Home జిల్లా వార్తలు విఆర్‌ విద్యాసంస్థల ఓటర్లారా తస్మాత్‌ జాగ్రత్త! దొంగ దొంగ అంటూ గజదొంగ వస్తున్నాడు

విఆర్‌ విద్యాసంస్థల ఓటర్లారా తస్మాత్‌ జాగ్రత్త! దొంగ దొంగ అంటూ గజదొంగ వస్తున్నాడు

కొందరు పూర్వ విద్యార్థుల పోరాట ఫలితంగా నెల్లూరులోని చారిత్రాత్మక విఆర్‌ విద్యా సంస్థల పాలకవర్గం ఎన్నిక చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం, కొత్త పాలకవర్గం ఎంపికకు మార్గం సుగమం కావడం తెలిసిందే! విఆర్‌ విద్యాసంస్థలను కాపాడు కునే లక్ష్యంతో కొందరు ప్రముఖులు, పూర్వవిద్యార్థులు, విద్యార్థి పోరాటాలలో పాల్గొన్న మేధావులు నడుం కట్టడం అభినంద నీయమే! విఆర్‌ విద్యాసంస్థల ప్రత్యేకాధికారిగా వున్న జాయింట్‌ కలెక్టర్‌ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో విఆర్‌ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ఓట్ల నమోదు ప్రక్రియ వేగం పుంజుకుంది. బీజేపీ, వామపక్ష అనుబంధ సంఘాల నాయకుల నేతృత్వంలో పాలక వర్గం ఎన్నికలలో పోటీ చేయడానికి ప్యానెల్‌లు కూడా ఏర్పడ్డాయి. వీళ్ళే కాకుండా నిన్నటివరకు విఆర్‌ సంస్థలపై పెత్తనం సాగించిన ఆనం గ్రూపు కూడా తిరిగి విఆర్‌పై తమ ఆధిపత్యం నిలబెట్టు కునేందుకు ఓట్ల నమోదులో చురుకుగా వ్యవహరిస్తోంది.

అయితే జింకల మందలోకి తోడేలు దూరినట్లు విఆర్‌ విద్యాసంస్థలను కాపాడుకోవడానికి ఉన్నతాశయాలతో నడుం కట్టిన విఆర్‌ పూర్వవిద్యార్థుల బృందంలోకి తోడేళ్ళ వంటి వాళ్ళు దూరుతున్నారు. వీళ్ళు గత పాలకకమిటి సభ్యులను ‘దొంగ దొంగ’ అని అరుస్తూ ఓ గజదొంగ మీ ముందుకు వస్తున్నాడు. పూర్వవిద్యార్థుల ముసుగులో పాలకవర్గంలోకి చొరబడాలని ఈ గజదొంగ పన్నాగం పన్నాడు. ఇందుకోసం పూర్వవిద్యార్థులలో పేరు, ప్రతిష్టలు వున్న వ్యక్తులతో జత కట్టాడు. తన స్వార్ధం కోసం వారి ఇమేజ్‌ను వాడుకుంటున్నాడు. సొసైటీల పేరుతో ప్రభుత్వం నుండి తీసుకున్న స్థలాలనే అమ్మేసిన ఈ ఘనుడికి విఆర్‌ విద్యాసంస్థల ఆస్తులను అమ్మేయడం పెద్ద లెక్కకాదు. కాబట్టి పూర్వవిద్యార్థులు జాగ్రత్తపడాలి. విఆర్‌ విద్యాసంస్థలు భద్రంగా వుండాలంటే ఇలాంటి వారి నీడ పడకుండా చూడాలి! అప్పుడే గత పాలకవర్గంపై పూర్వవిద్యార్థులు చేసిన న్యాయ పోరాటానికి ఫలితం వుంటుంది. అలాకాకుండా గత పాలకవర్గం చేతుల్లో నుండి విడిపించిన విద్యాసంస్థలను ఇలాంటి గజదొంగ చేతుల్లో పెడితే… విఆర్‌ విద్యాసంస్థల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లే అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here