Home గల్పిక వాణిశ్రీని వివేకా గ్యాంగ్‌ నుండి కాపాడిన సోమిరెడ్డి

వాణిశ్రీని వివేకా గ్యాంగ్‌ నుండి కాపాడిన సోమిరెడ్డి

దాదాపు 40ఏళ్ళ క్రితం… అపర చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జీన్స్‌ఫ్యాంట్‌ టీషర్ట్‌ వేసి, కాళ్ళకు బూట్లు తగిలించి బుల్లెట్‌ బైక్‌ స్టార్ట్‌ చేసాడు. రేయ్‌, ఎక్కడికిరా సోగ్గాడిలా బయలు దేరావ్‌ అనే కేక వినిపించింది. సోమిరెడ్డి భయంతో అటువైపు చూసాడు. ఆయన తండ్రి సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి అక్కడ వున్నాడు. చంద్రమోహన్‌రెడ్డి బుల్లెట్‌ దిగి చేతులు కట్టుకుని… నాన్నగారు కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పాడు. వెంటనే ఆయన ఆదివారం పూట నీకు చదువు చెప్పే ఆ సన్నాసెవడ్రా… నువ్వు కాలేజీ ఉన్న రోజుల్లోనే సక్రమంగా పోవు, ఆదివారం కాలేజీకి అని బయలు దేరావంటే ఏంటో కథ వుందే అని రాజగోపాలరెడ్డి అడి గాడు. చంద్రమోహన్‌రెడ్డి మనసులో… ఈ పెద్దలున్నారే! ఎప్పటికీ మా చిన్న పిల్లల మనసులు అర్ధం చేసుకోరు… అని బాధపడుతూ… ఏం లేదు నాన్నగారు. మన అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్‌నగర్‌ సినిమా రిలీజ్‌ అయ్యిం దంట… అలా కాలేజీ దాకా వెళ్ళి మా ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసొద్దామని అని నసుగుతూ చెప్పాడు. అందుకు రాజగోపాలరెడ్డి… సినిమాల మీదున్న శ్రద్ధ చదువు మీద చూపిస్తే ఏ కలెక్టరో, ఎస్పీవో అవుతావు అని చెప్పాడు. అప్పుడు సోమిరెడ్డి ధైర్యంగా… నాన్న మీరొక లాజిక్కు మిస్సవుతున్నారు అని అన్నాడు. ఏంటది అని రాజగోపాలరెడ్డి అడిగాడు. చదువుకుంటే కలెక్టర్‌, ఎస్పీలు కావొ చ్చేమో, చదువుకోకుండా ఇలా సిని మాలు, షికార్లకు తిరిగితే అదే కలెక్టర్‌, ఎస్పీల చేత సెల్యూట్‌ కొట్టించుకోవచ్చు అని చెప్పాడు. చంద్రమోహన్‌రెడ్డి చెప్పిన లాజిక్‌కు రాజగోపాలరెడ్డికి తల తిరిగి నంత పనైంది. ఈ లాజిక్‌ ఎలా సాధ్యంరా అని ఆయన అడిగాడు. రాజకీయాలకు వున్న పవర్‌ అదే డాడీ… భవిష్యత్‌లో మీరే చూస్తారు అంటూ బుల్లెట్‌ స్టార్ట్‌ చేసి రయ్‌న నెల్లూరులోకి వచ్చేసాడు. శ్రీనివాసమహల్‌ వద్ద బండి పెట్టేసి హాల్‌లోకెళ్లి కూర్చున్నాడు. ఆయన వెంట మరో పదిమంది దాకా చైన్‌ బ్యాచ్‌ స్టూడెంట్స్‌ కూడా వున్నారు. సినిమా మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీల మధ్య ప్రేమ సన్నివేశాలు, పాటలు వస్తున్నప్పుడల్లా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మెలికలు తిరిగిపో సాగాడు. పాటల్లో వాణిశ్రీని చూస్తుంటే ఆయనకు గుండెను చెరుకు మిషన్‌లో పిండేసినట్లుగా అనిపించసాగింది. అలా సినిమా చూస్తూ… చూస్తూ… సినిమాలో అక్కినేని స్థానంలో తనను ఊహించు కుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

