Home గల్పిక లోకేష్‌తో ప్రత్యేకహోదాకు లింకు

లోకేష్‌తో ప్రత్యేకహోదాకు లింకు

నూటపాతిక ప్రపంచ మేటి నగరా లను కలబోసి కట్టినట్లుగా వుండే అమరావతి నగరం అది. వెలగపూడిలోని సచివాలయంలో హైటెక్‌రత్న, ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అచ్చెన్నాయుడు, లోకేష్‌లు సమావేశమై వున్నారు. మంత్రి నారాయణ కొన్ని అసెంబ్లీ డిజైన్‌ కాపీలను చంద్ర బాబు ముందు పెట్టాడు. స్పీకర్‌ వుండి… ఇన్ని డిజైన్‌లను చూసి అసెంబ్లీని కట్టడం కష్టం. వీటిలో ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చకపోవచ్చు అని అన్నాడు. అంతలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చాడు. వాళ్ళందర్నీ చూసి ఏంటి సమస్య అని అడిగాడు. అసెంబ్లీ భవనానికి వీటిలో ఏ డిజైన్‌ కరెక్టో ఎంపిక చేయడం కష్టంగా వుందని స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌రావు చెప్పాడు. అప్పుడు జేసీ… కడతారో లేదో, మనం బ్రతికుండగా చూస్తామోలేదో తెలియని అసెంబ్లీ బిల్డింగ్‌ డిజైన్‌ ఎంపికకు ఇంత మీమాంస ఎందుకు, అసెంబ్లీకి ఏ డిజైన్‌ కరెక్టో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు, నువ్వెళ్లి నీ బుడ్డోడిని తీసుకురాపో లోకేసా అని అన్నాడు. ఆ మాటతో లోకేష్‌ వెంటనే ఇంటికి వెళ్ళి తన కొడుకు దేవాన్ష్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి అక్కడ వివిధ దేశాల ఇంజనీరింగ్‌ కంపెనీలు ఇచ్చిన అసెంబ్లీ డిజైన్‌ మ్యాప్‌లన్నింటిని పెద్ద డబ్బాలో వేసాడు. తర్వాత కల్లాకపటం తెలియని చిన్నారులు దేవుళ్ళతో సమానం, అందుకే ఈ బుడ్డోడిని తీసుకురమ్మన్నాను, ఇందులో నుండి ఒక కాగితం బయటకు తీరా బుడ్డోడా అని జేసీ ఆ డబ్బాను దేవాన్ష్‌ ముందు పెట్టాడు. దేవాన్ష్‌ అందులో చేయి పెట్టి ఒక మ్యాప్‌ తీసి తన తాత చంద్రబాబు చేతికిచ్చాడు. చంద్రబాబు దానిని తెరిచాడు. అంతే ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అద్భుతం… మహాద్భుతం… ఇలాంటి అపురూప భవన చిత్రాన్ని నేను ఇంత వరకు చూడలేదు. ఈ భవన డిజైన్‌ ఎంత సుందరంగా వుంది… ఇది గనుక మనం నిర్మిస్తే ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం ఇదే అవుతుంది అంటూ ఆ మ్యాప్‌ను అందరికీ చూపించాడు. అందరూ అది చూసి ‘సూపర్‌’ అన్నారు. జేసీ వుండి… భగవంతుడి ఎంపిక అలాగే వుంటుంది సార్‌ అన్నాడు. చంద్రబాబు నారాయణతో… ఇంత అద్భుతమైన డిజైన్‌ ఏ దేశానికి చెందిన కంపెనీ ఇచ్చింది, దీని క్రింద కేవలం సిఆర్‌పి కన్‌స్ట్రక్షన్స్‌ అని మాత్రమే వ్రాసివుంది… ఏ దేశమో పేరు లేదు, బహుశా జపాన్‌ లేదా అమెరికాలకు చెందిన కంపెనీయై వుండొచ్చు అని అడిగాడు. దానికి… నారాయణ, మీరేమీ అనుకోనంటే నిజం చెబుతాను సార్‌ అని రిక్వెస్ట్‌ చేసాడు. ఫర్వాలేదులే అప్పు డప్పుడు నిజాలు వినడం కూడా అల వాటు చేసుకోవాలిగా అని చంద్రబాబు చెప్పాడు. అప్పుడు నారాయణ… సిఆర్‌పి కన్‌స్ట్రక్షన్స్‌ అంటే చింతారెడ్డిపాలెం కన్‌స్ట్రక్షన్స్‌ అని… మా నారాయణ మెడికల్‌ కాలేజీ కట్టిన తాపీ మేస్త్రీ రాయప్ప చేతే ఈ డిజైన్‌ గీయించాను. మేస్త్రీ పేరు పెడితే మరీ చీప్‌గా వుంటుందని సిఆర్‌పి కన్‌స్ట్రక్షన్స్‌ అని పేరు వ్రాయించాను అని చెప్పాడు. చంద్రబాబు అందుకు… ఇది మన స్టేట్‌ వాళ్ళ డిజైన్‌ అంటే చీపై పోతాం, అందుకే సిఆర్‌పి కన్‌స్ట్రక్షన్స్‌, జపాన్‌ కంపెనీ డిజైన్‌ ఓకే అయ్యిందని మన పచ్చమీడియా ద్వారా లోకానికి చాటండంటూ చంద్రబాబు చెప్పాడు. సోమిరెడ్డి వుండి… అసెంబ్లీ డిజైన్‌ ఓకే అయ్యింది సార్‌… ఆ ప్రత్యేకహోదా మీద కూడా క్లారిటీ వస్తే మనం ఎన్నికల ప్రచారంలో దూకుడుగా పోవడానికి అవకాశముంటుందని చెప్పాడు. దానికి చంద్రబాబు ఇక ఉపేక్షించేది లేదు… కేంద్రంపై యుద్ధానికి దిగడమే అని వారికి తేల్చి చెప్పాడు. యుద్ధానికి మేము సిద్ధం అంటూ మంత్రులు కూడా లేసారు.

