Home గల్పిక లోకేష్‌కు ఇంటర్నేషనల్‌ అవార్డు

లోకేష్‌కు ఇంటర్నేషనల్‌ అవార్డు

హైటెక్‌ రత్న, నవ్యాంధ్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో ఎన్నికల సభలు ముగించు కుని గ్రాఫిక్స్‌ రాజధాని అమరావతి ఉండవల్లిలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్లేసరికే అప్పటికే అక్కడ దేవగుడి ఆదినారాయణరెడ్డి, జయ రామయ్య, భూమా అఖిలప్రియ, మణి గాంధీ, జలీల్‌ఖాన్‌, జ్యోతుల నెహ్రూ, సుజయ్‌ రంగారావు, పాశం సునీల్‌, గిడ్డి ఈశ్వరి, మెతుకు రాజేశ్వరి, గొట్టిపాటి రవికుమార్‌, అమర్‌నాథ్‌ వంటి 22మంది దాకా వైసిపి నుండి తెలుగుదేశంలో దూరిన ఎమ్మెల్యేలున్నారు. వాళ్లను చూడగానే చంద్రబాబు మనసులో… ఈ జంపింగ్‌ బ్యాచ్‌ అంతా కట్టకట్టుకుని వచ్చిందేటబ్బా అనుకుంటూ వారివైపు తీక్షణంగా చూశాడు. అందరి ముఖా లలోనూ కోపంతో కూడిన ఆక్రోశంతో మిళితమైన ఆవేశం కనిపిస్తోంది. వీళ్లెక్కడో హర్ట్‌ అయ్యారని పసిగట్టిన చంద్రబాబు… ఏంటి సంగతి అని అడి గాడు. వెంటనే జలీల్‌ఖాన్‌… ఎంత ఒకవేళ మేం బికాంలో ఫిజిక్స్‌ చదివి నోళ్ళమైతే మాత్రం మీ కంటికి అంత చీప్‌గా కనిపిస్తున్నామా? అని కోపంగా అడిగాడు. ఏ విషయం మీరు మాట్లాడు తున్నారని చంద్రబాబు అడిగాడు. అమర్‌నాథ్‌రెడ్డి వెంటనే… తెలంగాణ ప్రచార సభలలో ఏమన్నారు, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన వాళ్ళను ఓడించమని పిలుపునిస్తారా? రేపు ఇక్కడ కూడా మీరు చెప్పబోయేది అదే కదా! మేమంతా ఓడిపోవాలనే కదా మీ ఉద్దేశ్యం అని అన్నాడు. అందుకు చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా ఎస్‌.వి.రంగారావు లెవల్లో నవ్వి… మీ తెలివి తెల్లారినట్లే వుంది… ఈరోజు మాట్లాడిన దానికి పూర్తి వ్యతిరేకంగా నేను పక్కరోజే మాట్లాడగలను, అట్లాంటిది ఏపి ఎన్నికలకు ఇంకా ఆరునెలలు న్నాయి… ఇంకెన్ని మాటలు మార్చొచ్చు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్య ద్రోహులు… కాని ఆంధ్రాలో అలా కాదు, వైసిపి నుండి తెలుగుదేశంలో చేరినవాళ్ళంతా అభివృద్ధి వాంఛితులు, ప్రజాస్వామ్య రక్షకులు. రాజ్యాంగస్ఫూర్తి ప్రదాతలు. మీకు చిన్న ఎగ్జాంపుల్‌ చెబుతాను… గంగానదిలో ఓ బకెట్‌

నీళ్ళు తీసి మురికి కాలువలో పోస్తే ఏమవుతాయి అని అడిగాడు. అవి కూడా మురికి నీళ్ళే అవుతాయి అని ఆది నారాయణరెడ్డి చెప్పాడు. మరి అదే మురికి కాలువను గంగానదిలో కలిపితే ఏమవుతుంది అని చంద్రబాబు మళ్ళీ అడిగాడు. మురికి నీళ్ళు కూడా పవిత్ర గంగాజలం అవుతాయని సుజయ్‌రంగా రావు చెప్పాడు. దీన్ని బట్టి మీకు పొలిటి కల్‌ లాజిక్‌ అర్ధమైవుంటుంది. తెలుగు దేశం గంగా నది లాంటిది. కాబట్టి ఇక్కడ నుండి వెళ్లినవాళ్ళు పాపాత్ములవుతారు. ఇందులోకొచ్చిన వాళ్ళు పుణ్యాత్ములవు తారు. ఏపి ఎలక్షన్‌లలో ఆల్‌రెడీ మీ కోసం ఒక స్లోగన్‌ సిద్ధం చేసాను. ‘అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం తెలుగుదేశంలో చేరిన త్యాగమూర్తు లను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని పిలుపునివ్వబోతున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న జంపింగ్‌ ఎమ్మెల్యే లంతా… మీలాంటి నాయకుడు అండగా మాకు ఉండగా… ఇంకేం దిగులు అను కుంటూ అక్కడనుండి బయలుదేరారు.

