Home జిల్లా వార్తలు లోక్‌సభ వద్దు.. అసెంబ్లీనే ముద్దు

లోక్‌సభ వద్దు.. అసెంబ్లీనే ముద్దు

నెల్లూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని వెదకడం తెలుగుదేశం అధిష్టానానికి పెద్ద పనిగా మారింది. 1985 నుండి ఈ లోక్‌సభ ట్రాక్‌ రికార్డు చూస్తే ఏ నాయకుడికైనా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుండి పోటీ చేయాలంటే భయమే! ఇప్పటివరకు 9సార్లు నెల్లూరు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు గెలిచింది రెండంటే రెండు సార్లే! ఆ రికార్డును చూసే లోక్‌సభ పోటీకి నాయకులు వెనక్కుతగ్గుతున్నారు.

2014 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూపంలో తెలుగుదేశంకు మంచి అభ్యర్థే దొరికాడు. ఆయన గెలుపు అంచులదాకా వచ్చి ఓడిపోయాడు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయన లోక్‌సభ నుండి పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ కంటే ఏదో ఒక అసెంబ్లీ నుండి పోటీ చేయడానికే ఆయన ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆదాల అసెంబ్లీ వైపు మొగ్గుచూపితే ఇక లోక్‌సభ అభ్యర్థి ఎవరు? 2012 ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీద మస్తాన్‌రావు కూడా లోక్‌సభ వైపు చూడడం లేదు. ఆయన మనసు రాజ్యసభ వైపు లాగుతోంది. ఇక తప్పదనుకుంటే కావలి అసెంబ్లీ నుండి పోటీచేసే అవకాశముంది. వున్నవారిలో నెల్లూరు లోక్‌సభకు సరైన అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి. కాని ఆయన లోక్‌సభకు వెళతాడా? అసలు టీడీపీలోనే వుంటాడా? అన్నది అనుమానం. ఉండే గట్టినాయకులలో సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి కూడా అసెంబ్లీకే పోవాలనుకుంటాడు గాని లోక్‌సభకు మొగ్గుచూపడు. పార్టీలో వుండే ఇంకో ప్రతిపాదన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును ఒంగోలు లోక్‌సభకు పంపించి నెల్లూరు లోక్‌సభలో మాగుంట శ్రీనివాసులురెడ్డిని దించడం. ఇదే జరిగితే నెల్లూరు పార్లమెంటులో ఎప్పుడూ చూడని ఉత్కంఠ సమరాన్ని చూడగలం. మంత్రి పి.నారాయణ వుంటే నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయడం పార్టీకి కలిసిరాక పోవచ్చు. నెల్లూరు లోక్‌సభకు అందుబాటులో వున్న వీళ్ళలో ఒకరిని దించడమా… లేక ఇతర జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలను దిగుమతి చేయడమా? ఈ రెండు మార్గాలు టీడీపీ అధిష్టానం ముందున్నాయి. వాళ్ళు ఏ మార్గం ఎంచుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here