్న కొన్ని పార్టీలు ఇప్పటికిప్పుడు ఏ కూటమిలో కూడా చేరబోవు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న ఈ గోలంతా కూడా తన కోసమేకాని, ఇంకే విధంగానూ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోదు.

దేశ ప్రయోజనాల కోసమే మోడీని దించాలనుకుంటున్నాం… ఇదే మోడీ ప్రత్యర్థుల ట్యాగ్‌లైన్‌. మోడీ ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో దేశ ప్రయోజనాలు ఏఏ రూపాలలో దెబ్బతిన్నాయి? వీళ్ళు చూపించే మొదటి కారణం నోట్ల రద్దు. మరి పెద్దనోట్లను రద్దు చేయమని నరేంద్ర మోడీకి సలహా ఇచ్చిందే చంద్రబాబు కదా! నోట్ల రద్దు కమిటీకి ఆయనే ఛైర్మెన్‌ కూడా! అలాంట ప్పుడు నోట్ల రద్దు వల్ల వచ్చే వైఫల్యంలో చంద్రబాబుకీ వాటా వున్నట్లే! మరి ఇక ఆయన దేశ ప్రయోజనం గురించి ఆలోచించేదెక్కడ? ఇక రెండో కారణం జిఎస్టీ. ఈ బిల్లు కాంగ్రెస్‌ హయాంలోనే రూపొందింది. మోడీ పార్లమెంటులో ఆమోదింపజేశాడు. కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. మరి ఆ బిల్లు జాతి ప్రయోజనాలను దెబ్బతీసేటట్లుంటే వీళ్ళంతా ఎందుకు మద్దతు తెలిపినట్లు?

ఈ కూటమిలో ఏ నాయకుడి చరిత్ర కూడా ఘనంగా లేదు. మాయావతి మీద అవినీతి కేసులున్నాయి, పశు దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్‌యాదవ్‌ జైల్లో ఉన్నాడు, దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే ప్రాంతీయ పక్షపాతం చూపాడు, శరద్‌పవార్‌పై మహారాష్ట్రలో అవినీతి ఆరోపణలున్నాయి, ఇక చంద్రబాబుపై ఆరోపణల సంగతి సరేసరి! వీళ్ళలో ఎవరూ కూడా మోడీని మించినవాళ్ళు కాదు.! జాతి ప్రయోజనాల కోసమో, జాతీయ ప్రయోజనాల కోసమో వీళ్ళు కూటమి కట్టడం లేదు. కేంద్రంలో ఫలానా స్కాంలు జరిగాయనే కారణంతో కూడా మోడీని దించాలను కోవడం లేదు. ఇక దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే గత యూపిఏ కంటే మోడీ ప్రభుత్వమే దేశ ప్రతిష్టను పెంచింది. దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు లేని మోడీని ఓడించాలని వీరు చేసే కూటమి కుట్రల వెనుక సొంత ప్రయోజనాలు తప్పితే జాతి ప్రయోజనాలు, దేశ క్షేమం వంటి ఆలోచనలేవీ లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here