్య్య్య్య్య

అది విఆర్‌ కాలేజీ… ఓ ఆరుమంది విద్యార్థినులు హాఫ్‌శారీలతో, చంకలో పుస్తకాలు పట్టుకుని ముచ్చట్లాడుకుంటూ పకపక నవ్వుతూ వస్తున్నారు. ఆ ఆరు గురిలో అందాల భామ వాణిశ్రీ కూడా వుంది. కాలేజీ బయటే ఓ నలుగురు కుర్రాళ్లున్నారు. ఆ గ్యాంగ్‌కు లీడర్‌ అన్నట్లుగా కళ్ళకు నల్లద్దాలు పెట్టి, నల్ల టీషర్ట్‌, నల్ల జీన్స్‌, నల్లబూట్లు వేసుకుని నోట్లో సిగరెట్‌తో ఓ కుర్రాడున్నాడు. ఆ నలుగురిలో ఒకడు వాణిశ్రీ వద్దకు వెళ్ళి… ఏయ్‌ అమ్మాయ్‌, మా అన్న పిలుస్తున్నాడు రా అని అన్నాడు. ఎవరికి అన్న, ఎవరా అన్న అని వాణిశ్రీ అడిగింది. మా అన్నే తెలియదా…? ఈ నెల్లూరుకే అన్న, సింహపురి యువకిశోరం మా ఆనం వివేకన్న తెలియదా… ఈ కాలేజీకే కింగ్‌… ఆయన తలచుకుంటే ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే… అని అన్నాడు. అందుకు వాణిశ్రీ ఏం అందరికీ కాళ్ళు అడ్డం పెడుతుంటాడా అని వెటకారంగా అడిగింది. అందుకు ఆ కుర్రాడు… ఏ పిల్లా… అన్న పవర్‌ తెలియకుండా మాట్లాడుతున్నావ్‌, ఆయన తలచుకుంటే నిన్ను ఈ కాలేజీ నుండే పంపించేయగలడు… మర్యాదగా ఆయ నకు క్షమాపణ చెప్పు… అని గర్జించాడు. అప్పుడే అక్కడ… ఏంట్రా చెప్పేది, ఎవరి కిరా చెప్పేది అన్న మాటలు వినిపిం చాయి. వివేకా గ్యాంగ్‌ అటు వైపు చూసింది. బుల్లెట్‌ బైక్‌ మీద సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి… ఆ కుర్రాడిని చూడ గానే వాణిశ్రీతో పాటు మిగతా అమ్మా యిలలో ఎక్కడలేని ఆనందం… ధైర్యం… చంద్రమోహన్‌రెడ్డిని చూడగానే అప్పటి దాకా సీన్‌లోకి రాని వివేకా ఎంట రయ్యాడు. చంద్రమోహన్‌ ఇది నా అడ్డా… ఇక్కడ నేను చేసిందే శాసనం, వేసిందే ఆసనం… ఇదొక టైప్‌ ఆఫ్‌ ర్యాగింగ్‌… వాళ్ళను మేమేం హింస పెట్టంలే, నువ్వెళ్లి పని చూసుకోపో అని అన్నాడు. ఆపదలో వున్న ఆడపిల్లలను ఒంటరిగా వదిలిపోవడానికి నేనేమన్నా చేతగాని చవటననుకున్నారా…. అడవిలో పులిని అని చంద్రమోహన్‌రెడ్డి డైలాగ్‌ విసిరాడు. అందుకు వివేకా… ఒంటిమీద గట్టిగా ఒకటిన్నర కేజీ కండ, రెండున్నర కేజీల ఎముకలు లేవు… ఏం చూసుకుని నీకు ధైర్యం అని అన్నాడు. అప్పుడు సోమిరెడ్డి… వివేకా చూడాల్సింది కండ బరువును కాదు, గుండె ధైర్యాన్ని, నా గురించి అడవిలో సింహాన్ని అడుగు, నీటిలో మొసలిని అడుగు, సముద్రంలో షార్క్‌ను అడుగు… చెబుతాయ్‌… నాకు కష్టం వస్తే భరిస్తానేమో గాని, ఈ నెల్లూరులో ఏ ఆడపిల్లకు కష్టమొచ్చినా… ఆరు కిలోమీటర్ల దూరంలో నేనున్నా అరక్షణంలో వారి ముందుంటా… అని డైలాగ్‌ విసిరాడు. ఇక లాభం లేదన్నా అంటూ వివేకా గ్యాంగ్‌లో ఒకడు చంద్ర మోహన్‌రెడ్డిని కొట్టడానికి వేగంగా వచ్చి కొట్టబోయాడు. మెరుపు క్షణంలో సోమిరెడ్డి పిడికిలి బిగించి వాడి కడుపులో కొట్టాడు… అంతే అతను నిలువునా రోడ్డు మీదపడిపోయాడు. అదిచూసి ఇంకొ కడు పెద్దబండరాయిని ఎత్తుకుని పరు గెత్తుకుంటూ వచ్చి చంద్రమోహన్‌రెడ్డి మీద విసిరాడు. తనపైకి వస్తున్న రాయిని చంద్రమోహన్‌రెడ్డి పిడికిలి బిగించి ఒక గుద్దు గుద్దాడు. అంత పెద్ద బండరాయి పిండి పిండయ్యింది. ఇలా లాభం లేదను కుని మూడోవాడు బొడ్లో పెట్టుకుని వున్న రివాల్వర్‌ తీసి చంద్రమోహన్‌రెడ్డి వైపు గురిచూసి పేల్చాడు. బుల్లెట్‌ ఆయన వైపు దూసుకువస్తుంది. చంద్రమోహన్‌రెడ్డి చాకచక్యంగా ఆ బుల్లెట్‌ను తన పళ్ళతో పట్టేసాడు. ఆ బుల్లెట్‌ను నోట్లోనే డైవర్షన్‌ మార్చి… రివాల్వ్‌ర్‌తో కాల్చిన కుర్రాడి వైపే ఉఫ్‌.. అంటూ బలంగా వూదాడు. బుల్లెట్‌ ఆ కుర్రాడివైపు దూసుకుపో సాగింది. ప్రాణ భయంతో ఆ కుర్రాడు పరుగులు పెట్టసాగాడు. ఈలోపు వివేకా… సారీ బ్రదర్‌, నువ్వు వాణిశ్రీని ప్రేమిస్తున్నావని తెలిసింది… కాని నువ్వు ఆమెతో మనసులోని మాటను చెప్పలేక పోతున్నావ్‌, రోజూ బైక్‌ మీద ఇక్కడ కాపుకాయడం, చూసి వెళ్లడం… ఏం లాభం! నీ ప్రేమను సక్సెస్‌ చేయాలనే ఈరోజు ఈ స్కెచ్‌ వేసాను. నీ ఫైటింగ్‌కు ఖచ్చితంగా వాణిశ్రీ ఫ్లాట్‌ అయ్యుం టుంది… అంటూ చల్లగా సోమిరెడ్డి చెవిలో చెప్పి వివేకా అక్కడనుండి కదిలాడు.

