Home జిల్లా వార్తలు లోక్ సభ అభ్యర్థులే.. గెలుపోటముల నిర్ణేతలు

లోక్ సభ అభ్యర్థులే.. గెలుపోటముల నిర్ణేతలు

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి. 1999 ఎణ్నికల నాటి నుండి కూడా ఇదే జరుగుతోంది. అంతకుముందు పదేళ్ళ క్రితం 1989లో లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1999, 2004, 2009, 2014… వరుసగా నాలుగుసార్లు మనకు కంబైన్డ్‌ ఎన్నికలే! లోక్‌సభ స్థానాలకంటే కూడా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ లేదా జాతీయ పార్టీలకైనా అధికారం దక్కాలంటే అసెంబ్లీ స్థానాలే ముఖ్యం. అయితే అసెంబ్లీ స్థానాలలో గెలుపోటములను లోక్‌సభ అభ్యర్థులు కొంతవరకు ప్రభావితం చేస్తున్న పరిస్థితులు గత కొన్నేళ్ళుగా మనకు కనిపిస్తున్నాయి.

1999 ఎన్నికల్లో వాజ్‌పేయి సానుభూతి పుణ్యాన గెలుపును వూహించని వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో లోక్‌సభ అభ్యర్థులుగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుండి ఎంపీ అభ్యర్థిలుగా జగత్‌జెట్టీలనే దించారు. 2004లో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత, 2009 ఎన్నికల్లో వైయస్‌ పరిపాలనపై ప్రజాదరణ వెరసి కాంగ్రెస్‌కు అత్యధిక లోక్‌సభ సీట్లను కట్టబెట్టేలా చేసింది. 2014 ఎన్నికలకొచ్చేసరికి సీన్‌ కొంత మారింది. ఎంపీ అభ్యర్థులుగా డబ్బున్నవాళ్ళకే ఇరు పార్టీలు ఎక్కువుగా అవకాశం కల్పించాయి. తెలుగుదేశంకు స్వతహాగానే కాంట్రాక్టర్‌లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎక్కువమంది సానుభూతిపరులు వుండబట్టి, ఎంపీ అభ్యర్థులుగా వారిని బరిలో దింపడం సులువైంది. ఈ విషయంలో వైసిపి కొంత వెనుకబడింది. లోక్‌సభ అభ్యర్థి అంటే కనీసఖర్చు 50నుండి వంద కోట్లు అన్న స్థాయికి పోయింది. ఈ ఖర్చును సాధారణ ప్రజానాయకులు భరించలేరు. కాబట్టే రిజర్వ్‌డ్‌సీట్లలో తప్పితే జనరల్‌ ఎంపీ సీట్లలో కనీసం వందకోట్లు ఖర్చుపెట్టగల సామర్ధ్యం వున్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. ఆయా లోక్‌సభల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు సైతం దండిగా డబ్బులు వెదజల్లగలిగేవారినే అభ్యర్థులుగా కోరుకుంటున్నారు. ఆర్ధికంగా ఎంపి అభ్యర్థి గట్టోడైతేనే అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఊపొస్తుంది. 2014 ఎన్నికలలో వైసిపి సరైన ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది. దాని ఫలితంగానే ప్రకాశం జిల్లా దాటాక అరకు తప్పితే ఇంకే ఎంపీ సీటును కూడా వైసిపి గెలుచుకోలేకపోయింది. ఆటోమేటిక్‌గా దీని ప్రభావం అసెంబ్లీలపై పడి ఆ విధంగా కూడా సీట్లు తగ్గిపోవడం చూసాం.

గట్టి ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే వైసిపి ఇప్పటికి కూడా వెనుకబడే వుందని చెప్పొచ్చు. ఈ విషయంలో తెలుగుదేశం బలంగా వుంది. ఒక్కో సీటులో వంద నుండి రెండొందల కోట్లు ఖర్చుపెట్టగల ఆర్ధిక బలవంతులు అక్కడ వున్నారు. ఈ నాలుగున్న రేళ్ళలో వందలకోట్లు సంపాదించిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల గుంపు అక్కడే వుంది. ఆర్ధికంగా శక్తిమంతులైన ఎంపీ అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా అసెంబ్లీలలోనూ పైచేయి సాధించాలన్నది చంద్రబాబు వ్యూహం. అది ఫలితాన్నిస్తుంది కూడా! వైసిపి వైపు నుండి కూడా ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈ స్థాయిలో పోటీపడితేనే అసెంబ్లీలలో సైతం అనుకూల ఫలితాలను సాధించడానికి అవకాశముంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here