వాళ్ళటు వెళ్లగానే ముదురుదోమల శాఖ మంత్రి, నైట్‌రైడర్‌ పి.నారాయణ పరుగెత్తుకుంటూ వచ్చి… సార్‌, మన అమరావతికి మరో రికార్డు వచ్చింది అని రొప్పుతూ చెప్పాడు. చంద్రబాబు వెంటనే ప్యూన్‌ చేత ఒక గ్లాసు వాటర్‌ తెప్పించి నారాయణకిచ్చి… ముందు ఇవి తాగి ఆ గస తగ్గించుకో… తీరిగ్గా ఏమైందో చెప్పు అని అన్నాడు. నారాయణ నీళ్ళు తాగి రెండు నిముషాలకు రిలాక్స్‌ అయ్యి… సార్‌, మన అమరావతికి ఊహించని రికార్డు దక్కింది. ఇప్పటి వరకు భారతదేశంలో గొప్ప గ్రాఫిక్స్‌ సినిమాలుగా బాహుబలి, రోబో అని అనుకుంటున్నామా? కాని ఒక సంస్థ వాళ్ళు వీటిలో ఏ గ్రాఫిక్స్‌ బాగున్నాయని రోబో, బాహుబలి, అమరావతి… ఈ మూడింటి మధ్య ఆన్‌లైన్‌ కాంపిటీషన్‌ పెడితే 70శాతం మంది అమరావతి గ్రాఫిక్స్‌కే మద్దతు తెలిపారని చెప్పాడు. అది విన్న చంద్రబాబు శెభాష్‌ నారా యణ… మంచి వార్త చెప్పావు… మన ఆస్థాన మీడియాలో ఈ కీర్తిని ప్రచారం చేయించండి. గ్రామాల నుండి ప్రధాన నగరాల వరకు అన్ని చోట్ల దీనిపై ఫ్లెక్సీలు వేయించండి… ప్రతి జిల్లాలో వారం రోజుల పాటు ‘అమరావతి గ్రాఫిక్స్‌ విజయోత్సవ వేడుకలు’ నిర్వహించండి, దీని కోసం జిల్లాకో 10కోట్లు మంజూరు చేస్తున్నాను అని ప్రకటించాడు. అలాగే సార్‌, అంటూ నారాయణ అక్కడనుండి వెళ్లిపోయాడు.

చంద్రబాబు లోపలకెళ్లి స్నానం చేసి డైనింగ్‌ టేబుల్‌ వద్దకు వచ్చాడు. భువనేశ్వరీదేవి ఒక్కోటి 15గ్రాముల బరువుండే రెండు పుల్కాలు, దాంట్లో 10గ్రాముల పప్పు వడ్డించింది. అర నిముషంలో వాటిని తిన్న చరద్రబాబు… ఇంకో పుల్కా వేయవా అని అడిగాడు. అందుకు భువనేశ్వరీ ఏం వెలగబెడు తున్నారని ఇంకో పుల్కా పెట్టాలి, అసలే ఆస్తులు తగ్గిపోయి అప్పుల్లో వుంటు న్నారు. మీకంటే దేవాన్ష్‌ నయం. 18కోట్ల ఆస్థి సంపాదించాడు అని చెప్పింది. అప్పుడు చంద్రబాబు మనసులో… ఎంత ముఖ్యమంత్రినై ఏం లాభం, కడుపుకు ఇంకో ఎగస్ట్రా పుల్కా తినలేకపోతిని, రేపట్నుండి ఇలా కాదు, మూడు పూటలా అన్న క్యాంటీన్‌లో తింటే సరి, రోజుకు 15రూపాయలతో పోతుంది అనుకుని హాల్‌లోకి వచ్చి టీవీ ఆన్‌ చేసి ఏబిసి ఛానెల్‌ పెట్టాడు. అప్పుడే ఫ్లాష్‌ న్యూస్‌ వస్తోంది… ”ప్రపంచ ప్రతిభావంత యువనేతల్లో ఒకరిగా నారా లోకేష్‌”… ఈ న్యూస్‌ చూసి చంద్రబాబే షాక్‌కు గురయ్యాడు. ఆ షాక్‌లో ఆయన అక్కడే సోఫాలో కూలబడి నిద్రపోయాడు.