—–

చంద్రబాబు సచివాలయం నుండి కరకట్ట మీదగా ఇంటికి చేరుకున్నాడు. భువనేశ్వరీ దేవి పెట్టిన రెండు పుల్కాలు తిని కొద్దిసేపు దేవాన్ష్‌తో గుర్రం ఆట ఆడుకున్నాడు. ఆ తర్వాత బెడ్‌ ఎక్కి నిద్రలోకి జారుకున్నాడు.

—–

చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేసారు. ఎంపీ సీఎం రమేష్‌ ఆధ్వర్యంలో మురళీమోహన్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, బుట్టా రేణుకా, కేశినేని నాని, సుజనాచౌదరి వంటి వాళ్ళు విజయవాడలో బావోచి బిరియాని సెంటర్‌ పక్కన నిరాహారదీక్షకు కూర్చు న్నారు. మంత్రులు తలా ఒక జిల్లాలో బంద్‌ను జరుపుతున్నారు. బస్సులు, లారీలు ఆపేసారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలను మూసేసారు. రోడ్ల మీద టైర్లు తగలబెట్టసాగారు. అన్న క్యాంటీన్‌ లను రోడ్ల మీదకే తెచ్చి వంట వార్పు పెట్టారు. చింతమనేని ప్రభాకర్‌ లాంటి నాయకులు ఇసుక లారీలు, ట్రాక్టర్లతో హైవేల మీద ప్రత్యేకహోదా కోసం ర్యాలీలు నిర్వహించసాగారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైళ్ళ నిలిపివేత కార్యక్రమం జరగ సాగింది. ఆయన పట్టాల మీద నిలబడి అటూ ఇటూ వేగంగా వెళుతున్న ట్రైన్‌లను బాలకృష్ణ మాదిరిగా చేతులు అడ్డుపెట్టి ఆపసాగాడు. లోకేష్‌ నాయకత్వంలో పారాచూట్‌ బృందం విజయవాడలో ఒక్కసారిగా ఆకాశంలోకి లేచింది. వీళ్ళు ఆకాశంలో తేలియాడుతూ పసుపు జెండాలు చేతబట్టి అటు ఇటు వెళ్ళే విమానాలను ఆపేయడానికి ప్రయత్నించ సాగారు…

ఏపిలో తెలుగుదేశం బంద్‌ తీవ్రత సెగలు ఢిల్లీలోని ప్రధానమంత్రి మోడీ కార్యాలయాన్ని తాకాయి. ఇంకా ఆలస్యం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ అగ్నిగుండంగా మారడం ఖాయమని నిఘా విభాగం చేసిన హెచ్చరికతో ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాడు. తన స్వహ స్తాలతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ వ్రాసి పోస్ట్‌ చేశాడు.

———-

అప్పుడే పోస్ట్‌మెన్‌ తెచ్చిచ్చిన లెటర్‌ను భువనేశ్వరీ దేవి తెచ్చి చంద్రబాబు చేతిలో పెట్టింది. అది పిఎం కార్యాలయం నుండి వచ్చిన లెటర్‌ కావడంతో చంద్రబాబు ఆత్రుతగా ఆ లెటర్‌ చించి చదవడం మొదలుపెట్టాడు.

ప్రపంచంలోనే అత్యంత మేధావి నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలతో…

మీరు చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రత మాకు తెలిసొచ్చింది… మీ ఉద్యమాలను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శివుడు మూడోకన్ను తెరిస్తే ఏమవుతుందో నాకు తెలియదుగాని, మీరు ఆగ్రహిస్తే ఆంధ్రా అగ్నిగుండమవు తుందని గ్రహించాను. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మేము సిద్ధమే. కాకపోతే చిన్న కండీషన్‌… మీ అబ్బాయి లోకేష్‌ చేత ఒక మాట కూడా తప్పు దొర్లకుండా తెలుగు స్పీచ్‌ ఇప్పించండి… వెంటనే ప్రత్యేకహోదా ఇస్తాం…

ఇట్లు …

మీ మోడీ.

అది చదవగానే చంద్రబాబు ఆవే శంతో… ఇది ఛీటింగ్‌, ఇది అన్యాయం అంటూ కేకలు వేయసాగాడు. ఆ అరు పులకు పక్కనే నిద్రపోతున్న భువనేశ్వరీ దేవి ఉలిక్కిపడి లేచి పక్కన వున్న చెంబు లోని నీళ్ళు తీసి చంద్రబాబు ముఖాన చల్లింది. ఆ దెబ్బకు ఆయన టక్కున లేచి కూర్చున్నాడు. అప్పటిదాకా జరిగింది కల అని తెలుసుకోవడానికి ఆయనకు అర గంట పట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here