దూరంగా ఇదంతా చూస్తున్న వాణిశ్రీ అల్లరి మూకల నుండి తనను కాపాడిన చంద్రమోహన్‌రెడ్డి వైపు చూసింది. చంద్రమోహన్‌రెడ్డి కూడా ఆమె కళ్లల్లోకి చూసాడు. ఆమె చిర్నవ్వు నవ్వింది. చంద్రమోహన్‌ కూడా నవ్వాడు. ఆమె అరచేతిలోని రెండు వేళ్ళు చంద్ర మోహన్‌ వైపు చూపిస్తూ తుపాకీతో కాల్చినట్లుగా కాల్చింది. చంద్రమోహన్‌రెడ్డి గుండె వద్ద చేయి అదిమి పెట్టుకుని పడిపోయాడు. ఆ పడిపోవడం పడి పోవడం ‘అబ్బా’ అని కేకేసాడు.

సీన్‌ కట్‌ చేస్తే.. సోమిరెడ్డి నెల్లూరు లోని కస్తూర్భాకళాక్షేత్రంలో కుర్చీలోనుండి క్రింద పడివున్నాడు. సౌత్‌ఇండియా సినీ కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో ‘ప్రేమ్‌నగర్‌’ సినిమా చూసి వాణిశ్రీని ప్రేమించినట్లు చెప్పాడు. ఆ తర్వాత మంత్రి నారాయణ ప్రసం గించేటప్పుడు స్టేజీ మీదే ‘ప్రేమ్‌నగర్‌’ సినిమా నాటి సంగతులను గుర్తుచేసు కుంటూ నిద్రలోకి జారుకున్నాడు సోమిరెడ్డి. పైన జరిగిందంతా ఆ నిద్రలో వచ్చిన కలే అని తెలుసుకోవడానికి ఆయనకు అరగంట పట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here