్య్య్య్య్య

అదోపెద్ద హాల్‌… ‘దిబిడి దిబిడే’ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. మన్మోహన్‌సింగ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి, సోనియాగాంధీ, చంద్రబాబునాయుడులు అతిథులుగా వచ్చారు. దిబిడి దిబిడే సంస్థ సారధి డబ్బా డబాల్కర్‌ మైక్‌ ముందు మాట్లా డుతూ… మా సంస్థ ఆన్‌లైన్‌ సర్వే చేయగా… అత్యంత ప్రభావశీలవంతమైన నేతల్లో నారా లోకేష్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈ విషయంలో ఆయన రాహుల్‌గాంధీని సైతం మించిపోవడం విశేషం. కాబట్టే ఈరోజు ఆయనకు ఈ ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ‘ఉత్తమ ప్రపంచ యువనేత’ అవార్డును ప్రదానం చేస్తున్నామని ప్రకటించాడు. అప్పుడు సభ మధ్యలో నుండి… ఆపండి అన్న కేకలు వినిపించాయి. అందరూ అటు చూసారు. అక్కడ వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి, కేటీఆర్‌లు వున్నారు. ఎందుకు ఆపమ న్నారని డబ్బా డబాల్కర్‌ ప్రశ్నించాడు. అప్పుడు కేటీఆర్‌… లోకేష్‌ ఎందులో గొప్ప అని ఈ అవార్డు ఇస్తున్నారు. 40 ఏళ్ళ వయసులోనే పార్టీని పెట్టి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌కంటే గొప్పోడా? తెలంగాణ ఉద్య మంలో ముందుండి నడిచి, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు తెప్పించిన నాకంటే గొప్పోడా? యూపిలో సీఎంగా పనిచేసిన యువనేత అఖిలేష్‌ యాదవ్‌ కంటే మెరుగైనవాడా? ఎందుకు ఇస్తున్నారు ఆయనకు ఆ అవార్డు అని ప్రశ్నించాడు. అప్పుడు డబ్బా డబాల్కర్‌… మీ అందరి కంటే కాదు, ప్రపంచంలోని అందరి యువనేతల కంటే గొప్పోడు లోకేష్‌బాబు. తన సొంత పార్టీనే ఈ దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ, కులపిచ్చి, మత పిచ్చి వున్న పార్టీగా ప్రకటించిన ధైర్యశాలి, వర్ధంతులకు సైతం ప్రజలకు శుభా కాంక్షలు చెప్పగల మానవతావాది, ఆయన ఏం మాట్లాడినా సంచలనం… ఆయన ఏం చేసినా అద్భుతం. ఆయన ప్రసంగాల వీడియోలు అంతర్జాతీయంగా సోషల్‌ మీడియాను ఒక ఊపు వూపే స్తున్నాయి. ఈనాటి యువసమాజాన్ని ఆయన తన ప్రసంగాలతో అలా ఆకట్టు కుంటున్నారు. ఈ విషయంలో రాహుల్‌ గాంధీ కూడా ఆయనతో పోటీ పడలే కున్నారు. అలాంటి యువనేతకు ఈ అవార్డు ఇవ్వడం తప్పెలా అవుతుంది అని ప్రశ్నించాడు. తప్పే లేదు అన్నట్లు కేటీఆర్‌, జగన్‌లు ఇద్దరూ తలలు దించుకున్నారు. లోకేష్‌ నేరుగా వేదికనెక్కి మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీల చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుం డగా, సభలో చప్పట్లు మార్మోగాయి. పుత్రోత్సాహంతో చంద్రబాబు కూడా చప్పట్లు కొట్టసాగాడు. అలా కొడుతూనే వున్నాడు.

అప్పుడు ఆయన ఒంటిపై ఎవరో చెయ్యేసి… ఏమండి ఏమండి అని తట్టారు. అప్పుడు చంద్రబాబు ఉలిక్కిపడి లేచాడు. చుట్టూ చూసాడు. సభ లేదు, సన్మానం లేదు… తాను సోఫా మీద వున్నాడు. ఎదురుగా భువనేశ్వరి వుంది. ఏమైందని చంద్రబాబును ఆమె అడిగింది. తనకు వచ్చింది కల అనే విషయం అర్ధమైన చంద్రబాబు ఆ కల గురించే ఆమెకు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here